*ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఐ పోరాటం*
*సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయ రాములు*
నేటి సత్యం. అమరచింత జూలై 12
పాలకుల వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ శ్రేణులు పోరాటం నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయ రాములు పిలుపునిచ్చారు. శనివారం అమరచింత మండల కేంద్రంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ లో జరిగిన సిపిఐ మండల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నిర్మాణం పై కార్యకర్తలతో మాట్లాడారు. గ్రామాల్లో సిపిఐ ఉద్యమాలను బలోపేతం చేసి పార్టీ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే మండల మహాసభలో ఆయన పార్టీ నిర్మాణం గురించి సుదీర్ఘంగా ప్రసంగించారు. మిగతా రాజకీయ పార్టీలకు సిపిఐ కి తేడా ఉందని ఓట్ల కోసం రాజకీయం చేసే పార్టీ సిపిఐ కాదని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర పరిపాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తించి వాటి పరిష్కారానికై సిపిఐ కృషి చేస్తుందని అన్నారు. గ్రామాలలో పార్టీని పటిష్ట చేసేందుకు సమస్యలను గుర్తించి ఉద్యమాలు చేస్తూ పార్టీ నిర్మాణాన్ని సంస్థాగతంగా పెంచాలని సిపిఐ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల అమలుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన ఈ 12 సంవత్సరాల కాలంలో మైనారిటీలకు దళితులకు బీసీలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుపరం చేసి బిజెపి ప్రభుత్వం విదేశీ కార్పోరేట్లకు అమ్ముడుపోయిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని అన్నారు. అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ రంగానికి అప్పజెప్పి ఈ దేశాన్ని అప్పుల పాలు చేస్తుందని ఆరోపించారు. కార్మికులకు కర్షకులకు మోడీ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు లేబర్ కోడ్ల ను తెచ్చి రైతులకు తీరని అన్యాయం చేసిందని అన్నారు. అంతకుముందు సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు శ్యాంసుందర్ అరుణ పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అబ్రహం పట్టణ కార్యదర్శి రవీందర్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు శ్రీహరి, టౌన్ గోపాలకృష్ణ రమేష్ కార్యదర్శి భాస్కర్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ తదితరులు పాల్గొన్నారు.