Neti Satyam
Newspaper Banner
Date of Publish : 23 August 2025, 1:55 am Editor : Admin

వృధా కాదు కామ్రేడ్….. ని…. మరణం…!!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సురవరం ద లీడర్‌..!
లీడర్‌.. తమ పార్టీకి, కేడర్‌కు, జాతి భవితకు ఓ రాడార్‌. తన మాటతో, చేతతో కార్యకర్తలను కదంతొక్కించడమే కాదు, తన వాదన పటిమతో ప్రత్యర్థులను పరుగులు పెట్టించడం, మేధావులు, నిపుణులు, విశ్లేషకుల మద్దతు పొందడం సమర్థ నాయకత్వ లక్షణం. అధ్యయనం, అవగాహన, ఆచరణ.. త్రివేణి సంగమంగా మదిలో, హృదిలో మథనం జరిగితేనే జనాభ్యుదయం, దేశ హితం కాంక్షించే దశ, దిశలో తను సాగడమే కాదు, జాతిని కదిలించగలుగుతారు. అటువంటి వ్యక్తులే నిజమైన జాతి నేతలు కాగలుగుతారు. ప్రస్తుత రాజకీయాల్లో తనదైన విలక్షణత్వం, విశుద్ధ మార్గంతో మార్క్సిస్టు`లెనినిస్టు పంథాలో సమసమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నేత సురవరం సుధాకరరెడ్డి. మతవాద, మితవాద, బూర్జువా రాజకీయాల్లోని క్రూరత్వాన్ని, కుటిలత్వాన్ని, స్వార్థపూరిత దోపిడీ విధానాలను ఎండగడుతూ లౌకిక, ప్రజాతంత్ర శక్తులకు అండగా నిలుస్తూ భారత కమ్యూనిస్టు పార్టీకి జాతీయ కార్యదర్శిగా తన కర్తవ్యాన్ని త్రికరణశుద్ధిగా నిర్వహిస్తున్న నిజమైన ప్రజా ఉద్యమ నేత ఆయన. పాఠశాల స్థాయి నుంచే ప్రశ్నించడం నేర్చున్నారు. విద్యార్థి దశ నుంచి కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్నారు. తన వాగ్దాటితో జనార్షక నేతగా ఎదిగారు. తన అధ్యయనం, సైద్ధాంతిక బలంతో దార్శనికునిగా పేరొందారు.
భూస్వామ్య కుటుంబమైనా ఎటువంటి భేషజాలు లేవు. రజాకార్లు తమ ఇంటిని తగలబెట్టినా, కుటుంబాన్ని వెంటాడినా వెరవకుండా ప్రజా ఉద్యమబాట పట్టారు. ప్రతి ప్రతిబంధకాన్నీ తన పోరాటానికి నిచ్చెన మెట్లుగా మలచుకున్నారు. పాలకులు పట్టి జైల్లో పెట్టినా… ఆ సెల్‌నే ఉద్యమాలకు పురుటిగదిగా మార్చుకున్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కమ్యూనిస్టుగా ముందుగా స్పందించడం, దానితో పాటు నేనున్నాంటూ ఆయన ప్రజాక్షేత్రంలో ఉద్యమబావుటా ఎగురవేయడం ఆయనకు నిత్యకృత్యం. పోరాటాల గడ్డ నల్లగొండ నుంచి పార్లమెంటులో అడుగుపెట్టినా.. కార్యకర్త నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎదిగినా ఆయన ఆలోచన, ఆచరణలో ఏ మార్పులేదు. నిరాడంబరత ఆయన శైలి. నల్లకుబేరుల జాతకాలపై తొలిసారి పార్లమెంటు వేదికగా గళం విప్పిన ఘనత ఆయన సొంతం. ఎర్రజెండా చేతబట్టి ఆరు దశాబ్దాలకు పైగా అలుపెరగని పోరు సాగిస్తున్న సురవరం మనోగతం.. విశాలాంధ్ర ‘బతుకు’ పేజీకి ప్రత్యేకం… ఆయన మాటల్లోనే ఆయన జీవన ప్రస్థానం… `

మా సొంత ఊరు మహబూబ్‌నగర్‌ జిల్లా మానవపాడు మండలం కంచుపాడు. 1942 మార్చి 25వ తేదీన కొల్లాపురం తాలూకాలోని కొండ్రావుపల్లిలో జన్మించా. నాన్న వెంకట్రామరెడ్డి, తల్లి ఈశ్వరమ్మ. మాది ఉమ్మడి కుటుంబం. మా పెదనాన్న సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రమహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు. నల్లగొండ జిల్లా చిలుకూరు మహాసభలో నాటి కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రావి నారాయణరెడ్డి ఉపన్యాసాల స్ఫూర్తితో మా నాన్న కమ్యూనిస్టు పార్టీ ఆర్గనైజర్‌గా మారారు. విజయవాడలో చండ్ర రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మిలటరీ శిక్షణ తీసుకున్నారు. నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో మరో పెదనాన్న రామచంద్రారెడ్డి అరెస్టయి ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. ఆ సమయంలో కమ్యూనిస్టు వ్యతిరేకతను నరనరానా జీర్ణించుకున్న రజాకార్లమూకలు ఇటుకులపాడులోని మా సొంత ఇళ్లు, గడ్డివాములు తగులబెట్టి బీభత్సం సృష్టించారు. ఆ సమయంలో మా నాన్న కమ్యూనిస్టు పార్టీలో చేరడాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. తెలంగాణా సాయుధపోరాటం ముగిశాక పార్టీసభ్యునిగా, రైతు సంఘ నేతగా ఉద్యమాల్లో పాల్గొనడంతో నా పదేళ్ల వయస్సులోనే రాజకీయ చర్చలు వినడం, సాహిత్యం చదవడం అలవాటయ్యాయి. ఇటుకలపాడులోని ఓ చిన్నబడిలోనే ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగింది. ఆ సమయంలోనే మాస్టారు పుల్లయ్య ‘అమరకోశం’, ‘వేమనశతకం’, ‘పెద్దబాల శిక్ష’ వంటివి చదివించారు. నా తండ్రి రహస్య జీవితం గడపాల్సి రావడంతో రజాకార్ల దాడులు పెచ్చరిల్లడంతో మా కుటుంబం సమీపంలోని కర్నూలుకు మకాం మార్చాల్సి వచ్చింది. అక్కడ ఓ క్రిస్టియన్‌ స్కూల్లో మూడు నుంచి ఏడో తరగతి వరకూ చదివాను. ఆ తరువాత మునిసిపల్‌ హైస్కూల్లో విద్యాభ్యాసం… శ్రీ వెంకటేశ్వరా యూనివర్సిటీ పరిధిలోని కర్నూలు ఉస్మానియా కళాశాలలో ఇంటర్‌, బి.ఏ పూర్తి చేశా. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఎల్‌ఎల్‌బీ, ఢల్లీిలో ఎం.ఎల్‌. చేరినా చదువు కొనసాగలేదు.
అలా మొదలైంది…
నేను ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదువుతున్న సమయంలో హైస్కూల్లో కనీస వసతులైన బెంచీలు, బ్లాక్‌బోర్డులు లేకపోవడంపై విద్యార్థులందరం కలసి ఒక రోజు సమ్మె చేశాం. ఆ సమయంలోనే అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌), భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాయకులు పరిచయమయ్యారు. విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం కలిసి పోరాటం చేద్దామని కోరడంతో ఏఐఎస్‌ఎఫ్‌ ఉద్యమాల్లోకి అడుగుపెట్టా. ఉన్నత విద్య హైదరాబాద్‌లో చదవాలని కోరిక ఉన్నప్పటికీ పార్టీ ఆదేశానుసారం కర్నూలులోని ఉస్మానియా కళాశాలలోనే గ్రాడ్యుయేషన్‌ చేయాల్సి వచ్చింది. జిల్లాలోనే అతి పెద్దదైన ఏకైక కళాశాల కావడంతో సుమారు 2,500 మంది విద్యార్థులు ఉండేవారు. అప్పట్లో కళాశాలలో కనీస సదుపాయాలు కూడా లేకపోవడంతో సంఘటితంగా ప్రశ్నించేవారం. విద్యార్థి సమస్యలపై గట్టిగా పోరాడటంతో విద్యార్థులందరూ కలసి 1962 `63లో కళాశాల విద్యార్థి యూనియన్‌ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నారు. అప్పట్లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల్లో రోజూ రెండు పరీక్షలు నిర్వహించేవారు. పేద విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు స్వాహా చేసేవారు. అడిగితే కళాశాల యాజమాన్యాలు కక్షసాధింపు చర్యలకు దిగేవి. ఈ సమస్యల పరిష్కారం కోసం 1962లో అన్ని కళాశాలల్లో 56 రోజులపాటు ఏకధాటిగా పెద్దఎత్తున విద్యార్థులందరం కలసి సమ్మె నిర్వహించాం. అప్పుడు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సమ్మె కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టా. ఇదే సమయంలో ఏఐఎస్‌ఎఫ్‌ కర్నూలు జిల్లా కార్యదర్శిగా ఎన్నిక అయ్యాను. మిత్రులు కాశీపతితో కలిసి యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల్లో విస్తృతంగా పర్యటిస్తూ సమ్మెకు విద్యార్థులను సంఘటితం చేయడంలో విజయం సాధించాం. విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న తరుణంలో భారత కమ్యూనిస్టు పార్టీ విభజన తరువాత 1964, 65లో గుంటూరు వేదికగా సి. రాఘవాచారి అధ్యక్షతన ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర మహాసభ జరిగింది. ఈ మహాసభలో అప్పటి ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లి నాగేశ్వరరావు నుంచి ఆ బాధ్యతలు చేపట్టాను.
విశాలాంధ్ర సబ్‌ ఎడిటర్‌ కావాలనుకున్నా
గ్రాడ్యుయేషన్‌ పూర్తికాక ముందు విశాలాంధ్ర దినపత్రికలో సబ్‌ ఎడిటర్‌గా పనిచేయాలన్న కోరిక బలంగా ఉండేది. అప్పటి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నీలం రాజశేఖరరెడ్డిగారికి నా ఆలోచనను చెప్పా. నా మనస్సులో మాట చెప్పిన వెంటనే ఆయన విజయవాడలోని విశాలాంధ్ర ప్రధాన కార్యాలయంలో సబ్‌ ఎడిటర్‌ ట్రైనింగ్‌ కోసం ఏటుకూరి బలరామ మూర్తిగారికి పరిచయం చేశారు. అదే రోజు హైదరాబాద్‌ నుంచి లా కాలేజీలో చేరాలని కామ్రేడ్‌ రాఘవాచారి నుండి టెలిగ్రాం వచ్చింది. ఆ యూని వర్సిటీలో విద్యార్థి ఉద్యమ బలోపేతానికి పార్టీ ఆదేశించడంతో విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. విశాలాంధ్ర కార్యాలయానికి చేరుకున్న నన్ను అదే రోజు రాత్రి బస్సులో హైదరాబాద్‌ పంపారు. అక్కడ నుంచి ప్రజా ఉద్యమాల్లో మమేకం కావడంతో విశాలాంధ్రలో సబ్‌ ఎడిటర్‌గా పని చేయాలనే కోరిక అలానే మిగిలిపోయింది.
విద్యార్థిగానే పత్రిక నిర్వహణ
కర్నూలు కళాశాలలో విద్యార్థులను చైతన్యం చేయడం కోసం మిత్రులమంతా గోడపత్రిక నిర్వహించాం. ఆ బాధ్యతలు నేనే చేపట్టాను. విద్యార్థుల సమస్యలు, ఉద్యమ గీతాలు, ప్రముఖ రాజకీయ నాయకుల ప్రసంగాలు, వ్యాసాలతో కూడిన వార్తలను చేతితో రాసి కళాశాల గోడలపై అంటించేవాళ్ళం. ఈ పత్రికలను మేము అంటించిన కొద్దిసేపటికే కళాశాల యాజమాన్య ప్రతినిధులు చించి వేయడంతో ఎప్పటికప్పుడు కళాశాలలో టెన్షన్‌ నెలకొనేది. గోడలపై అంటించడాన్ని వారు అడ్డుకోవడంతో క్యాంటీన్‌ గోడలపై అంటించే వాళ్లం. నోటీసు బోర్డులో పెట్టేవాళ్లం. ఇది సహించలేని యాజమాన్యం తరచూ వాటిని కూడా చించి వేయిస్తూ ఉండేది. మేము అంటించిన అరగంటలోనే ఆ పత్రికలు 50 లేదా 60 మంది విద్యార్థులను ప్రభావితం చేసేవి. ఢల్లీిలో యువజన మాస పత్రిక ‘యూత్‌ లైఫ్‌’’ పక్ష పత్రికలో పనిచేశాను.
ఎమర్జెన్సీలో యువజన మాసపత్రికపై ఉక్కుపాదం
విద్యార్థి, యువజన సంఘం ఆధ్వర్యంలో ఏటుకూరి ప్రసాద్‌, ప్రతాప్‌రెడ్డి వంటివారి సంపాదకత్వంలో యువజన మాసపత్రిక హైదరాబాద్‌ నుంచి వెలువడేది. ఆ పత్రిక బాధ్యతలు 1974లో నేను చేపట్టాల్సి వచ్చింది. ఎన్ని సమస్యలు ఎదురైనా విద్యార్థి, యువజనులను ప్రభావితం చేస్తూ ప్రత్యేక కథనాలతో పత్రికను తీసుకొచ్చాం. ఎమర్జెన్సీని పరోక్షంగా విమర్శిస్తూ 1975లో ప్రత్యేక వ్యాసం రావడంతో మాపై వేధింపులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలోనే కొంతకాలం నేను విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ తర్వాత ప్రభుత్వ వేధింపులకు గురైన పత్రికల్లో ఆంధ్రప్రభ, యువజన మాసపత్రిక పేర్లు పేర్కొంటూ పార్లమెంట్‌ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది.
రాజకీయ చర్చలకు
ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదిక
హైదరాబాద్‌ లా కాలేజీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా నేను 1965`66 నుంచి సుదీర్ఘకాలం పనిచేశా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల నాయకుల మధ్య రాజకీయ అంశాలపై చర్చలు ఎంతో ఉత్కంఠగా కొనసాగేవి. వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షులు జైపాల్‌ రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు నారాయణదాసు తదితరులతో అనేక ఆంశాలపై నువ్వా నేనా… అన్న రీతిలో చర్చలు జరిగేవి. మరోవైపు పార్టీ చీలిన కారణాన విద్యార్థి వర్గాల మధ్య తీవ్ర సైద్ధాంతిక చర్చలు జరిగేవి. ఒక్కోసారి రాత్రి రెండు గంటల వరకూ చర్చలు కొనసాగుతూనే ఉండేవి. అప్పటి ఏఐఎస్‌ఎఫ్‌్‌ హైదరాబాద్‌ నగర కార్యదర్శి అజిత్‌ పాషా, అధ్యక్షులు సదానందంతో కలిసి వర్సిటీ పరిధిలోని 17 కళాశాలల్లో బలమైన ఏఐఎస్‌ఎఫ్‌ ఉద్యమ నిర్మాణానికి పునాదులు వేశాం. సీనియర్‌ నాయకులు ప్రతాపరెడ్డి, కొల్లి నాగేశ్వరరావు, రాఘవాచారి సూచనలతో ఈ చర్చల్లో రాజకీయ అంశాలపై కమ్యూనిస్టుల వాణిని బలంగా వినిపించేవారం. ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఒకవైపు, నక్సల్స్‌ విద్యార్థి సంఘం మరోవైపు, యూత్‌ కాంగ్రెస్‌ జైపాల్‌ రెడ్డి గ్రూపు మరోవైపు చర్చల్లో పాల్గొనేవారు. ఈ చర్చల్లో కమ్యూనిస్టు వాణిని బలంగా వినిపించేందుకు యూనివర్సిటీకి మూడు, నాలుగు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి అప్పట్లో ప్రధాన పత్రికలైన న్యూఏజ్‌, లింక్‌, మెయిన్‌స్ట్రీమ్‌, జనతా, ఆర్‌ఎస్‌ఎస్‌ ఆర్గనైజర్‌ లాంటివి కొనుగోలు చేసి వాటిని సమగ్రంగా చదివి చర్చల్లో పాల్గొనేవాళ్లం. మా మిత్రులు, అనంతపురం జిల్లాకు చెందిన మిలిటెంట్‌ కార్యకర్త రహ్మాన్‌తో కలిసి యూనివర్సిటీ హాస్టల్‌లోనే ఉండేవాళ్లం. వామపక్షాల తరఫున ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడుగా తమ్మారెడ్డి భరద్వాజ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వామపక్ష విద్యార్థి జార్జిరెడ్డిని ఆర్‌ఎస్‌ఎస్‌ గూండాలు హత్య చేయడంతో రాజకీయాలు రాజుకున్నాయి. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న సమయంలోనే ఢల్లీి యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం అడ్మిషన్‌ తీసుకున్నప్ప టికీ ఒక్క రోజు కూడా కాలేజీకి వెళ్లలేని పరిస్థితి. నేను ఏఐఎస్‌ఎఫ్‌ బాధ్యతలు చేపట్టడంతో తరచూ ఆందోళనలు, సమావేశాలతోనే సమయం సరిపోయేది. విశాఖ ఉక్కు ఉద్యమంలో ఏఐఎస్‌ఎఫ్‌ స్టూడెంట్‌ స్టీల్‌ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమానికి కన్వీనర్‌గా నేను, కో`కన్వీనర్‌ వెంకట రమణ (అనంతపురం) తోపాటు సంగమేశ్వరప్ప పనిచేశాం. తెలంగాణ జిల్లాల్లో కూడా ఉద్యమం ఉధృతంగా సాగింది. కోస్తా, రాయలసీమల్లో శక్తివంతమైన ఉద్యమం జరిగింది. కామ్రేడ్‌ కొల్లి నాగేశ్వరరావు తదితరులు నాయకత్వం వహించారు. ఏఐఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శిగా ఎంపికవ్వడంతో విద్యార్థి ఉద్యమ అవసరాల కోసం అదే ఏడాది ఢల్లీికి మకాం మార్చాల్సి వచ్చింది.

తరువాత ఏఐవైఎఫ్‌ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. దీంతో మణిపూర్‌ నుంచి మహారాష్ట్ర, కాశ్మీర్‌ నుంచి కేరళ వరకూ విద్యార్థి, యువజనోద్యమాల బలోపేతానికి విస్తృతంగా పర్యటించాల్సి వచ్చింది. బెనారస్‌ యూనివర్సిటీలో చదువుకున్న కామ్రేడ్‌ శారద మిత్రా (బెంగాలీ), సీకే చంద్రప్పన్‌ (ఏఐవైఎఫ్‌ ప్రధాన కార్యదర్శి), జోగేంద్రసింగ్‌ దయాల్‌ (ఏఐవైఎఫ్‌ అధ్యక్షుడు)తోపాటు రంజిత్‌ గుహ ఓ బృందంగా యువజన విద్యార్థి సమస్యలపై నిర్వహించిన పోరాటం ప్రత్యేకం. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకులకు ఓటు హక్కు కావాలని, ఉద్యోగ హక్కు కోసం 1969`70లో పార్లమెంటు ముందు మహాప్రదర్శన నిర్వహించాం. ఏఐవైఎఫ్‌ ఉద్యమాల్లో రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది సహచరులతో కలిసి విద్యార్థి, యువజన హక్కుల కోసం ఉత్సాహంగా పనిచేశాం. పుల్లారెడ్డి, గడ్డం కోటేశ్వరరావు, డాక్టర్‌ స్టాలిన్‌, డాక్టర్‌ నారాయణ, ఆళ్ల నాగేశ్వరరావుతో కలిసి పనిచేశా.
లక్నో సెంట్రల్‌ జైలు అత్యంత నికృష్టం..
విద్యార్థి, యువజన ఉద్యమాల్లో దేశవ్యాప్తంగా అనేక చోట్ల అరెస్టు కావడంతో ఇతర భాషలు నేర్చుకోవాల్సి వచ్చింది. ఢల్లీి, కోల్‌కత్తా, పాట్నా, లక్నోలతోపాటు అనేక జైళ్లలో ఉండాల్సి రావడంతో అనివార్య పరిస్థితిలో హిందీ భాష నేర్చుకున్నాం. అయితే ఎప్పుడూ సుదీర్ఘ జైలు శిక్షలు అనుభవించలేదు. ఉత్తరప్రదేశ్‌లో విద్యార్థి యూనియన్ల పునరుద్ధరణ కోసం అప్పటి ముఖ్యమంత్రి చరణ్‌సింగ్‌ కార్యాలయం ముందు ప్రదర్శన సమయంలో కార్యకర్తలు సీఎం కార్యాలయంలోకి చొరబడటంతో లక్నో యూనివర్సిటీ అధ్యక్షుడు అతుల్‌కుమార్‌ అంజన్‌తోపాటు నన్ను, సుమారు 50 మందిని అరెస్ట్‌ చేసి సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఈ జైలు నికృష్ట జైలు. ఇక్కడ కనీసం మరుగుదొడ్లు లేవు. గదిలోనే ఓ కుండ పెట్టేవారు. మలమూత్ర విసర్జనల్నీ దీనిలోనే. పురుగులుపట్టిన అన్నం పెట్టేవాళ్లు. దీంతో రోజంతా తిండి తినకుండా గొడవ చేయడంతో అప్పటి జైలు డాక్టర్‌గా పనిచేస్తున్న ఏఐఎస్‌ఎఫ్‌ మాజీ కార్యకర్త సగం మందికి బ్రెడ్‌, పాలు సమకూర్చి ఉద్యమకారులకు అండగా నిలిచారు. దోమ పోటుకు అల్లాడిపోయాం. కంబళి ఇచ్చినా దాని నిండా గమీషన్‌ వాసన రావడంతో అలాగే కూర్చుని కళ్లు మూసేవాళ్ళం. ఈ కేసులో 15 రోజులు శిక్ష పడినప్పటికీ పది రోజుల్లో బయటకు వదలివేశారు.
తీహార్‌ జైలులో వియత్నాం సంఫీుభావ ప్రదర్శన
1969`70 సమయంలో వియత్నాంకు మద్దతుగా ఢల్లీిలోని అమెరికన్‌ రాయబార కార్యాలయం ముందు నిర్వహించిన ప్రదర్శన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసు లాఠీచార్జిలో తల, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు చుట్టుముట్టి లాఠీలతో దారుణంగా కొడుతున్న సమయంలో ఆదే మార్గంలో వెళ్తున్న ఓ మహిళా కార్యకర్త లాఠీలను పట్టుకుని పోలీసులను ప్రశ్నించడంతో కొంత ఆగింది. ఇక్కడ నాతోపాటు 50 మంది ఏఐఎస్‌ఎఫ్‌ కార్యకర్తలను అరెస్ట్‌ చేసిన పోలీసులు తీహార్‌ జైలుకు తరలించారు. అత్యంత కరుడుగట్టిన సంఘ వ్యతిరేక శక్తుల బెదిరింపులను ఎదుర్కొంటూ వియత్నాంకు మద్దతుగా జైలు గోడల మధ్య ప్రదర్శనలు నిర్వహించాం. ఇదే ఏడాది 18 ఏళ్ల వయస్సు కలిగిన ప్రతి యువతీయువకునికి ఓటు హక్కు కోసం పార్లమెంటు ఎదుట వారం రోజుల పాటు పోరాటం చేసి ఆ హక్కు సాధించుకోగలిగాం.
కోల్‌కతా ప్రెసిడెన్సీ జైలులోనే రాజకీయ చర్చలు
పశ్చిమబెంగాల్‌ ప్రెసిడెన్సీ జైలు జీవితం కొత్త అనుభూతి. ఇక్కడ పీసీ జోషి వామపక్ష ప్రభుత్వాన్ని డిస్మస్‌ చేయడానికి కాంగ్రెస్‌ కుట్ర చేయడాన్ని నిరసిస్తూ పేట్రరేట్‌, రైటర్స్‌ భవనం ఎదుట అప్పటి వర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌ అధ్యక్షులు రణదీవ్‌ గంగూలీతో కలిసి భారీ ప్రదర్శన నిర్వహించారు. ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ కలిసి ఒక రోజు సమ్మెకు పిలుపు ఇవ్వడంతో సెక్రటేరియట్‌ ముందు 30 వేల మంది విద్యార్థి, యువకులతో భారీ ర్యాలీ అనంతరం బహిరంగ సభలో నేను ప్రసంగిస్తుండగా సభ మధ్యలో బాంబులు వేశారు. దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య ఘర్షణ చెలరేగడంతో ప్రదర్శనను విచ్ఛిన్నం చేసేందుకు బీభత్సమే సృష్టించారు. ఈ సందర్భంగా వందలాది మంది విద్యార్థులతోపాటు గుంటూరుకు చెందిన ఎస్‌ఎఫ్‌ నాయకుడు స్టాలిన్‌బాబు, విశాలాంధ్ర కార్టూనిస్ట్‌ మోహన్‌ కూడా అరెస్ట్‌ అయ్యారు. ఇక్కడ మేమంతా విద్యార్థి, యువకులం అయినప్పటికీ జైలులో రాజకీయ ఖైదీలుగా గుర్తించడంతో రోజంతా రాజకీయ చర్చలు, సమావేశాలు నిర్వహించేవాళ్ళం. మమ్ములను పరామర్శించేందుకు కామ్రేడ్‌ జ్యోతిబాసు రావటంతో ఉత్సాహపడ్డాం.
కర్నూలు నుంచి అంతర్జాతీయ విద్యార్థి ఉద్యమ నేతగా..
అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌), అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) ఉద్యమాలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో బాధ్యతలు నిర్వహించాల్సి రావడంతో 1968లో పూర్తి స్థాయిలో ఢల్లీి వెళ్లాల్సి వచ్చింది. 1969 నుంచి 1972 వరకు ఏఐవైఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగా. ప్రధానంగా ఏఐఎస్‌ఎఫ్‌ ఉద్యమం ప్రపంచ పరిజ్ఞానాన్ని పెంచింది. 1971లో బంగ్లాదేశ్‌ వార్‌ సందర్భంగా అక్కడి విద్యార్థి సంఘానికి అండగా నిలిచేందుకు అంతర్జాతీయ విద్యార్థి సంఘం మద్దతు కూడగట్టడంకోసం ప్రపంచ దేశాల్లో పర్యటించాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ స్టూడెంట్స్‌ మంగోలియాలో సమావేశానికి హాజరయ్యాం. విద్యార్థి సంఘ నాయకుడిగా సోవియట్‌ యూనియన్‌, చెకొస్లొవేకియా, హంగేరి, ఆఫ్ఘనిస్తాన్‌ లాంటి దేశాల్లో జరిగిన సమావేశాల్లో అంతర్జాతీయ విద్యార్థి సంఘం కార్యవర్గ సభ్యుని హోదాలో పాల్గొన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధిగా అమెరికా, చైనా, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, పాకిస్తాన్‌, ఇటలీ దేశాల్లో ఆయా కమ్యూనిస్టు పార్టీల సమావేశాలకు హాజరయ్యా.
ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధిగా..
భారత పార్లమెంటు తరపున ఐక్యరాజ్యసమితి సమావేశాలకు హాజరయ్యే అవకాశం దక్కింది. వారం రోజుల పాటు కొనసాగిన సభలు, సమావేశాల్లో అనేక అంశాలపై చర్చలు జరిగాయి.
విద్యార్థి ఉద్యమాల నుంచి సీపీఐ నేతగా..
కర్నూలు మున్సిపల్‌ హైస్కూల్‌లో మౌలిక సదుపాయాల కోసం విద్యార్థులమంతా పగడ్భందీగా నిర్వహించిన ఒక రోజు సమ్మె నా ఉద్యమ తొలి అడుగు. ఆ తర్వాత ఏఐఎస్‌ఎఫ్‌ బాధ్యతల్లో 1962 నుంచి 64 వరకు ఎస్‌ఎఫ్‌ కర్నూలు జిల్లా కార్యదర్శిగా పనిచేశాను. 1964లో రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు స్వీకరించా. ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిస్టు సమితి ఆదేశానుసారం 1973 చివరిలో ఏఐవైఎఫ్‌ బాధ్యతల నుంచి రిలీవ్‌ అయ్యి హైదరాబాద్‌ కేంద్రంగా పార్టీ పనిచేయడానికి రావాల్సి వచ్చింది. అప్పట్లో నేను పార్టీ జాతీయ సమితి సభ్యుడిగా కొనసాగుతున్నా. 1974లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కొన్ని తెలంగాణ జిల్లాలకు సహాయం కోసం పంపారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మికసంఘం, మహబూబ్‌నగర్‌లో కమ్యూనిస్టు పార్టీ పునర్నిర్మాణం బాధ్యతలను చేపట్టాల్సి వచ్చింది. అప్పటి ఆ సంఘ రాష్ట్ర నాయకులు కొండ్రు సుబ్బారావు, వంకా సత్యనారాయణ (పశ్చిమగోదావరి), జేఎస్‌ఆర్‌ ఆంజనేయశాస్త్రి (కృష్ణా జిల్లా) సూచనలు, సలహాలతో వ్యవసాయ కార్మికుల హక్కుల సాధన కోసం ఉద్యమ బాధ్యతలు నిర్వహించా. రాజమండ్రి రాష్ట్ర మహాసభలో కామ్రేడ్‌ దాసరి నాగభూషణరావు పార్టీ కార్యదర్శిగా, నేను సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యాం. రెండు పర్యాయాలు ఆ బాధ్యతలు నిర్వహించా. పార్టీలో అనేక బాధ్యతల్లో కొనసా గినా తమ్మారెడ్డి సత్యనారాయణ, నల్లమల గిరిప్రసాద్‌, పువ్వాడ నాగేశ్వరరావు ఎంతో ప్రోత్సహించారు. హైదరాబాద్‌లో జరిగిన పార్టీ జాతీయ 20వ మహాసభలో డిప్యూటీ జనరల్‌ సెక్రటరీగా ఎన్నికయ్యా. పార్లమెంటు సభ్యునిగా, పార్టీ బాధ్యతలు రెండూ నిర్వహించాల్సి వచ్చింది. ఆ తర్వాత పాట్నాలో జరిగిన 21వ జాతీయ మహాసభలో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టిన తర్వాత కామ్రేడ్‌ బర్థన్‌ ప్రోత్సాహంతో ఉభయ కమ్యూనిస్టు పార్టీల మధ్య మరింత సన్నిహిత సంబంధాలతోపాటు బలమైన పార్టీ నిర్మాణం కోసం పనిచేస్తున్నా.
పోరాటాలగడ్డ నుంచి పార్లమెంట్‌కు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి 1985లో కొల్లాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశా. తర్వాత 1989 ఎన్నికల్లోనూ అక్కడ నుంచే పోటీ చేసి ఓడిపోయా. పార్టీ అదేశానుసారం 1994లో కర్నూలు జిల్లా డోన్‌ నియోజకవర్గంలో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డిపై పోటీ చేయడంతో ఉత్కంఠ నెలకొంది. పార్టీ బలంగా ఉన్న ఆ ప్రాంతాల్లో ఫ్యాక్షన్‌ ముఠాలు రిగ్గింగ్‌లకు పాల్పడటంతో అనేక ఘటనల తర్వాత ఓడిపోవాల్సి వచ్చింది. కానీ ముప్పయి వేల ఓట్లు రావటం ఆశ్చర్యం కలిగించింది. ఇక్కడ కొనసాగిన రిగ్గింగ్‌ వ్యవహారంపై పౌరహక్కుల నేత కన్నాభిరాన్‌ ప్రత్యేక నివేదికను ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. 1998లో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న తరుణంలోనే నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి గెలుపొందా. అయితే 13 నెలలకే పార్లమెంటు రద్దు అయ్యింది. ప్రజా సమస్యలపై అనుకున్న స్థాయిలో పనిచేయలేకపోయాం. 2004 ఎన్నికల్లో రెండోసారి నల్లగొండ నుంచి ఎన్నికయ్యా. ఈ కాలంలో పార్లమెంటు వేదికగా అనేక అంశాలపై చర్చించే అవకాశం దక్కింది. లేబర్‌ స్టాండిరగ్‌ కమిటీ ఛైర్మన్‌గా పనిచేసే అవకాశం రావడం నూతన అనుభవం. పార్లమెంటు వేదికగా విదేశాల్లో నల్లధనం, దేశంలో రైతుల ఆత్మహత్యలు, కార్మికుల సమస్యలపై గట్టిగా కమ్యూనిస్టు వాణిని వినిపించానన్న సంతృప్తి ఉంది. కర్ణాటక నుంచి ఓ ఉద్యోగి ఓ లెటర్‌ పోస్టు చేస్తూ నెట్‌లో నల్లధనం వివరాలు ఉన్నాయి, అందరు ఎంపీలకు నేను పంపినా మీరు ఒక్కరే ప్రస్తావించారని పేర్కొనడం గర్వంగా అనిపించింది. నేను లేవనెత్తిన అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం, సామాజిక భద్రత, చేనేత కార్మికులకు ప్రత్యేక బ్యాంకు అంశాలు అన్ని రాజకీయ పార్టీలను ప్రభావితం చేయడంతో ఈ అంశాలు పార్లమెంటును కుదిపివేశాయి.
ఇదీ కుటుంబ పరిస్థితి…
సికింద్రాబాద్‌కు చెందిన ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ యువ మహిళా విభాగం కన్వీనర్‌ విజయలక్ష్మితో వర్ణాంతర వివాహం జరిగింది. విజయలక్ష్మి తల్లి పద్మానాయుడు ఏఐటీయూసీ కార్మికోద్యమ నాయకురాలిగా కొనసాగేవారు. నా కుమారులు నిఖిల్‌ (యూఎస్‌ఏ), కపిల్‌ ఐ.టి. సంస్థను నడుపుతున్నాడు. ఉద్యమంలో పనిచేయడానికి తల్లి ప్రోత్సాహం మరువలేనిది. ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నా తాను ఉద్యమంలో పనిచేయాల్సి ఉన్నపుడు, విజయలక్ష్మి పీహెచ్‌డీ చేసినప్పుడూ బిడ్డల్ని మా తల్లిగారివద్దే ఉంచాం. నా భార్య సహకారంతోనే నేను ఉద్యమ బాధ్యతలు చేయగలిగాను. ఆమె తర్వాత ఉద్యోగం వదిలి ఎఐటియుసిలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మా కుటుంబంలో నా తర్వాత చెల్లి పుష్పలత పీహెచ్‌డీ పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. తమ్ముడు ప్రభాకర్‌రెడ్డి ఏఐఎస్‌ఎఫ్‌ ఉద్యమంలో పనిచేశారు. అలంపురం తాలూకాలో పార్టీ కార్యదర్శిగా పనిచేస్తూనే గ్రామ సర్పంచ్‌గా కొనసాగారు. మరొక తమ్ముడు రవీంద్రనాథ్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. మా అబ్బాయి పార్టీతోనే ఉన్నారు.
ఆస్తులు అమ్ముకుని…
మాది ఉమ్మడి కుటుంబం. 120 ఎకరాల వరకు అప్పట్లో భూములు ఉండేవి. రాజోలి బండ ప్రాజెక్టు ఆయకట్టు భూములు కావడంతో నీరు అందేదికాదు. ఎన్ని పెట్టుబడులు పెట్టినా తిరిగి ఆదాయం చేతికి వచ్చేది కాదు. తరచూ అప్పులు పెరిగిపోవడంతో ఎకరం నాలుగు నుంచి ఐదు వేల రూపాయల వంతున క్రమంగా అమ్మేయాల్సి వచ్చింది. భార్య విజయలక్ష్మి ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగిగా కొనసాగుతుండడంతో ఆమె పేరున రుణం తీసుకుని హైదరాబాద్‌లో ఇల్లు నిర్మించాం. ఉమ్మడి కుటుంబం నుంచి 12 ఎకరాలు నాకు వచ్చినా బ్యాంకు రుణం చెల్లించడానికి 9 ఎకరాలు అమ్మేయాల్సి వచ్చింది. మూడున్నర ఎకరాలు ఇంకా మిగిలింది. ఇటీవల మరో నాలుగు ఎకరాలు తనకు ఉన్నట్లు కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో వాటిని కూడా అమ్మేయాలని ప్రయత్నించినా గ్రామస్తుల ఒత్తిడి మేరకు నిలిపివేయాల్సి వచ్చింది.
విద్యుత్‌ ఉద్యమ ఘటన కలచివేసింది
ఆంధ్రరాష్ట్రంలో ఉవ్వెత్తున సాగిన విద్యుత్‌ ఉద్యమ నిర్మాణంలో వామపక్షాలు ఐక్యతతో ముందుకుసాగడం ఎంతో సంతృప్తినిచ్చింది. అయితే ప్రదర్శనలో ముగ్గురు చనిపోయడం, వందల సంఖ్యలో గాయపడటం చాలా తీవ్రమైన మనోవేదనకు గురిచేసింది. ఈ ఘటన నా జీవితంలో ఎంతోకాలం వెంటాడిరది. నిద్రలేని రోజులెన్నో…..అప్పట్లో జరిగిన ఓ ఘటన ఇప్పటికీ నా మనస్సును కలచివేస్తూనే ఉంది. 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రపంచ బ్యాంకు అడుగుజాడల్లో నడుస్తూ భారీగా విద్యుత్‌ చార్జీలు పెంచడంతో తొమ్మిది వామపక్షాలు కలిసి క్షేత్ర స్థాయి నుంచి ఉద్యమం చేశాయి. ఉద్యమాన్ని ఉధృతం చేసే క్రమంలో చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాం. సీపీఐ(ఎం) ఒక వైపు, మిగిలిన వామపక్ష పార్టీలు మరోవైపు ప్రదర్శనగా బయలుదేరాం. అంతా కలిసిన తర్వాత ముందు వరుసలో సీపీఐ నాయకులు నారాయణ, సీపీఎం నాయకులు రాఘవులు, వీరభద్రంతోపాటు ఇతర వామపక్ష నాయకులు అనేకమంది నడుస్తున్నారు. చిన్న వివాదం రావటంతో ఊరేగింపు రెండుగా చీలింది. కానీ ఆ తర్వాత మళ్లీ అందరం కలిసి పని చేశాం. గుఱ్ఱాలతో తొక్కించారు. లాఠీ చార్జి చేశారు. కాల్పులు జరిపారు. నన్ను కాపాడేందుకు మన కార్యకర్తలు రక్షణ కవచం నిర్మించి వాళ్ళు గాయపడ్డారు. ఆ ఘటనలో కామ్రేడ్‌ నారాయణ, కొల్లి నాగేశ్వరరావు, మానం ఆంజనేయులు, కె. సుబ్బరాజు తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఉద్యమంలో వామపక్షాల ఐక్య వేదిక నిర్మించడంలో కామ్రేడ్‌ రాఘవులుగారు మంచి కృషి చేశారు.
ఇదీ నా ఆవేదన.. ఆకాంక్ష
దేశంలో దుర్భరమైన దోపిడీ వ్యవస్థ కొనసాగుతోంది. దీనికి వ్యతిరేకంగా కొనసాగే పోరాటాల నుంచి పాలకులు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. ఈ విధానాలు నాకు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. మతోన్మాదం, కుల పిచ్చి, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే స్వార్థపర శక్తులకు వ్యతిరేకంగా దేశ సమైక్యతను కాపాడేందుకు, వర్గ దోపిడీలేని సమసమాజ స్థాపనకు మన యువత నడుం బిగించి పోరాటం చేయాలి. ఎంత కష్టమైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇది తప్ప మరో మార్గం లేదు. ఎర్రజెండా నాయకత్వంలో సమసమాజ స్థాపన కోసం శక్తివంతమైన ఉద్యమం నిర్మించడంలో మనవంతు పాత్ర మనం నిర్వహించాలి.
దేశంలో మితవాద మతోన్మాద ప్రభుత్వం అధికారంలోకి రావటంతో సెక్యులర్‌ ప్రజాతంత్ర శక్తుల ఐక్యత మరింత అవసరం. కమ్యూనిస్టు ఉద్యమ పునరైక్యత ద్వారానే దేశంలో అభివృద్ధి నిరోధక శక్తులను శక్తివంతంగా ఎదుర్కొని, దేశాన్ని రక్షించగలం. ఇదే నాతో పాటు కమ్యూనిస్టులందరి ఆకాంక్ష.

మొలగవల్లి మిగులుభూములపై
తొలి భూపోరాటం..
వ్యవసాయ కార్మికోద్యమ నేత, జాతీయ నాయకులు గుజ్జుల యలమందారెడ్డి నాయకత్వంలో భూపోరాటాల్లో పాల్గొన్నాం. ప్రస్తుత సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్‌ రామకృష్ణ అప్పట్లో విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయన చొరవతో ఆయన సొంతూరైన కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో ఒక పోరాటం చేశాం. మిగులు భూములను ప్రభుత్వానికి అప్పగించకుండా కొనసాగుతున్న అప్పటి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లక్ష్మీకాంతరెడ్డికి చెందిన 500 ఎకరాలను పేదలకు పంచేలా సాగిన ఆ పోరాటం ఎప్పటికప్పుడు ఉద్రిక్తంగా ఉండేది. ఒకసారి 50 నాగళ్లతో భూములను ఒకేసారి దున్నాలని నిర్ణయించినా, భయపడిన జనం ముందుకు రాలేదు. రామకృష్ణ మరో 20 మంది మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చారు. ఆయుధాలతో దాడికి వస్తున్నారని ముందుగానే ప్రచారం చేస్తూ భూస్వాముల రక్షణ కోసం ఉద్యమకారులను ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. దీంతో బెయిల్‌ కూడా తీసుకోబోమని ప్రకటించి జైళ్లలోనే ఉండటంతో ఆ ప్రాంతంలో సంచలనం రేగింది. అనేక పోరాటాల ఫలితంగా ఎట్టకేలకు 250 మంది పేద కుటుంబాలకు పంపిణీ జరిగింది. మెదక్‌ జిల్లా కంది దగ్గర భూముల ఆక్రమణలో పేదలకు భూమి హక్కు వచ్చింది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో భూస్వామి అల్వర్‌రెడ్డి భూముల ఆక్రమణోద్యమం కొత్త అనుభవం. అనంతపురం జిల్లా కౌకుంట్లలో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కేశవ్‌ తండ్రి వెంకటనారాయణ మిగులు భూములు 300 ఎకరాలపై సాగిన పోరాటంలో ఓ హత్య అలజడి రేపింది. పేదల కోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రజలు తిరుగుబాటు చేయడం ఎర్రజెండా ఉద్యమ వెలుగుకు ఓ నిదర్శనం. మెదక్‌ జిల్లా పాటియా మహారాజు భూమి 400 ఎకరాలను పేదలు అక్రమించినప్పటికీ తర్వాత వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టడంతో బ్యాంకులే స్వాధీనం చేసుకున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా పెదకొత్తపల్లి మండలంలో భూపోరాట యోధుడు చండ్ర రాజేశ్వరరావుతో కలిసి భూఆక్రమణోద్యమ ఫలితంగా 300 ఎకరాలను పేదలకు పంచగలిగాం. ఇలా రాష్ట్రవ్యాప్తంగా భూపోరాటాలతో పాటు ఎన్నో సంఫీుభావ ప్రదర్శనలు, సభల్లో పాల్గొన్నా.