(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఉభయ కమ్యూనిస్టు పార్టీల విలీనాన్ని కాంక్షించిన సుగుణమ్మ
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు శాకమూరి సుగుణమ్మ’సంస్మరణ సభ
నేటి సత్యం కొండాపూర్. జూన్ 28
ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసేందుకు,.అణగారిన వర్గాలకు ప్రాణం పోసేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీల విలీనాన్ని కాంక్షించిన సుగుణమ్మ ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఆసన్నమైందని పలువురు వక్తలు అన్నారు. హైదరాబాద్, కొండాపూర్, సిఆర్ ఫౌండేషన్, ఇంద్రజిత్ గుప్తా హాల్ లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ప్రముఖ కమ్యూనిస్టు నేత శాకమూరి సుగుణమ్మ సంస్మరణ సభ ఆదివారం జరిగింది. ఈ సభకు సీఆర్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు, సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ హాజరై మాట్లాడుతూ సుగుణమ్మ ఆమె మరణం మహిళా ఉద్యమాలకు తీరని లోటు అని అన్నారు. సుగుణమ్మ తన చివరి ఊపిరి ఉన్నంత వరకు కూడా ఉద్యమాల కోసం పని చేశారని గుర్తు చేశారు. సమాజం మనకు ఏం ఇచ్చిందనే భావనతో కాకుండా, మనం సమాజానికి ఏం చేశామనే ఆలోచనతోనే ఆమె ఉద్యమంలో పాల్గొన్నారని నారాయణ అన్నారు.
సిపిఐ సీనియర్ నాయకులు కందిమళ్ల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆదర్శవంతమైన జీవితం గడిపిన సుగుణమ్మ పోరాట యోదురాలని కొనియాడారు. ఉద్యమాలను ఎలా చేయాలో రాబోయే తరాలకు సుగుణమ్మ బాట వేశారన్నారు. ఆమె జీవితం మొత్తం కమ్యూనిస్టు ఉద్యమాలతోనే ముడిపడిందన్నారు. భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన సుగుణమ్మ ఉద్యమ కాలంలో ఎన్నో కష్టాలను అనుభవించారని, ఆమె భర్త ఎస్.వి.కె. ప్రసాద్ తోడుగా ఉద్యమంలో పాల్గొన్నారని, కమ్యూనిస్టులు ఏకం కావాలన్నదే ఆమె చివరి కోరిక అని తెలిపారు.
- తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలవాలని ప్రజలు బలంగా కోరుతున్నారని, సుగుణమ్మ కోరిక కూడా అదేనని అన్నారు. కర్రగుట్ట, ఛత్తీస్ ఘడ్ మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం ఊచకోత కోస్తుంటే ఎందుకు ఆత్మవిమర్శ చేసుకోవడం లేదని, తుపాకీతో కేంద్రాన్ని పడగొట్టే సత్తా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై చర్చించాలని, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఐక్యత దిశగా చర్చలు కొనసాగాలని శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. సిపిఐ, సిపిఐ (ఎం) చీలిపోవడం ఒక చీకటి రోజుగా అభివర్ణించారు. సిపిఐ,సిపిఐ(ఎం) ఎందుకు చీలిపోయామో ఎవరికీ తెలియదని, ఈ రెండు పార్టీలు కలవాలని తీర్మానం చేసుకున్న తర్వాత కూడా ఇంత వరకు కలవలేదన్నారు. పార్టీల కంటే ముందుగా ప్రజాసంఘాలను కలిపేందుకు సర్కూలర్ జారీ చేసినప్పటికీ ఫలితం లేకుండాపో యిందన్నారు.

సిఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ చిన్నతనం నుంచే సుగుణమ్మ ఉద్యమ బాట పట్టారని, ఆమె త్యాగాలు తమకు స్పూర్తిధాయకమన్నారు. కమ్యూనిస్టులు లేని సమాజం చూడలేమని సుగుణమ్మ అనేకసార్లు అనేవారని గుర్తు చేశారు. డిసెంబర్ 26న ఖమ్మం జిల్లాలో జరిగే సిపిఐ శత వార్షికోత్సవాల ముగింపు సభ జరిగే వరకు సుగుణమ్మ బతికిఉండే బాగుండేదని అన్నారు. భవిష్యత్తులో శక్తివంతమైన ఉద్యమం రావాలంటే సుగుణమ్మ స్పూర్తితో వామపక్ష పార్టీల ఐఖ్యతను తీసుకురావడానికి ఆచరణలోకి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు.
సిఆర్ ఫౌండేషన్ కార్యదర్శి, మాజీ ఎమ్యెల్యే పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పది మందిలో చైతన్యం తీసుకొస్తూ సుగుణమ్మ ఉద్యమాలను నడిపించారని గుర్తు చేశారు. సుగుణమ్మను 15 రోజుల క్రితం సిపిఐ నాయకులు రత్నాకర్ కలిసి తాను పరామర్శించానని, ఆ రోజు ఆమెతో మాట్లాడిన చివరి మాటలను పల్లా వెంకట్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఏ ఆశయంతో భూస్వామ్య కుటుంబం నుంచి సుగుణమ్మ వచ్చిందో,ఆ ఆశయ సాధన దిశగా మునుముందు పనిచేస్తామన్నారు. మహిళా ఉద్యమాలు తగ్గుతున్నాయని, కొత్తగా యువత ముందుకు రావడం లేదని, ఉద్యమాలను ముందుకు తీసుకుపోయేందుకు కార్యచరణ చేపట్టాలని సుగుణమ్మ తన చివరి క్షణం వరకు ఎంతో తపన పడ్డారని పల్లా వెంకట్ రెడ్డి అన్నారు.
సి.ఆర్ ఫౌండేషన్ కోశాధికారి వి.చెన్నకేశవరావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, సిపిఐ సీనియర్ నాయకురాలు ప్రేమ్ సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి.జ్యోతి, సి.ఆర్ ఫౌండేషన్ పాలిక్లినిక్ డైరక్టర్ డాక్టర్ కె.రజని, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నేదునూరి జ్యోతి, సుగుణమ్మ కూతురు డాక్టర్ శాకమూరి శోభ, కుమారులు డాక్టర్ శాకమూరి రవి, శాకమూరి రమేష్, సుగుణమ్మ సంరక్షకులు జిలాని తదితరులు సుగుణమ్మ ఉద్యమ చరిత్రను గుర్తు చేశారు. ఆమె ఆశయాల సాధన కోసం మునుముందు ఉద్యమాలను బలోపేతం చేస్తామన్నారు. అంతకుముందు సుగుణమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నేతలు ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మాజీ ఎమ్యెల్సీ పి.జె చంద్రశేఖర్ సిపిఐ సీనియర్ నాయకురాలు డాక్టర్.బి.వి.విజయలక్ష్మి, సి.ఆర్ ఫౌండేషన్ మహిళా సంక్షేమ కేంద్రం డైరక్టర్ జె.కల్పన, ఎన్ఆర్ఆర్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డా.టి. సురేష్, సభ్యులు కె. జ్యోస్నా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఇందిర తదితరులు పాల్గొన్నారు.