నేటి సత్యం హైదరాబాద్ 
*నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించిన గొప్ప కమ్యూనిస్ట్ నేత చందు నాయక్*
– సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి. నరసింహ
నేటి సత్యం. హైదరాబాద్. ఆగస్టు 5
విప్లవాత్మక పోరాటాలలో ముందంజలో ఉంటూ, సిపిఐ నిర్వహించిన భూ పోరాటాలకు నాయకత్వం వహించి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించిన గొప్ప కమ్యూనిస్ట్ నేత చందు నాయక్ అని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి. నరసింహ కొనియాడారు. హైదరాబాద్, హిమాయత్ నగర్, సత్యనారాయణ రెడ్డి భవన్ లో మంగళవారం ఇటీవలే హత్యకు గురైన సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు కె.చందు నాయక్ సంతాప సభ సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్. ఛాయాదేవి ఆద్యలశతనా జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈ.టి. నరసింహ మాట్లాడుతూ యువ నాయకుడిగా ఎదుగుతున్న సమయంలో చందు నాయక్ దారుణ హత్యకు గురికావడం సిపిఐ పార్టీకి తీరని లోటన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఇళ్ల స్థలాల కోసం భూ పోరాటాల చేసి అనేక మందికి గుడిసెలు వేయించి పట్టాలిపించి, వారి రక్షణకై మురికివాడల్లోనే చందు నాయక్ తన నివాసాన్ని ఏర్పరచుకొని, పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేసారని అన్నారు. చందు నాయక్ మరణం పట్ల అయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మంచి మనిషిని కోల్పోవడం బాధగా ఉన్నప్పటికీ అయినా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన కర్తవ్యంగా సాగుతామని ఈ.టి. నరసింహ తెలిపారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్. బోస్ మాట్లాడుతూ చందు నాయక్ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని, గిరిజనులు, పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడం కోసం కృషి చేశారని తెలిపారు. ఎస్. ఛాయాదేవి మాట్లాడుతూ భూపోరాటాలు, మలిదశ తెలంగాణ ఉద్యమంతోపాటు కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తి కోసం జరిగిన అలుపెరగని పోరాటాల్లో చందు నాయక్ చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేసారు. ఈ సభలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటేశం, తెలంగాణ శ్రామిక మహిళా ఫోరమ్ కన్వీనర్ పి. ప్రేమ్ పావని, సిపిఐ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బి. స్టాలిన్, కార్యవర్గ సభ్యులు నిర్లేకంటి శ్రీకాంత్, పడాల నళిని, సీనియర్ నాయకులూ ఆర్. శంకర్ నాయక్, ఖైరతాబాద్ నియోజకవర్గం కార్యదర్శి మామిడిచెట్ల వెంకట్ స్వామి, చందు నాయక్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.