(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం 
*నరమేధానికి స్వస్తిపలకాలి*:
*దేశ సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకే ఆపరేషన్ కగార్*:
*ఆపరేషన్ కగార్ ను ఆపాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జూన్ 23న ఛలో రాజ్ భవన్ కార్యక్రమ గోడ పత్రిక విడుదల*: కళ్ళు ధర్మేంద్ర ఏఐవైఎఫ్
మావోయిస్టులతో శాంతి చర్చలు జరపకుండా ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక గిరిజనులను,మావోయిస్టులను హతమారుస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ, నరమేధానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను హిమాయత్ నగర్ లోని సత్య నారాయణ రెడ్డి భవన్లో జరిగిన పత్రికా సమావేశంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా *ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర* మాట్లాడుతూ ఒకవైపు ప్రజలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, మావోయిస్టులు కేంద్రంతో చర్చలు జరుపుతాం, శాంతియుతంగా సమస్యను పరిష్కరిద్దాం, ఆయుధాల విషయాన్ని కూడా చర్చిద్దామంటూ కేంద్ర ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశారనీ, లేఖలు రాశారని గుర్తు చేశారు. అయినా కేంద్ర ప్రభుత్వం మూర్ఖంగా మావోయిస్టులను, గిరిజనులను కాల్చి చంపే నరహంతక చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. చత్తీస్ ఘడ్ అడవుల్లో కార్పొరేట్ సంస్థలకు అక్కడ ఉండే బొగ్గు, ఇనుము,సున్నపురాయి, డోల మైట్, బాక్సైట్ ఖనిజ సంపాదనంతా ధారాదత్తం చేయడానికి ఆటంకంగా ఉన్నది, కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు.
పాలకులు అనుసరిస్తున్న విధానాలతో దేశం ఒక విచిత్రమైన సంక్షోభంలోకి పడిపోయిందన్నారు. దండకారణ్యం నెత్తురోడుతోందని, విప్లవోద్యమం అణిచివేతే లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్ కగార్ ఆదివాసీ హననానికి కారణం అవుతున్నదని అన్నారు. కార్పొరేట్ దోపిడీని వ్యతిరేకిస్తున్న ఆదివాసీ సమాజానికి అండగా ఉన్న విప్లవోద్యమాన్ని నిర్మూలించడం ద్వారానే పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడగలమన్న భావనతో మోడీ ప్రభుత్వం దేశ ప్రజలపై యుద్ధం చేస్తున్నదని చెప్పారు. ఈ మారణ హెూమానికి అర్థవంతమైన పరిష్కారం వెతకాలనే ఉద్దేశంతో శాంతి చర్చలు జరపాలని ప్రజాస్వామిక వాదులు ప్రతిపాదనను ముందుకు తెచ్చారని తెలిపారు. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతున్నా ఖాతరు చేయని కేంద్ర ప్రభుత్వం యుద్ధ బీభత్సాన్ని సృష్టిస్తున్నదన్నారు. ఒకవైపు విప్లవ పార్టీ చర్చలకు సిద్ధమని, కాల్పుల విరమణ పాటిస్తామని ప్రకటించినా ప్రభుత్వం మాత్రం తుపాకీతోనే పరిష్కరిస్తామనడం అమానవీయం అన్నారు. ఇది మావోయిస్టుల సమస్య కాదని, ఆదివాసులదీ, ప్రజలదని తెలిపారు. ఆటవీ ప్రాంతాల్లో సంపదను.. కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం ఆదివాసులకు అండగా నిలబడుతున్న మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం ప్రకటించడం రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాయడమేనని అన్నారు. లక్షలాదిమంది భద్రతా బలగాలను మోహరించి వాయుసేనకు చెందిన హెలికాఫ్టర్లు డ్రోన్లు, బాంబులతో ఆదివాసీలపై అంతర్యుద్ధాన్ని చేస్తున్నాయని, అంతర్యుద్ధం ప్రకటిస్తే అంతర్జాతీయ న్యాయ సూత్రాలను పాటించాల్సి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మావోయిస్టులతో చర్చల ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించి శాంతియుత వాతావరణానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా *ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్* కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా 2026 మార్చ్ 26 వరకు మావోయిస్టులను అంతం చేస్తానని ప్రకటించారని, ఈ ప్రకటనను ప్రజలు జాగరూకతతో గమనించాలని మార్చ్ 26వ తేదీన శ్రీరామనవమి వున్నదని, మతాలు, కులాలు మధ్య విభజన విచ్చిన్న రాజకీయాలకు తెరలేపడమే బీజేపీ ప్రధాన ధ్యేయమని వారు అన్నారు. ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జూన్ 23న అడవుల్లోని ఖనిజ సంపదను, వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టే “ఆపరేషన్ కగార్”ను ఆపాలని,ఆదివాసీలపై దమనకాండను ఆపాలని, కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణను ప్రకటించి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఛలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు ప్రకటించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి యువజన సంఘ నేతలు పెద్ద ఎత్తున హాజరుకానున్నట్లు వారు తెలిపారు.
ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీమాన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్. బాలకృష్ణ, సల్మాన్ బేగ్ రాష్ట్ర సమితి సభ్యులు షేక్ మహమూద్,మాజీద్ అలీ ఖాన్, మోసిన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.