నేటి సత్యం సెప్టెంబర్ 20
*_క్లీన్ ‘చీట్**
———-
దేశంలోని న్యాయస్థానాలే కాదు కీలక రెగ్యూలేటరీ సంస్థలు సైతం అదానీకి అనుకూలంగా మారాయి.గౌతమ్ అదానీ ఆర్థిక అక్రమాలపై అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన కీలక ఆరోపణలను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కొట్టిపారేయడం ఆ సంస్థపై పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయేలా చేసింది.అదానీ గ్రూప్ కంపెనీలు ఎటువంటి నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడలేదని పెట్టుబడులు,మార్కెట్ల రెగ్యూలేటర్ క్లీన్‌చీట్ ఇవ్వడం అక్రమాలకు వంతపాడటమే!
ఏడాది పొడవునా విచారణ చేపట్టి చివరకు తప్పు జరగలేదని చాలా సింపుల్‌గా తేల్చేయడం‘కొండను తవ్వి ఎలుకను పట్టిన’చందంగా ఉంది.పైగా ఎటువంటి వివరాలు గానీ,డేటా గానీ వెల్లడించపోవడం విచారణ పారదర్శకంగా జరగలేదని చెబుతున్న వాస్తవం.ఈ తీర్పు ప్రభుత్వ అండదండలు ఉన్న కార్పొరేట్లకు రక్షణ కల్పించడమే తప్ప వేరేకాదు.
అందులోనూ పెట్టుబడిదారుల నమ్మకం,మూలధన మార్కెట్ స్థిరత్వం కోసం ఏర్పడిన నియంత్రణ సంస్థను ‘అక్రమార్కులే’ నియంత్రించడం దాని దిగజారుడు తనానికి నిదర్శనం.ప్రపంచ మార్కెట్‌లో బడా పెట్టుబడిదారుడు,ఇండియా అతిపెద్ద బిలీయనీర్ అయిన అదానీ అక్రమాల గురించి చెప్పుకుంటే చాంతాడే అవుతుంది.
విద్యుత్,సోలార్ మైనింగ్,రైల్వే,బ్యాంకింగ్,రోడ్లు,ప్రాజెక్టులు,నదులు ఇలా ఎందులో చూసినా అతగాడి ఆర్థిక ‘ప్రతిభ’కు సాటిరారెవరు.దేశ పాలకుల అండతో వేలకోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి ప్రపంచంలోని అధిక ధనవంతుల్లో స్థానం సంపాదించిన అపర కుబేరుడు.
ఒకరకంగా మన దేశ బడ్జెట్‌ను సైతం ప్రభావితం చేసే శక్తివంతుడు,ప్రధానికి ఆప్త మిత్రుడు.ఇంతటి ప్రభావం కలిగిన బడా పారిశ్రామికవేత్తపై సెబీ తూ.తూ మంత్రంగా విచారణ చేసి నిర్ణయాన్ని వెల్లడించడం వెనుక ‘మతలాబే’దో ఉంది.పైగా తప్పులేదని ప్రకటించిన వెంటనే అదానీ గ్రూప్‌నకు సంబంధించి షేర్లు అమాంతం పెరగడం కూడా ఆలోచించాల్సిందే.ఎందుకంటే,హిండెన్ బర్గ్ ఆరోపణలు చిన్నవి కావు.
2023లో విడుదల చేసిన రిపోర్టులో ప్రధానంగా అదానీ తన కంపెనీల ఆదాయాన్ని పెంచడానికి షేర్ ధరలను కృత్రిమంగా పెంచడం,షెల్ కంపెనీల ద్వారా ఫండ్ మళ్లించడం,నియంత్రణా సంస్థలను మోసం చేయడం,బ్యాంకు రుణాల్ని దుర్వినియోగం చేయడం.
ఈ దెబ్బ స్టాక్ మార్కెట్‌ను ఆ కాలంలో ఒక్కసారిగా కుదిపేసింది.అదానీ గ్రూపు కంపెనీల విలువ దాదాపు లక్షల కోట్లు హరించుకుపోయింది.దీనిపై చర్చకోసం అప్పుడు పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు నిలదీసినా మోడీ మౌనముద్ర వీడలేదు.తాజాగా”అదానీపై హిండెన్ బర్గ్ ఆరోపణలు నిరూపణ కాలేదు.
