*ఓపిక చాలా పట్టాం .. ఇక ఉపేక్షించం..!*
*మీడియాను బెదిరిస్తున్న మీరు మాజీ మంత్రులేనా ..*
*మీకన్నా వీధి రౌడీలే నయం..*
*ఉద్యమ సమయంలో మీడియా సేవలు గుర్తుకు రాలేదా..?*
*మీడియా సంస్థలపై దాడి చేస్తామంటూ బెదిరిస్తారా..?*
*కాంగ్రెస్ సహనాన్ని పరీక్షించవద్దు..*
*తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు..*
*మహా టీవీపై దాడి, దౌర్జన్యం ప్రజలెవరూ హర్షించరు..*
*షాద్ నగర్ లో ఓ యువ నాయకుడి తతంగం త్వరలోనే..*
*ఫోన్ ట్యాపింగ్ అత్యంత హీనమైన చరిత్ర..*
*బీఆర్ఎస్ నాయకుల బెదిరింపులపై షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి “శంకర్ ధ్వజం”* 
ఫోన్ ట్యాపింగ్ పేరుతో చరిత్ర హీనులయ్యారు.. పదేళ్ల పాలనలో అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకున్నారు.. ఎంతోమందిని బెదిరించి ఆస్తులు కాజేశారు.. సమాజానికి ఉపయోగపడే మీడియా సంస్థలను బ్లాక్మెయిలింగ్ చేసి తమ గుప్పెట్లో ఉంచుకుందాం అనుకుంటున్నారు.. తమ దారికి రాని వారి పట్ల దాడులకు దిగుతున్నారు.. జర్నలిస్టులపై అక్రమ కేసులు రౌడీషీట్లు పెట్టారు. తెలంగాణ వాదుల ముసుగులో మీరు సాగించిన విధ్వంసాన్ని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది ఇప్పుడు.. వీళ్లు మాజీ మంత్రులా.. కాదు దోపిడీకి పాల్పడ్డ మహా దౌర్జన్యకారులు.. చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నాం.. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు.. మీడియాపై దాడి క్షమార్హం కాదు.. వీళ్లకు రోజులు దగ్గరపడ్డాయి.. అంటూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహా టీవీ ఛానల్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మీడియా సంస్థలు, మీడియా ప్రతినిధులు చేసిన కృషి వల్లనే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉందని గుర్తు చేశారు. చేసిన మేలు మరిచిపోయి అన్ని రంగాలలో ఇలా దిగజారడం వల్లనే ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని అన్నారు. స్వతంత్ర పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు అన్నింట అక్షర పోరాటం చేసినందు వల్లనే మీడియా రంగాన్ని నాలుగవ మూల స్తంభంగా రాజ్యాంగం గుర్తించిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అలా అన్ని విధాల సహకరించే మీడియాపై బలిసి కొట్టుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు దాడికి పూనుకోవడం దురదృష్టకరమన్నారు.
*జగదీశ్వర్ రెడ్డిది హీన చరిత్ర..*
పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్న జగదీశ్వర్ రెడ్డిది అత్యంత హీనమైన చరిత్ర అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. స్కూటర్ కూడా గతి లేని జగదీశ్వర్ రెడ్డి మద్దూరు వద్ద సుమారు 90 ఎకరాల ఫామ్ హౌస్ కు యజమాని ఎలా అయ్యాడో చెప్పాలని ప్రశ్నించారు. నేతలు, అధికారులు, చివరికి సినిమా వాళ్ళను కూడా ఫోన్ టాపింగ్ చేసి వేధించింది నిజం కాదా.. అలాంటప్పుడు నిజాలు రాసే మీడియా సంస్థల మీద దాడులు ఎందుకో చెప్పాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వాళ్ళ లాంటి వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్లి మరి వేధించింది వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చట్టబద్ధంగా ముందుకు వెళుతుందని, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుందని ఆలస్యమైన వీళ్ళపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాలమూరు జిల్లాలో ఎన్ని భూములు ఆక్రమించాడో, ఎంతమంది అమాయకులను మానసికంగా వేధించాడు అందరికీ తెలుసని ఆయన అన్నారు. సమాజానికి చీడపురుగుల్లా మారిన ఈ నాయకులకు తగిన బుద్ధి చెప్తామని అన్నారు. మీడియా సంస్థలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని, వారిపై దాడి చేస్తే ఎట్టి పరిస్థితులను సహించేది లేదని హెచ్చరించారు.
*బుడుబుక్కలోడి పని పడతాం..*
షాద్ నగర్ నియోజకవర్గంలో కూడా ఒక బుడుబుక్కల నాయకుడు ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించాడని, దానికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. త్వరలో వాడి నిజస్వరూపం వెలుగులోకి తెచ్చి ప్రజాక్షేత్రంలో చట్ట ప్రకారం శిక్షపడేలా చేస్తామని పేర్కొన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న అలాంటి వారికి పుట్టగతులు లేకుండా చేయడానికి కాంగ్రెస్ వెనుకాడదని స్పష్టం చేశారు.
*అంకుశం రామిరెడ్డి గతే పడుతుంది..*
మీడియాపై దాడి చేయడమే కాకుండా, మరికొన్ని మీడియా సంస్థలపై దాడులు చేస్తామంటూ హెచ్చరించిన జగదీశ్వర్ రెడ్డికి అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే పడుతుందని గిరిజన ఆదివాసి కోఆర్డినేటర్ పి .రఘు నాయక్ అన్నారు. తప్పు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని అంకుశం సినిమాలో రామిరెడ్డిని హీరో రాజశేఖర్ ఈడ్చుకు వెళ్లినట్లు ఈడ్చుకు వెళ్లి జైలు కూడు తినిపిస్తామని హెచ్చరించారు. పోలీసు యంత్రాంగం ఇలాంటి వారిపై దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో తమ బండారం బయటపడినందువల్లనే తట్టుకోలేక మీడియాపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. నేతలు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, అగునూరు బస్వం, బాలరాజు గౌడ్, కొంకళ్ల చెన్నయ్య, చెంది తిరుపతిరెడ్డి, ఇబ్రహీం, దర్శన్, పురుషోత్తం రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు..