(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం
డీజిల్ సబ్సిడీ రద్దుకు వ్యతిరేకంగా .. ఈక్వెడార్‌లో నిరసన జ్వాల
Sep 18,2025 09:09
నేటి సత్యం
అత్యవసర పరిస్థితి విధించిన అధ్యక్షుడు
క్విటో : డీజిల్ సబ్సిడీని రద్దు చేస్తూ ఈక్వెడార్ అధ్యక్షుడు డేనియల్ నోబోవాస్ తీసుకున్న నిర్ణయంతో ఆ దేశం భగ్గుమంటోంది. దీనికి వ్యతిరేకంగా వందలాది మంది యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. ఈక్వెడార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జీవన వ్యయం విపరీతంగా పెరుగుతుందని వారు విమర్శించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడి పదవి నుంచి డేనియల్‌ను తప్పించాలని వారు పిలుపునిచ్చారు. దీంతో అధ్యక్షుడు డేనియల్ నొబోవా అంతర్గత ఆశాంతి తీవ్రం అవుతుందనే పేరుతో ఏడు ప్రావిన్స్‌లో 60 రోజులపాటు అత్యవసర పరిస్థితిని బుదవారం ప్రకటించారు. అయితే అధ్యక్షుడు డేనియల్ నొబోవా అధికారం చేపట్టిననాటి నుండి ఉదారవాద విదానాలను అవలంబిస్తున్నారు. దేశ ఆర్ధిక పరిస్థితి రిత్యా ఇంధన రాయితీని రద్దు చేస్తున్నామని తద్వారా ప్రభుత్వానికి రూ||110 కోట్లు ఆదా అవుతుందని, వీటిని ఇతర అవసరాలకు ఉపయోగిస్తామని గత వారం ప్రకటించారు. దీంతో డీజిల్ ధరలు గ్యాలన్‌కు రూ|| 158.54 నుండి రూ|| 246.68కు పెరిగిపోయింది.
ఈ నేపథ్యంలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఈక్వెడార్ నుంచి ఈ ఆందోళన ప్రారంభమై.. ఈక్వెడార్ రాజధాని క్విటో నగర వీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా ‘నోబోవా అవుట్’ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. అధ్యక్ష భవనం కరోన్‌డెలెట్ ప్యాలెస్‌ను చుట్టుముట్టాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. మార్గ మధ్యలోనే పోలీసులు వారి ఆందోళనలను చెదరగొట్టారు. పోలీసులు, మిలిటరీ దళాలు వీధుల్లో బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. అయినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గకుండా.. పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో వారిపై పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు.