(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం.

*పారుతున్న వాగు..ప్రయాణానికి తప్పని పాట్లు.*
*అసంపూర్తిగా నిలిచిన వంతెన పనులు.*
*వారం రోజులుగా స్తంభించిన రాకపోకలు.*
*పట్టించుకోని ప్రజాప్రతినిధులు..అధికారులు పర్యవేక్షణ కరువు.*
రంగారెడ్డి,జులై 28: నేటి సత్యం
ప్రజాప్రతినిధులు పట్టించుకోరు..అధికారులు పర్యవేక్షణ కరువు వెరసి అసంపూర్తిగా వంతెన పనులు నిలిచి పోవడంతో అటు ప్రయాణికులకు,ఇటు వాహనదారులు ఇబ్బందులు తప్పడం లేదు..వివరాల్లోకి వెళ్తే…ఫరూఖ్ నగర్ మండలంలోని అయ్యవారిపల్లి గ్రామం వద్ద ఉన్న వాగు పనులు అసంపూర్తిగా నిలవడం,పైగా వర్షాకాలం కావడం,అందులోను గత వారం రోజుల నుండి వాగు ఏకతాటిగా పోతుందటంతో ప్రతి రోజు కష్టాలు ఎదుర్కొంటున్నామని గ్రామాల ప్రజలు,వాహనదారులు మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అయ్యవారిపల్లి కాస్త అవస్థల పల్లిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..ఏటా వర్షాలు మొదలవగానే ఈ గ్రామానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి.ప్రస్తుతం వాగు ప్రవహించడంతో గత వారం రోజులుగా అయ్యవారిపల్లికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.దీనికి తోడు,గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన వంతెన పనులు నేటికీ అసంపూర్తిగా ఉండటంతో గ్రామ ప్రజల కష్టాలు రెట్టింపు అయ్యాయి.
*వాగు రావడంతో స్థంభించిన రాకపోకలు.*
వాగు ప్రవహిస్తుండటంతో గ్రామంలోకి, గ్రామం నుంచి బయటకు వెళ్లే దారులు పూర్తిగా మూసుకుపోయాయి.పిల్లల చదువులు, శుభకార్యాలు,ఇతర పనులన్నీ నిలిచిపోయాయి.అత్యవసర వైద్య సేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కూలీ పనులకు వెళ్లేవారు,చిన్న వ్యాపారాలు చేసుకునేవారు పనులు లేక ఆర్థికంగా నష్టపోతున్నారు.తాత్కాలికంగా ఉన్న రహదారి కూడా పూర్తిగా కొట్టుకుపోవడంతో,వాగు ఉధృతి తగ్గినప్పటికీ ప్రయాణం అసాధ్యంగా మారింది.అదేవిధంగా ఇదే గ్రామం మీదుగా ఉప్పరిగడ్డ,ఆగిర్యాల తదితర గ్రామాలకు ప్రధాన రహదారి ఇదే కావడంతో నిత్యం వందలాది వాహనాలు ఈ రహదారి గుండానే వెళ్తాయి.ప్రస్తుతం ఈ గ్రామాల ప్రజల సైతం ఇతర మార్గాల్లో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
*అసంపూర్తిగా వంతెన పనులు*
అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా, అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గత ప్రభుత్వ హయాంలో వాగుపై వంతెన నిర్మాణం చేపట్టినా,పనులు అసంపూర్తిగానే నిలిచిపోయాయి.వంతెన పనులు ఎందుకు ఆగిపోయాయో,వాటిని పూర్తి చేయడానికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తమకు అర్థం కావడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కనీసం తాత్కాలికంగానైనా ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటు చేయడంలోనూ అధికారులు విఫలమయ్యారని వారు మండిపడుతున్నారు.
*వంతెన పనులను పూర్తి చేయాలి.*
అయ్యవారిపల్లి ప్రజలు ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలపై అధికారులు,ప్రజాప్రతినిధులు తక్షణమే దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.వంతెన పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని,ప్రస్తుతానికి తాత్కాలికంగానైనా సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.అయ్యవారిపల్లి గ్రామ ప్రజల దీన పరిస్థితిని ఉన్నతాధికారులు గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం