Neti Satyam
Newspaper Banner
Date of Publish : 23 August 2025, 12:51 pm Editor : Admin

సుప్రసిద్ధ కమ్యూనిస్టు యోధుడు..సురవరం సుధాకర్ రెడ్డి అస్తమాయం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

*సుప్రసిద్ధ కమ్యూనిస్టు యోధుడు*
*సురవరం సుధాకర్ రెడ్డి అస్తమయం*

*హైదరాబాద్లో ఆదివారం అంతిమ వీడ్కోలు*

సుప్రసిద్ధ కమ్యూనిస్టు యోధుడు, సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంటేరియన్‌ సురవరం సుధాకరరెడ్డి శుక్రవారం పది గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఆయనకు భార్య డాకర్‌ బివి విజయలక్ష్మి, కుమారులు నిఖిల్‌, కపిల్‌ ఉన్నారు. శ్రీమతి విజయలక్ష్మి ఎఐటియుసి నాయకురాలుగా పనిచేస్తున్నారు.
సురవరం ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని స్కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హృదయం స్పందన నిలిచిపోవడంతో మృతి చెందారు. సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు ముగిసిన కొద్ది నిమిషాలకే తమ ఆత్మీయ నేత సురవరం మరణించిన వార్త తెలియడంతో సిపిఐ నాయకులు, పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కమ్యూనిస్టు శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరణ వార్త తెలిసిన వెంటనే సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, జాతీయ కార్యదర్శులు డాక్టర్‌ కె. నారాయణ, సయ్యద్‌ అజీజ్‌ పాషా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కె. శ్రీనివాస్‌రెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటి. నరసింహ, కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్‌, పల్లా నర్సింహారెడ్డి, సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి స్టాలిన్‌ హుటాహూటిన ఆసుపత్రికి వెళ్లి సురవరం భౌతిక కాయానికి నివాళి అర్పించారు. సురవరం మరణ సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంతి ఎ. రేవంత్‌రెడ్డి, ప్రతిపక్షనేత కె. చంద్రశేఖర్‌రావు, టిపిసిసి చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, పలువురు ప్రముఖ నేతలు సంతాపం ప్రకటించారు. విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ జనరల్‌ మేనేజర్‌ మనోహర్‌ నాయుడు, సినీ నటుడు, నిర్మాత, మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు మాదాల రవి ఒంగోలు నుంచి సంతాపం తెలియజేశారు.
ఆదివారం అంతిమ యాత్ర
సురవరం పెద్దకుమారుడు అమెరికా నుంచి రావాల్సి ఉండడంతో ఆయన అంతిమయాత్రను ఆదివారం నిర్వహించనున్నారు. అదే రోజు ఉదయం పదిగంటలకు ప్రజల సందర్శనార్థం సురవరం భౌతికకాయాన్ని సిపిఐ రాష్ట్ర కార్యాలయమైన మగ్ధూంభవన్‌కు ఉదయం 10 గంటలకు తరలించనున్నారు. మధ్యాహ్నం అంతిమ యాత్ర నిర్వహించి సాయంత్రం సురవరం సుధాకర్‌రెడ్డి భౌతిక కాయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధన నిమిత్తం గాంధీ బోధానాసుపత్రికి అప్పగించనున్నారు.
సురవరం సుధాకర్‌రెడ్డి 1942, మార్చి 25న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కాన్‌రేవ్‌పల్లిలో జన్మించారు. ఆయన తండ్రి వెంకట్‌రామ్‌రెడ్డి. తెలంగాణ వైతాళికుడు, గోల్కోండ పత్రిక సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి స్వయాన సుధాకర్‌రెడ్డికి పెదనాన అవుతారు. వారి కుటుంబం కంచుపాడు గ్రామానికి వలస వెళ్లింది. బాల్యంలో అక్కడే విద్యాభ్యాసం చేసి ఉన్నత పాఠశాల కోసం కర్నూలులోని కోల్స్‌ హైస్కూల్‌లో చదువుకున్నారు. కర్నూల్‌లోనే ఉస్మానియా డిగ్రీ కాలేజీలో బిఎ చదివారు. అదే సమయంలో ఆయనకు విద్యార్థి ఉద్యమాలతో సంబంధాలు ఏర్పడగా, ఎఐఎస్‌ఎఫ్‌లో చేరారు. ఆయన హాస్టల్‌ విద్యార్థుల సమస్యలపై తీవ్ర పోరాటాలు చేసి రాటుదేలారు. అనంతరం పార్టీ ఆదేశాల మేరకు విశాలంధ్ర విలేకరిగా హైదరాబాద్‌కు వచ్చారు. వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బి అడ్మిషన్‌ లభించింది. ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐవైఎఫ్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా, అనంతరం కాలంలో ఎస్‌ఎఫ్‌, వైఎఫ్‌ జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీలో ఉంటూ దేశవ్యాప్త విద్యార్థి, యువజన ఉద్యమాల వ్యాప్తికి విశేష కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన నేతృత్వంలో పనిచేసిన ఆనేక మంది విద్యార్థి, యువజన నాయకులు తరువాత కాలంలో వివిధ రాష్ట్రాల్లో రాజకీయ నాయకులుగా ఎదిగారు.
జీవిత సంగ్రహంః
ఎఐఎస్‌ఎఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నాయకత్వం స్థానం నుండి అఖిల భారత స్థాయి విద్యార్థి, యువజన సమాఖ్యల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల బాధ్యతల్లో రాణించిన నాయకుడు సురవరం సుధాకరరెడ్డి. ఆయన చక్కని వాగ్దాటి, విషయ స్పష్టత కలిగిన వక్త. ఒకతరం విద్యార్థి, యువజనులకు ఆయనో ఆకర్షణ. గుర్తింపు పొందిన పార్లమెంటేరియన్‌. సిపిఐ 9వ ప్రధాన కార్యదర్శి. 1942, మార్చి 25న మహబూబ్‌నగర్‌ జిల్లా (ప్రసుత్తం గద్వాల జిల్లా) కొండ్రావ్‌పల్లి గ్రామంలో జన్మించారు. కర్నూలులో హైస్కూలు విద్య పూర్తి చేశారు. 1964లో కర్నూలులోని ఉస్మానియా కాలేజీలో చరిత్రలో బి.ఎ. ఉత్తీర్ణులైనారు. హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్శిటీ లా కాలేజి నుండి ఎల్‌ఎల్‌బి పూర్తి చేశారు. కర్నూలు కాలేజీలో విద్యార్థి యూనియన్‌ అధ్యక్షులుగా, ఉస్మానియా లా కాలేజీలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనారు. విజయవాడలో జరిగిన ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర మహాసభలో సి.రాఘవాచారి అధ్యక్షునిగా, సుధాకరరెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై కామ్రేడ్‌ చంద్రప్పన్‌, డి.రాజాలతో కలిసి ఉద్యమ నిర్మాణానికి కృషి చేశారు. విద్యార్థిగా ఉన్నప్పటి నుండి అనేక ఉద్యమాల్లో పోరాటాల్లో పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు కలకత్తా, ఢిల్లీ, లక్నో, తదితర జైళ్లలో శిక్షలనుభవించారు.
రాష్ట్రానికి తిరిగి వచ్చి పార్టీ నిర్మాణంలో భాగంగా వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేస్తూ కర్నూలు జిల్లా, నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలో, మహబూబ్‌నగర్‌ జిల్లా పెద్దకొత్త పల్లి మండలంలో, మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో పాటియాల రాజా భూముల ఆక్రమణ పోరాటాల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీల పెంపుదల వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆ సమయంలో పోలీసు కాల్పులు జరిగాయి. ముగ్గురు యువకులు మరణించారు. గుర్రాలతో తొక్కించడంతో ఆయన గాయపడ్డారు. హత్యానేరం పేర కామ్రేడ్‌ సుధాకరరెడ్డితోపాటు ఇంకా అనేకమందిపై తప్పుడు కేసులు పెట్టారు. ప్రాజెక్టుల కోసం పదిరోజులు పాదయాత్ర నిర్వహించారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితి గవర్నింగ్‌బాడీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. విశాలాంధ్ర ప్రచురణాలయం సంపాదకవర్గ సభ్యులుగా, ‘యువజన’ మాసపత్రిక, ‘యూత్‌ లైఫ్‌’ మాసపత్రిక, ‘న్యూ జనరేషన్‌’ వారపత్రికలకు సంపాదకునిగా వ్యవహరించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ దర్శిని’ ఎడిటోరియల్‌ బోర్డ్‌ సభ్యునిగా పనిచేశారు. 1995 ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిస్టు సమితి సహాయ కార్యదర్శిగా, 1997 కార్యదర్శిగా పనిచేశారు. నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి 1998 తిరిగి 2004 సంవత్సరాల్లో ఎంపిగా పనిచేశారు.
2004 యుపిఎ ప్రభుత్వ హయాంలో కార్మిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా అసంఘటిత కార్మికుల సంక్షేమ ముసాయిదా బిల్లును రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే ఐక్యరాజ్యసభ సాధారణ సమితి సమావేశాల్లో భారత పార్లమెంట్‌ తరుపున ప్రతినిధిగా వెళ్లారు.

2008 నుండి సిపిఐ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీగా పనిచేసిన తదుపరి 2012లో పాట్నాలో పార్టీ 21వ మహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. పుదుచ్చేరి (2015), కొల్లాం(2018) మహాసభలో తిరిగి ఎన్నుకోబడిన సుధాకరరెడ్డి 2019 జులై 24న పార్టీ జాతీయ సమితి సమావేశంలో ఆరోగ్య కారణాలతో రిలీవ్‌ అయినారు.