Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్

చినిగిన అంగి అయినా తొడుక్కో కానీ ఒ మంచి పుస్తకం కొనుక్కో!

* నేటి సత్యం హైదరాబాద్

* విజ్ఞాన దీపాలు.. పుస్తకాల పొదరిల్లు
Aug 10,2025 08:23

నేటి సత్యం

”చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో!” అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు. ఒకప్పుడు వెల పెట్టి పుస్తకాలను కొనుక్కునే స్థోమత లేక.. అలా అని అభ్యసన మానుకోలేక.. గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలను అరువు తెచ్చుకుని చదువుకునేవాళ్లు. చదువుకోవడానికి సరైన వసతి లేనివాళ్లే కాదు పఠనా ఉత్సుకత కలిగిన చదువరులంతా లైబ్రరీల బాట పట్టేవాళ్ల్లు. కానీ ఇప్పుడా పరిస్థితి కనబడటంలేదు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులను గ్రంథాలయాలకు దూరం చేస్తోంది. ఏది కావాలన్నా నెట్టింట్లో వెతుకులాట మొదలయ్యింది. కానీ ఆన్‌లైన్‌ అవగాహన కంటే లిఖితపూర్వకమైన పరిజ్ఞానం కచ్చితమైంది. స్మార్ట్‌ఫోన్ల వినియోగానికి బదులుగా విజ్ఞానం నింపే పుస్తకాల పొదరిళ్ల వైపు నేటి తరాన్ని నడిపిద్దాం..! ఈ నెల 12వ తేదీన ‘జాతీయ గ్రంథాలయ దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం.

విజ్ఞాన భాండాగారాలైన పుస్తకాలను భద్రపరచి, భవిష్యత్‌ తరాల వారికి అందిస్తాయి గ్రంథాలయాలు. పుస్తకాలున్న పూరిపాకనైనా సరే గ్రంథ ‘ఆలయం’గా పిలుస్తాం. గ్రంథాలకున్న ప్రాముఖ్యత అటువంటిది. విద్యను అభ్యసించడానికి కావాల్సిన మానసిక ప్రశాంతత ఈ గ్రంథాలయాల్లోనే దొరుకుతుంది. మన దేశంలో చెప్పుకోదగ్గ అతిపురాతన గ్రంథాలయాలు ఎన్నో ఉన్నాయి.

పరిమాణంలో దేశంలోనే అతిపెద్దది ‘కలకత్తా పబ్లిక్‌ లైబ్రరీ’. 1836 మార్చి 21న ద్వారకానాథ్‌ ఠాగూర్‌ పాలనలో ఈ లైబ్రరీని స్థాపించారు. స్వాతంత్య్రానంతరం ‘నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా’ గా పేరు మార్చి, భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధీనంలో నడుపుతున్నారు. అక్కడ 25 లక్షల పుస్తక సముదాయం ఉంది. బెంగాల్‌కు చెందిన శాస్త్రవేత్త, సంఘసంస్కర్త అశుతోష్‌ ముఖర్జీ 80,000 పుస్తకాలను ఈ లైబ్రరీకి అంకితం చేశారు. వాటిలో ఇంగ్లీషు సాహిత్యంలో అరుదుగా లభించే 1600 కాలం నాటి షేక్‌స్పియర్‌ రచనలు ముఖ్యమైనవి.
‘ఆసియాటిక్‌ సొసైటీ ఆఫ్‌ ముంబయి’ లైబ్రరీని 1833వ సంవత్సరంలో జేమ్స్‌ మాకింతోష్‌ ముంబయిలో స్థాపించారు. 192 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గ్రంథాలయంలో లక్షకు పైగా పుస్తకాలున్నాయి. చాలా అరుదైనవి 15,000 పుస్తకాలు ఉన్నాయి. దీనిలో లభ్యమయ్యే పుస్తకాలు, మ్యాన్యుస్క్రిప్ట్‌లను, దినపత్రికలను ఎవరైనా ఎక్కడ నుంచైనా చదవగలిగేందుకు వీలుగా అక్కడున్న గ్రంథాలన్నింటినీ డిజిటలీకరించారు. ‘గ్రంథ్‌ సంజీవనీ’ అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

అంధుల కోసం..

