*సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్ ప్రారంభోత్సవ సభ*
నేటి సత్యం.హైదరాబాద్. జులై 10
బిహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరుతో ఒక వర్గానికి చెందిన ఓట్లను తొలగించేందుకు ఎన్నికల కమిషన్ ప్రయత్నం చేస్తున్నదని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. బిహార్ మాదిరిగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, కేరళ తదితర ఏ రాష్ట్రంలోనైనా ఓటర్లను తొలగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రజలు, ప్రజాస్వామ్య పార్టీలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. హైదరాబాద్ హిమాయత్ పునర్ నిర్మితమైన సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్ ప్రారంభోత్సవం గురువారం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభలో రాజా ప్రసంగిస్తూ దేశంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించి నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగ బద్ధమైన ఎన్నికల కమిషన్ చర్యలు ఓటర్లకు ప్రమాదకరంగా మారాయన్నారు. అందుకే బిహార్ ప్రత్యేక సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడి ముందుకు తీసుకు వెళ్లడానికి లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలు, శక్తులను బలోపేతం చేయవలసిన అవసరం ఉందని డి.రాజా అన్నారు. ‘భారతదేశం ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. అనేక క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. కేంద్రంలో మతతత్వ శక్తులు అధికారాన్ని హస్తగతం చేసుకున్నాయి. ఆ శక్తులు తమ చేతుల్లో ఉన్న రాజకీయ శక్తిని, ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి అంబేద్కర్ సహా మహానీయులు అందించిన రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తున్నాయి. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు, రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన లౌకిక, ప్రజాస్వామ్య, సంక్షేమ దేశాన్ని మతతత్వ, ఫాసిస్టు శక్తులు దేశాన్ని మతరాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే దేశాన్ని, దేశ చరిత్రను మార్చేందుకు రాజ్యాంగం నుంచి సెక్యులరిజం పదాన్ని తొలగించడమే లక్షంగా పెట్టుకున్నాయి” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన లౌకిక, ప్రజాస్వామ్య, ఫెడరల్ వ్యవస్థలు మతతత్వ ఫ్యాసిస్టుల శక్తుల దాడికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత లౌకిక, ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 9వ తేదీన కార్మిక, ఉద్యోగ దేశవ్యాప్త సమ్మె విజయవంతమైందని, ఇలాంటి ఉధృతమైన పోరాటాలను దేశ ,కార్మికవర్గ, పేదల ప్రయోజనాల కోసం భవిష్యత్తులో కొనసాగించాల్సిన అవసరముందన్నారు. కుల, మత రహిత సోషలిస్టు సమాజ నిర్మాణం కమ్యూనిస్టుల లక్ష్యమని, ఆ లక్ష్యం కోసం, మెరుగైన భారతదేశం కోసం కమ్యూనిస్టులు నిరంతరం పోరాడుతామని ఉద్ఘాటించారు.
విప్లవానికి నిలయం మఖ్ధూంభవన్
పునర్ సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూభవన్ కేవలం పార్టీ కార్యాలయం కాదని, ఇది తెలంగాణ రాష్ట్రంలో విప్లవానికి నిలయమని, విప్లవ పోరాట కార్యక్రమాలకు, విప్లవోద్యమ సాహిత్యానికి నిలయమని, ఇక్కడికి వచ్చిన కమ్యూనిస్టు శ్రేణులు పోరాట స్ఫూర్తితో ముందుకు వెళతారని రాజా అన్నారు. కమ్యూనిస్టులు అంటే ఒక జీవన విధానం అని, మానవతావాదులని, ఒక సిద్ధాంతం, ఒక సంస్కృతి అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు లౌకిక, ప్రజాస్వామ్య శక్తులలో సిపిఐకి మంచి గుర్తింపు ఉండడం అభినందనీయమని ఆయన అన్నారు.
*వర్గ దోపిడీ కొనసాగినంత కాలం కమ్యూనిస్టులు ఉంటారు : సురవరం సుధాకర్ రెడ్డి*
ప్రపంచంలో వర్గ దోపిడీ కొనసాగినంత కాలం కమ్యూనిస్టులు ఉంటారని సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సువరం సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాపంగా నేడు తీవ్ర సంక్షోభంతో పాటు యుద్ద వాతావరణం నెలకొందన్నారు. అమెరికా అధ్యక్షులుగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత యుద్ద ప్రమాదాలు మరింత తీవ్రతరమయ్యాయని తెలిపారు. ఫలితంగా నిరుద్యోగం పెరిగి ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతుండగా, మరోవైపు కార్మికులు, యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడీ కొనసాగుతోందన్నారు. ఆ క్రమంలో ప్రపంచంలో పలు దేశాల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తుండగా, భారతదేశానికి ఉత్తరాన ఉన్న నేపాల్, దక్షిణాన ఉన్న శ్రీలంకలో కమ్యూనిస్టులు అధికారం చేపట్టడం హర్షనీయమన్నారు. దేశంలోప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఫాసిస్టు పాలన కొనసాగుతుందని, ఇది పూర్తి ఫాసిజమా, పాక్షిక ఫాసిజమా అని చర్చ జరుగుతోందని, అయితే ఈ ప్రభుత్వం మాత్రం ఫాసిజం వైపు వెళుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ బుధవారం జరిగిన సార్వత్రిక సమ్మెలో 25 కోట్ల మంది పాల్గొని నిరసన వ్యక్తం చేశారని, శ్రామిక వర్గానికి తన విప్లవ జేజేలు అని అన్నారు. ప్రజా సమస్యలపై వర్గ పోరాటం చేసి ఎంతో మంది అమరులయ్యారని, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న విజయాలను నిలబెట్టేందుకు పోరాటాలను మరింత ముందుకు తీసుకువెళ్ళాలన్నారు. తాము విద్యార్థి నాయకులు ఉన్న సమయంలో నిర్మించిన మగ్ధూంభవన్ 50 ఏళ్ల తర్వాత పునర్ నిర్మితం చేసిన భవనాన్ని తాను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
*లౌకిక, ప్రజాస్వామిక భారతదేశాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి ముందుకు సాగాలని టిపిసిసి అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.*
కమ్యూనిస్టు, కాంగ్రెస్ అనుబంధం విడదీయరానిదని, ఇది ఇలాగే కొనసాగిస్తూ ముందుకు సాగాలని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని కోరారు. హైదరాబాద్ హిమాయత్ పునర్ నిర్మితమైన సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్ ప్రారంభోత్సవ సభ గురువారం జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభలో మహేష్ సందేశమిస్తూ కాంగ్రెస్ పాటు కమ్యూనిస్టులు కూడా బలపడాలని కోరుకునే వ్యక్తిని తాను అన్నారు. కమ్యూనిస్టు భావజాలానికి మరణం లేదని, సిద్ధాంతాలకు కొదవలేదని, నాయకత్వం వస్తూనే ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శాసనససభ ఎన్నికల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలయికను ప్రజలు కూడా విశ్వసించారని చెప్పారు. 1976లో జరిగిన మగ్ధూంభవన్ ప్రారంభోత్సవ సమయంలో నాడు కాంగ్రెస్ మంత్రులు పాల్గొన్నారని, ప్రస్తుతం పునర్ నిర్మిత మగ్ధూం భవన్ ప్రారంభోత్సవంలో తాను పాల్గొన్నానని మహేష్ కుమార్ గుర్తు చేసుకున్నారు. మఖ్ధూం మొహియుద్దీన్ తన జీవితాంతం ప్రజల కోసమే పనిచేశారని కొనియాడారు. ప్రజా భవనాలు, కమ్యూనిస్టు ఆస్తులు ప్రజలకు ఉపయోగపడేవన్నారు.
లౌకికవాదమంటే అర్భన్ నక్సలైట్ ముద్ర వేస్తున్నారు
దేశం బలపడి, మరింత ముందుకు సాగాలంటే లౌకికవాద శక్తులు బలపడాలని మహేష్ అన్నారు. దేశాన్ని పాలిస్తున్న ఫాసిస్టు ప్రభుత్వం లౌకికవాదం అంటే అర్బన్ నక్సలైట్లుగా, ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడితే దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కాల్పులు జరుపుతోందని విమర్శించారు. దీనికి సంబంధించిన చర్చలలో తాను పాల్గొంటే, తనను కూడా అర్బన్ నక్సలైట్ చిత్రీకరిస్తున్నారన్నారు. అడవులో ఉన్న విలువైన ఖనిజ సంపదను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేందుకు నరమేధానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. తాను కూడా హిందూవునేనని, కానీ హిందూవు కార్డును ఉపయోగించుకోబోనని, కానీ కొందరు మేధావులు కూడా హిందూవు కార్డులను వాడుకోవడం దురదృష్టకరమన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినప్పటికీ కష్టనష్టాలను అధిగమిస్తూ తాము ముందుకు సాగుతున్నామన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు వెళున్నామని, మరింత చేయాల్సి ఉందని, ఇందుకు కమ్యూనిస్టుల సహకారం కావాలని కోరారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు కాంగ్రెస్, సిఎం రేవంత్ సహకరిస్తారన్నారు. డి.రాజా, సురవరం సుధాకర్ రెడ్డి జీవితాలు తమకు స్ఫూర్తి దాయకమని, వారు తమ జీవితం మొత్తం ప్రజలకు త్యాగం చేశారని మహేష్ కొనియాడారు. కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వేర్వేరుగా ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ, జాతీయ, లౌకికవాదం, ప్రజాస్వామ్యవాదం విషయంలో జాతీయ స్థాయిలో అందరూ కలిసి ముందుకు సాగుతామని అన్నారు. బిజెపి ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు రాజ్యాంగబద్ధ సంస్థలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని న్యాయవ్యవస్థను కాపాడాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు.
*ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు వేదికగా ‘మఖ్ధూంభవన్’*
సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ కెసిఆర్ పాలనలో ధర్నాలు నిషేధించారని, ఇందిరాపార్క్ ధర్నాచౌక్ ఎత్తివేసి, అనేక నిర్భాంధాలు విధిస్తే, అన్ని రాజకీయ పార్టీలకు ‘మఖ్ధూంభవన్’ నిరసనలకు వేదికగా మారిందని గుర్తు చేశారు. లౌకిక, ప్రజాస్వామ్య, వామపక్షవాదులు ఒక వేదిక మీదకు వచ్చారన్నారు. మావోయిస్టులు కాల్పులను విరమించిన తర్వాత కూడా ‘ఆపరేషన్ కాగర్’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా యుద్దం ప్రకటించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఏకపక్ష యుద్ధం ప్రకటించడాన్ని నారాయణ ఖండించారు. మనుషులను,నక్సలైట్లను కేంద్ర ప్రభుత్వం చంపవచ్చని, కానీ నక్సలిజాన్ని మాత్రం చంపలేరని స్పష్టం చేశారు.
*సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ*
తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులతో ప్రభుత్వం శాంతిపూర్వక చర్చలు నిర్వహిస్తే, దేశానికి ఒక మంచి సందేశాన్ని పంపించినట్టుగా ఉంటుందని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ సూచించారు. ఏమాత్రం అవకాశం ఉన్న ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపడం లేదని మండిపడ్డారు. ఎర్రజెండాలన్నీ ఒక్కటైతే కమ్యూనిస్టులకు ఎదురే ఉండబోదని చెప్పారు. వందేళ్లు అయినా కమ్యూనిస్టు పార్టీ మరింత పెరగడమే తప్ప తగ్గిందిలేదని కమ్యూనిస్టు నాయకులు నాలుగవ తరం కూడా వచ్చిందన్నారు. ‘మగ్ధూంభవన్’ అనేది ఒక వారసత్వం లాంటిదని, కమ్యూనిస్టులకు ఇదే తాజ్ చార్మినార్ అన్నారు. పెద్దలు నిర్మించిన భవనంలో పురావాస్తు లాంటి జ్ఞాపకాలు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ భవనాన్ని పునర్ నిర్మితం చేశామని కూనంనేని వివరించారు. మగ్దూంభవన్ పునర్ నిర్మితం పూర్తికావడంతో కమ్యూనిస్టు నాయకులు రాజ్ బహదూర్ గౌర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఇందుకు సహాయ సహకారాలు అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ కలిసి కోరినట్లు తెలిపారు. అదేవిధంగా ఇందకు సహకరించాలని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నమన్నారు.
*సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లి మాట్లాడుతూ*
పేద, ధనిక, కుల,మత,స్త్రీ,పురుష అసమానతలు లేని, సమాజ నిర్మాణానికి , సోషలిస్టు బావాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో దోపిడీ వర్గాలకు కమ్యూనిస్టులు, కమ్యూనిస్టు బావాలు కలిగిన వారే ప్రత్యామ్నాయం అవుతారని తెలిపారు. ఆ దిశగా ప్రత్యామ్నాయ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. మతోన్మాద, హిందూత్వ ఏజెండా పేరుతో కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన బిజెపి దోపిడీ వ్యవస్థకు,బావజలానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులను కలుపుకుని పోరాటం చేయాలని సూచించారు. బిజెపిని గద్దె దించేందుకు అందరూ కలిసి ముందుకు సాగాలన్నారు. సిపిఐ-(న్యూడెమోక్రసి ) రాష్ట్ర నాయకులు వెంకట్రామయ్య మాట్లాడుతూ హిందూత్వం, మతం పేరుతో ఫాసిస్టు ప్రమాదాన్ని తక్కువ అంచనా వేయవద్దని, అది అందరినీ మింగేస్తుందన్నారు. వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ రెండు కలిసి విద్యుత్ ఉద్యమం చేసి, చరిత్ర సృష్టించామని గుర్తు చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటికీ దండకారుణ్యంలో చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్ వ్యతిరేంగా జాతీయ స్థాయిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిపిఐ జాతీయ కార్యదర్శి డి.రాజా చొరవ తీసుకోవాలని కోరారు. తద్వారా పార్లమెంట్ సమావేశంలో ప్రతిపక్ష ఎంపిలు ఆపరేషన్ కగార్ అంశాన్ని లేవనెత్తాలని విజ్ఞప్తి చేశారు.సిపిఐ -మాస్ రాష్ట్ర నాయకుడు అన్వేష్ మాట్లాడుతూ కమ్యూనిస్టు వాసనే ఉండకూడదనే పరిస్థితుల్లో మగ్ధుంభవన్ సౌకర్యవంతంగా తీర్చిదిద్దడాన్ని అభినంధించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ముస్లిం, క్రైస్తవులు ఆ తర్వాత కమ్యూనిస్టులే లక్షం చేసుకున్న నేపథ్యంలో ఒక విప్లవ కేంద్రంగా మగ్ధుం భవన్ పునః నిర్మాణం ఎంతో దోహదపడుతుందని చెప్పారు. కేంద్రంలోని ఫాసిస్టు ప్రభుత్వాన్ని తిప్పికొట్టేందుకు లౌకిక, ప్రజాస్వామ్య శక్తులలో ఐక్యతవచ్చేందుకు అందరూ ప్రయత్నించాలన్నారు.ఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు జానకి రాములు మాట్లాడుతూ వామపక్ష ఉద్యమానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమ కేంద్రంగా మగ్ధుం భవన్ అనేక సేవలను అందిస్తుందన్నారు. చైతన్యవంతమైన ఉత్సాహాన్ని తీసుకొచ్చేందుకు మగ్ధుం భవన్ పునః నిర్మాణం ఎంతో దోహదపడుతుందన్నారు.
