(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం ఆగస్టు 25 


నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి తుదిశ్వాస వరకు నిలబడిన
నిజాయితీ, నిస్వార్ధ, నిరాడంబర జీవి గొప్ప కమ్యూనిస్టు నేత సుధాకర్
హైదరాబాద్: నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి తుది శ్వాస వరకు నిలబడిన నిజాయితీ, నిస్వార్ధ, నిరాడంబర జీవితాన్ని గడిపిన కమ్యూనిస్టు మహా నేత సురవరం సుధాకర్ రెడ్డి అని సమాజంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీలో, చట్ట సభలలో ఎన్నో ఉన్నతమైన బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ ఏనాడూ ఆవేశం, కోపం ఆయనలో చూడలేదర్క్రొన్నారు. సురవరం సుధాకర్ మరణం వామపక్ష ఉద్యమానికి, యావత్ దేశానికి, బడుగు బలహీన వర్గాలకు తీరని లోటు అని కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు సురవరం పోరాడారు : ఎపి సిఎం చంద్రబాబు
ప్రజాస్వామ్య పరిరక్షణకోసం సిపిఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి పోరాడారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమం, దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. హైదరాబాద్ హిమాయత్ సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్ సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డితో ఉన్న రాజకీయ సంబంధాల గురించి సిపిఐ నేతలతో పంచుకున్నారు. ‘సురవరంతో నాకు సుధీర్ఘ రాజకీయ అనుబంధం ఉంది. సుధాకర్ రెడ్డి, నేను కలిసి ఎన్నో రాజకీయ పోరాటాలు చేశాం. నిత్యం ప్రజాహితం కోసం ఆయనతో కలిసి పోరాడం. ఎంపిగా, కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా ప్రజలకు సేవలందించారు. సుధాకర్ రెడ్డి నన్ను ప్రత్యేకంగా అభిమానించేవారు. నేను చేసే పనులను , కార్యక్రమాలను అభినందించి ప్రోత్సహించేవారు. ఆయన సేవలను, పోరాటాలను నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. సుధాకర్ రెడ్డి చనిపోయినా పోరాట వారసత్వాన్ని మనకు ఇచ్చిపోయారు. సుధాకర్ రెడ్డి మరణం సిపిఐతో పాటు, తెలుగు వారికి తీరని లోటు అని అన్నారు.
నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి సురవరం : వెంకయ్య నాయుడు
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి సురవరం అని కొనియాడారు. పార్టీలో ఏ పదవిలో ఉన్నప్పటికీ ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి సురవరం అని, ఆయనలేని లోటు పూడ్చలేనిదన్నారు.
పేదల కోసం పరితపించారు : మహేష్ కుమార్ గౌడ్
టిపిసిసి అధ్యక్షులు మహేశ్ గౌడ్ మాట్లాడుతూ పేదల కోసమే పరితపించిన గొప్ప నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి అని, అలాంటి వ్యక్తిని కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు. ఎఐసిసి రాష్ట్ర వ్యవహరాల ఇన్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ జీవితాంతం పోరాటాలతో గడిపిన మహనీయుడు సురవరం సుధాకర్ రెడ్డి అని అన్నారు.
సురవరం రాజకీయ జీవితం నేటి యువతకు ఆదర్శం: భట్టి విక్రమార్క
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సురవరం సుధాకర్ రెడ్డి లాంటి ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు.
దేశంలో సిపిఐ బలోపేతానికి ఆయన కృషి చేశారని, చిన్న నాటి నుంచి ప్రజల పక్షాన నిలబడి, ప్రజల కోసం పోరాడారని గుర్తు చేశారు. ఆయన రాజకీయ జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు. సురవరం పేరు చిరస్థాయిగా నిలిచేలా కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.
తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారు : కెటిఆర్
బిఆర్ అర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో అనేక హోదాల్లో పనిచేసిన సుధాకర్ ఎన్నో విప్లవ ఉద్యమాలు, ఎన్నో ప్రజా ఉద్యమాల్లో ఎన్నో కార్మికుల ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారన్నారు. విద్యార్ది నాయకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి జాతీయస్థాయిలో సిపిఐకి ఏడేళ్ల పాటు ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం సాధారణమైన విషయం కాదన్నారు. ప్రజల పట్ల, ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహనతో అన్ని ప్రజా సమస్యలపై క్రియాశీలకంగా వ్యవహరించారన్నారు. ఆయన మరణం ప్రజా ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి బాధాకరరమన్నారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి సిపిఐ మద్దతు తెలిపిందని, జాతీయ స్థాయిలో తాము కలిసి పనిచేసే అవకాశం వచ్చిందన్నారు. కెసిఆర్ కూడా సుధాకర్ రెడ్డితో ఉన్న అనుభవాలను గుర్తు చేసుకున్నారన్నారు. ఎంఎల్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సుధాకర్ నాయకత్వం విద్యార్థి దశలో తమకు స్ఫూర్తినిచ్చిందన్నారు. తుది శ్వాస విడిచే వరకు ఆయన ప్రజల కోసమే ఆలోచించారన్నారు.
కార్మికుల సంక్షేమం, ప్రయోజనాల కోసం సూచనలు చేసేవారు: బండారు దత్తాత్రేయ
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ నమ్మిన భావజాలానికి కట్టుబడిన మహనీయుడు సురవరం సుధాకర్ అని కొనియాడారు. తాను కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఉన్నసమయంలో సురవరం కార్మికుల సంక్షేమం, ప్రయోజనాలకు సంబంధించి సూచనలు చేసేవారని గుర్తుచేశారు. సిద్ధాంతపరంగా తాము వేరైనప్పటికీ ఏనాడూ కూడా విమర్శించుకోలేదని, సద్విమర్శ మాత్రం చేసేవారని గుర్తు చేశారు.
ప్రజా ప్రభుత్వాల ఏర్పాటులో సురవరం కృషి మరువలేనిది: మధుయాష్కిగౌడ్
మాజీ ఎంపి మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వాల ఏర్పాటులో సురవరం కృషి మరువలేనిదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు మాట్లాడుతూ సురవరం తాను సమకాలీకులమని, తామిద్దరం కలిసి చదువుకున్నామని గుర్తు చేశారు. ఆయన మృతి సోషలిస్టు సమాజానికి తీరని నష్టంగా భావిస్తున్నానని అన్నారు. సుద్దాల అశోక్ మాట్లాడుతూ సురవరం సుధాకర్ మరణంతో శిఖరం మునిగిపోయిందా, సముద్రం కుంగిపోయిందా అన్నట్టుగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
శాంతి దూత మిషన్ సుధాకర్ మద్దతిచ్చారు : కె.ఎ.పాల్
ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కె.ఎ పాల్ మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి ఎంపిగా ఉన్న సమయంలో శాంతి దూత మిషన్ మద్దతునిచ్చారని గుర్తు చేశారు.
కమ్యూనిస్టులకు ధ్యేయం, నీతి, నిజాయితీ ఉన్నదన్నారు. కమ్యూనిస్టులు కలవాలని ప్రజా గాయకుడు గద్దర్ కూడా ప్రజాశాంతి పార్టీలో ఉన్నప్పుడు అభిలషించారని అన్నారు. బహుజనులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామన్నారు.
దేశానికి, బడుగు,బలహీన వర్గాలకు తీరని లోటు : బోయినపల్లి వినోద్ కుమార్
బిఆర్ మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి మరణం భారతదేశానికి, బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు తీరని లోటు అని అన్నారు. గత పదేళ్ల కెసిఆర్ నాయకత్వంలోని ప్రభుత్వంలో సురవరం అనేకసార్లు ఫోన్ చేసి, కొన్ని సమస్యలపైన స్పందించాల్సిన విధానంపైన పలు సలహాలు ఇచ్చేవారని గుర్తు చేశౠరు. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు అని, ప్రజల పట్ల అపారమైన ప్రేమ కలిగిన నాయకుడని కొనియాడారు. సురవరంతో
తనకు 1975 సంవత్సరంలో తెనాలి లో జరిగిన అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ శిక్షణ శిబిరంలో పరిచయడం ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు. సుధాకర్ రెడ్డి వ్యక్తిత్వం, ఆలోచనా శక్తి తనపై గొప్ప ప్రభావాన్ని చూపిందని, ఆయన ఉపన్యాసాలు ఎల్లప్పుడూ స్పష్టత, విశ్లేషణతో ఉండేదన్నారు. ప్రపంచ రాజకీయ పరిణామాలపై విస్తృతమైన అవగాహనతో తమకు దిశా నిర్దేశం చేసే వారని అన్నారు. 2004లో తాను హన్మకొండ ఎంపిగా, సురవరం నల్లగొండ ఎంపీగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం అవసరమనే అభిప్రాయాన్ని సురవరం కేంద్రానికి లిఖితపూర్వకంగా తెలియజేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి కూడా ఆయన సమర్థవంతమైన సూచనలిచ్చారన్నారు. సుధాకర్ రెడ్డి మరణంతనతో పాటు, అన్ని వామపక్ష ప్రజాతంత్ర శక్తులకు చాలా బాధ కలిగించిందని, దేశ రాజకీయ పరిస్థితులు మతోన్మాదం వైపు దారితీస్తున్నందుకు ఆయన ఆందోళన వ్యక్తం చేసేవారని వినోద్ కుమార్ అన్నారు. వామపక్ష, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత కోసం తపనపడిన మహనీయుడు సురవరం అని వినోద్ కుమార్ అన్నారు.