బెంగళూరులోని శేషాద్రి మెమోరియల్‌ లైబ్రరీని 1915లో స్థాపించారు. ప్రత్యేక ఆకర్షణగా ఎరుపు రంగులో కనిపించే ఈ లైబ్రరీ నిర్మాణం పాఠకులను తనవైపు తిప్పుకుంటుంది. చదువరులకు వీలుగా విశాలమైన రీడింగ్‌ రూమ్‌లో మూడు లక్షలకు పైగా పుస్తకాలను పొందుపరిచారు. బ్రెయిలీ లిపికి చెందిన పుస్తకాలను సేకరించడం, వాటి కోసం ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పటు చేయడం ఈ లైబ్రరీ విశిష్టత.
మనరాష్ట్రంలో ప్రముఖంగా ఠాగూర్‌, హనుమంతరాయ, శారదా, రామ్మోహన్‌ గ్రంథాలయాలు ఉన్నాయి. అతి పురాతన గ్రంథాలయం రాజమండ్రిలోని ‘గౌతమి ప్రాంతీయ గ్రంథాలయం’. తెలుగు, సంస్కృతం, హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ, ఇంగ్లీషు భాషలకు చెందిన అరుదైన పుస్తకాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. తాళపత్ర గ్రంథాలను, తెలుగు చరిత్రను వెలుగులోకి తెచ్చిన బ్రిటిష్‌ అధికారి మెకెంజీ రాతలు, 17, 18 శతాబ్దాలకు చెందిన 417 తాళపత్ర గ్రంథాలను దీనిలో భద్రపరిచారు. ఈ లైబ్రరీకి జాతీయ హోదా కల్పించి, లైబ్రరీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

బడిలో లైబ్రరీ..

రోజులో ఎక్కువ సమయం విద్యార్థులు స్కూల్‌లోనే గడుపుతున్నారు. కాబట్టి ప్రతి పాఠశాలలోనూ తప్పక ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలి. వీటిలో కేవలం విద్యాపరమైన పుస్తకాలే కాక సాహిత్యం, సృజన, క్రీడలు, కళలకు సంబంధించిన పుస్తకాలు ఉండేలా చూసుకోవాలి. ఏదో ఒక టాపిక్‌ ఇచ్చి, దానికి సంబంధించిన పుస్తకాలు చదివేలా పిల్లలను ప్రోత్సహించాలి. తమిళనాడు ప్రభుత్వం ‘పఠన ఉద్యమం’ పేరుతో 1 నుంచి 8వ తరగతి వరకు ప్రతి తరగతి గదిలోనూ 200 పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. ఇలాంటి విధానం మన రాష్ట్రంలోనూ ఆహ్వానించదగినదే.
పోటీ పరీక్షలకు ఎప్పుడు ఏ పుస్తకం అవసరమవుతుందో చెప్పలేం. తీరా చదవాల్సిన సమయానికి మన దగ్గర ఆ పుస్తకం లేకపోతే హడావుడిగా షాపుల చుట్టూ తిరిగి వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ముందుజాగ్రత్తగా చిన్నప్పటి నుంచే పిల్లలకు పుస్తకాలను మన్నికగా భద్రపరుచుకోవడం నేర్పించాలి. వారి కోసం ఓ అలమరాను కేటాయించాలి. పుస్తకాలను అందంగా పేర్చడం కూడా ఓ కళ. విలువైన వస్తువులే కాదు పుస్తకాలను సైతం జాగ్రత్త చేయడం చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఒకప్పుడు తమకు అవసరం లేని పుస్తకాలను లైబ్రరీకి ఇవ్వడం, ఇతరులకు పంచడం చేసేవారు. ఇలాంటి అభిరుచి మంచిదే.

డిజిటల్‌ లైబ్రరీ..