అదానీ గ్రూప్ కంపెనీలు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు.ఆ సంస్థపై జరిమానా విధించాల్సిన అవసరం లేదు.”అని సెబీ పేర్కొనడం ఇప్పటివరకు కొనసాగుతున్న దర్యాప్తు కార్యకలాపాలను కూడా ఒక్కసారిగా రద్దు చేసినట్లయింది.
ఇది స్టాక్‌మార్కెట్‌కు తప్పుడు సంకేతాన్నివడమే కాదు,దాని విశ్వాసానికి మాయని మచ్చ.అదానీ ఆర్థిక అక్రమాలను నిశితంగా పరిశీలించి,సాక్ష్యాలను సంపాదించి,దాదాపు వంద పేజీలను రిపోర్ట్‌లో పొందుపర్చినట్టు అప్పట్లో హిండెన్ బర్గ్ పేర్కొంది.మరి విచారణ చేపట్టిన సెబీ తప్పు జరగలేదని చెప్పడానికి తగిన ఆధారాలు చూపించాలి కదా?
సెబీ చైర్‌పర్సన్ మాధవిపురీ బుచ్‌కు అదానీ గ్రూపు సంస్థలతో అక్రమ ఆర్థిక సంబంధాన్ని సైతం హిండెన్ బర్గ్ బహిర్గతపరిచింది.ఈ ఆరోపణలు నిరాధారమంటూనే బెర్ముడా,మారిషస్ వంటి ఆఫ్ షోర్ కంపెనీలు నడుపుతున్న అదానీ సోదరుడు వినోద్ ఆదానీ ఆధ్వర్యంలో ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టు మాధవి ఫ్యామిలీనే స్వయంగా ఒప్పుకున్నట్టు హిండెన్‌బర్గ్ తెలిపింది.
ఇంతకన్నా సాక్ష్యం సెబీకి ఇంకేం కావాలి? అదానీ గ్రూపుల్లోని సంస్థల్లో పెట్టుబడుల తీరును సమీక్షించాల్సింది పోయి వ్యక్తిగత పెట్టుబడులకు దాసోహమవ్వడం,అదానీ కంపెనీలతో అంటకాగడం చట్ట విరుద్ధం.దీనిపై సెబీ ఎందుకు మాట్లాడటం లేదు?
సెబీ క్లీన్‌చీట్ ఒక తప్పుడు నిర్ణయం.అది వ్యవహరిస్తున్న తీరు స్వతంత్ర సంస్థను ప్రశ్నార్థకం చేస్తున్నది.ఈ విశ్వాసం సన్నగిల్లితే గనుక చిన్న మదుపరులు కూడా ఏదైనా పెట్టుబడి పెట్టేందుకు భయపడతారు.లేదంటే బడా పెట్టుబడిదారులే వారిని మింగేస్తారు,ఆందోళనకు గురిచేస్తారు.ఈ వ్యవస్థ సవ్యంగా సాగాలంటే తదుపరి చర్యలకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలి.కానీ దానికి సిద్ధపడుతుందా?
ఎందుకంటే ఎన్నికల బాండ్లలో అవినీతికి తెరదీసిన బీజేపీకి అండదండలిచ్చి వేలకోట్ల రూపాయలను కట్టబెట్టాడు అదానీ.‘నీకిది నాకది’అన్న సూత్రంతో ముందుకు సాగుతున్న ఈ బంధం అంత తొందరగా వీడుతుందా?
ప్రజాసంక్షేమానికి,దేశ అభివృద్ధికి పాటుపడాల్సిన పాలకులు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసినంత కాలం ‘సెబీ’ లాంటి తీర్పులు ఇలాగే ఉంటాయి.అయితే,దేశ సంపదను అప్పనంగా దోచిపెడుతున్న వారికి సరైన సమయంలో గుణపాఠం చెప్పాల్సింది ప్రజలే.