Neti Satyam
Newspaper Banner
Date of Publish : 06 September 2025, 11:52 am Editor : Admin

జీఎస్టీ వాతలపై. వెన్నె పూత




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

వాతలపై వెన్నపూత
Sep 5,2025 05:54

నేటి సత్యం

ఒళ్లంతా వాతలు పెట్టి, ఆ తరువాత తీరిగ్గా ఏదో ఒక దగ్గర లేపనం రాసినట్టు- కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జిఎస్టీ) విధానంలో కొన్ని మార్పులు ప్రకటించింది. ఇదేదో గొప్ప ఉపశమనం, కానుక అన్నట్టుగా గత రెండు నెలల నుంచి కేంద్ర మంత్రులు మొదలు ప్రధాని మోడీ వరకూ ఊరిస్తూ వచ్చారు. బుధవారం జరిగిన 56వ జిఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఆర్థికమంత్రి కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఇంతవరకూ నాలుగు శ్లాబుల్లో 5, 12, 18, 28 శాతాలుగా ఉన్న పన్ను విధింపును 5, 18 శాతాలకు కుదించారు. ఈ మార్పుల వల్ల రూ.48 వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతుందని, ఆమేరకు ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. ‘ఒకే దేశం – ఒకే పన్ను’ పేరిట మోడీ ప్రభుత్వం అన్ని రకాల పన్నులను జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి 2017 జులై 1 నుంచి వసూలు చేస్తోంది. ఏటా 8 నుంచి 11 శాతం పెరుగుతూ 2024 – 25 సంవత్సరానికి జిఎస్టీ వసూలు రూ.22.08 లక్షల కోట్లకు చేరింది. ఐదేళ్లలో రెట్టింపు అయింది. రాష్ట్రాల నుంచి ఇంత పెద్దఎత్తున ఆదాయం పొందుతున్నా- తిరిగి ఇవ్వటంలో తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్నదన్న విమర్శలు మొదటినుంచి వినిపిస్తున్నాయి. జిఎస్టీపై రాష్ట్రాలతో తగిన సంప్రదింపులు, హామీ లేకుండానే కేంద్రం ఈ తతంగాన్ని కొనసాగిస్తోంది. అమలు మొదలై ఎనిమిదేళ్లు పూర్తయినప్పటికీ- రాష్ట్రాలు ఏకరువు పెడుతున్న సమస్యలపై సమాధానం ఇవ్వటం లేదు.
భిన్నమైన వాతావరణం, పంటలు, ఉత్పత్తులు, ప్రాధాన్యాలూ ఉన్న విశాల దేశంలో స్థానిక అవసరాలకు తగ్గట్టుగా పన్నులు తగ్గించటం, మినహాయించటం, పెంచటం వంటి అధికారం రాష్ట్రాల పరిధిలో ఉండాలన్న వాదనను మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా కొట్టి పారేసి, జిఎస్టీని తీసుకొచ్చింది. తన వాటాగా సమకూరిన పన్నును ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలన్న అధికారాన్ని తన చేతిలో పెట్టుకొంది. ప్రతిపక్ష రాష్ట్రాలను పక్కనపెట్టి, తన రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా బిజెపి పాలక రాష్ట్రాలకు అధిక నిధులు మళ్లించటం విధిగా పెట్టుకొంది. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా – తిట్టిపోదురు గాక నాకేటి వెరపు అన్న చందంగా వ్యవహరిస్తోంది.
జిఎస్టీ గురించి మోడీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నా- దాన్నిండా అస్పష్టత, అమానవీయత అలముకొని ఉందని ఆర్థిక నిపుణుల విమర్శ. బతుక్కి భరోసానిచ్చుకునే మధ్య తరగతి, సామాన్య ప్రజల జీవిత బీమా, ఆరోగ్య బీమా చెల్లింపుల మీద 18 శాతం జిఎస్టీపై పలు విమర్శలు వచ్చాయి. వెన్న, నెయ్యి, పాలు వంటి వాటిపైనా 18 శాతం పన్ను విధించటం దుర్మార్గం. ఆరోగ్య రక్షణకు వాడే మందులు, వినికిడి యంత్రాల రిపేర్ల పైనా అధిక పన్నులు వసూలు చేయడం అమానవీయం. ఆఖరికి పిల్లల పుస్తకాలు, పెన్సిళ్లు, ఎరేజర్ల మీదా కర్కశంగా పన్ను పిండుకున్న ఘనత మోడీ ప్రభుత్వానిది. ఎనిమిదేళ్లుగా ఇలాంటి అన్యాయపు వసూళ్లపై రాష్ట్రాలు అభ్యంతర పెట్టినా, సామాన్యులు విన్నవించుకున్నా కేంద్ర ప్రభుత్వం మనసు ఇసుమంత కూడా కరగలేదు. ఇప్పుడు అలాంటి కొన్ని వస్తువులపై పన్ను తీసేయడమో, 5 శాతం శ్లాబులోకి మార్చటమో చేసి, ఇదంతా తమ ఘనతని, మానవీయ దృక్పథమని చెప్పుకోవటం సిగ్గుచేటు. ఈ తగ్గింపు, మినహాయింపు ఇప్పుడు న్యాయమైంది అయితే- ఇన్నేళ్లూ అన్యాయంగా వాటిపై వసూలు చేసినట్టే కదా? పొగాకు ఉత్పత్తులపై అధిక పన్ను ద్వారా వాటి వాడకాన్ని తగ్గించవొచ్చని చెబుతున్న కేంద్రం- పొగాకు వినియోగం నుంచి బయటపడ్డానికి ఉపయోగించే నికోటిన్‌ పోలాక్రిలెక్స్‌ గమ్స్‌పైనా 18 శాతం జిఎస్టీ విధించటం మతి లేని తనమే కదా? జిఎస్టీ జాబితాలో ఇప్పటికీ ఇలాంటి అర్థరహితాలు అనేకం ఉన్నాయి.
రాష్ట్రాల పరిధిలో జరిగే క్రయవిక్రయాలపై పన్ను పెత్తనం చేస్తున్న కేంద్రం – రాష్ట్రాలు కోల్పోయే ఆదాయానికి పరిహారం చెల్లింపుపై ఈ విడత కౌన్సిల్‌లోనూ తగిన హామీ ఇవ్వలేదు. విపక్ష రాష్ట్రాల ఆర్థికమంత్రులు లేవలెత్తిన ప్రశ్నలకు, సందేహాలకు సమాధానం ఇవ్వకుండానే సమావేశం ముగించారు. ఆదాయం తగ్గితే దాన్నెలా భర్తీ చేస్తారన్న చర్చకు జవాబు లేదు. ఏ రాష్ట్రమైనా తన ప్రజల అవసరాలకు తగ్గట్టుగా కొన్ని పథకాలను అమలు చేస్తుంది. రాయితీలు ఇస్తుంది. నిధులకు గ్యారంటీ లేనప్పుడు చీటికీ మాటికీ కేంద్రం దయాదాక్షిణ్యాల కోసం చేతులొగ్గి నిలబడాల్సి రావటం దేశ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ఈ నెల 22 నుంచి కొన్ని వస్తువుల మీద పన్ను భారం తగ్గటం స్వాగతించదగిందే అయినప్పటికీ- రాష్ట్రాల వాటాపై స్పష్టతనివ్వకపోవటం గర్హనీయం.

About Us