పుస్తకాలను ప్రేమిస్తే అవి మన జీవితాన్ని మార్చివేస్తాయి. విద్యార్థులకున్న ఒత్తిడి, ఆందోళన నుంచి బయటపడేస్తాయి. ఇతరుల పట్ల మానవత్వాన్ని కలిగి ఉండటం నేర్పుతాయి. అంతటి ప్రాధాన్యత గల పుస్తకాల పఠనం అంతకంతకూ తగ్గిపోతోంది. నేటి యువత స్మార్ట్‌ఫోన్‌ వాడకంతో వాట్సాప్‌ ద్వారా పుస్తకాలను పంచుకుంటున్నారు. ఇలాంటి ఆధునీకరణ మంచిది కాదు. పైగా దృష్టిలోపం తలెత్తే అవకాశముంది. అయినప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠకులను ఆకర్షించేందుకుగాను లైబ్రరీలను డిజిటలీకరణ చేస్తున్నారు. పురాతన పుస్తకాలను, శాస్త్రాలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చేవిధంగా చర్యలు చేపడుతున్నారు. సామాజిక, సాంస్క ృతిక రంగాల్లో అభివృద్ధికి పబ్లిక్‌ గ్రంథాలయాలు ఎంతగానో తోడ్పాటును అందిస్తాయి.

దేశంలోనే అత్యధిక అక్షరాస్యత కలిగిన కేరళ రాష్ట్రంలో 8,415 గ్రంథాలయాలు ఉన్నాయి. పబ్లిక్‌ లైబ్రరీలను నడపడంలో కేరళ దేశంలోనే గుర్తింపు తెచ్చుకుంది. వీటి నిర్వహణకు ప్రత్యేకంగా బడ్జెట్‌లో నిధులను కేటాయించడం, సెస్‌లను కలెక్ట్‌ చేసి వాటిని సక్రమంగా వినియోగించేందుకు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా కేరళ గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత రేటు పెంచడంలో ఈ గ్రంథాలయాలు చురుకైన పాత్ర పోషిస్తున్నాయి. కన్నూర్‌లోని ప్రపొయిల్‌ గ్రామంలో ఉన్న లైబ్రరీ ముంగిట పుస్తకం శిల్పం చేసి, దానికి గుడి కట్టి ఆరాధిస్తున్నారు. ఈ సంఘటన కేరళ వాసులకు పుస్తకాలపై ఉన్న మక్కువను తెలుపుతుంది. ప్రభుత్వ గ్రంథాలయాలకు ఆదరణ లేకపోవడం కూడా పుస్తకపఠనం తగ్గిపోవడానికి ఒక కారణం. భావితరాలకు బంగారుబాట వేసే గ్రంథాలయాల అభివృద్ధికి సమాజంతో పాటు ప్రభుత్వాలు కూడా కృషి చేయాలి. చదువరులకు అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేయాలి. కొరతగా ఉన్న లైబ్రరీ సిబ్బందిని పెంచి, వాటి మనుగడకు ప్రభుత్వాలు పూనుకోవాలి.

ఈ రోజు ఎలా వచ్చిందంటే..

తెలుగునాట ప్రతి గ్రామంలోనూ ఓ గ్రంథాలయం ఉండాలని ఉద్యమించిన వ్యక్తి అయ్యంకి వెంకటరమణయ్య. ఆయన తర్వాత అంతటి కృషి చేసిన వ్యక్తి ఎస్‌.ఆర్‌.రంగనాథన్‌. ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి మరీ గ్రంథాలయాలకు రూపకల్పన చేశారు. 1929లో మద్రాసు యూనివర్శిటీలో తొలిసారిగా ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌’ కోర్సును ప్రారంభించారు. ఆయన రూపొందించిన ‘కోలన్‌ క్లాసిఫికేషన్‌’ అనే వర్గీకరణను ప్రముఖ లైబ్రరీలు అనుసరిస్తున్నాయి. ఆయన కృషి వల్లనే మన దేశంలో గ్రంథాలయ చట్టం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌ పౌరగ్రంథాలయ చట్టం 1960లో రూపొందింది. స్థానిక సంస్థల నుంచి విశ్వవిద్యాలయాల వరకూ గ్రంథాలయ సమాచార శాస్త్రంలో సర్టిఫికేట్‌ కోర్సులు అందుబాటులోకి వచ్చేలా చేశారు. ఆయన సేవ, కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ”గ్రంథాలయ శాస్త్ర పితామహుడు”గా గుర్తించింది. ఆయన పుట్టినరోజు ‘ఆగస్టు 12’వ తేదీని ”జాతీయ గ్రంథాలయ దినోత్సవం”గా ప్రకటించి, జరుపుతోంది.

కె. హేమలత
92907 35678

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments