(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, సిపిఐ శాసనసభ పక్ష నాయకులు కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ.* 
శ్రీయుత ఎనుముల రేవంత్ రెడ్డి గారు
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్.
ముఖ్యమంత్రిగారికి నమస్కారములు,
విషయం: పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను విడుదల చేయుట గురించి.
రాష్ట్రంలో మార్చి 2024 నుండి పదవీ విరమణలు పొంది ఇప్పిటికీ 18 నెలలు గడిస్తున్నాయి. నాటి నుండి నేటి వరకు పదవీ విరమణ పొందిన వారు సుమారు 12 వేల మంది ఉన్నారు. వారికి ఇప్పటి వరకు ఎటువంటి పదవీ విరమణ బకాయిలు అందలేదు. దీని వలన ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. వారు కుటుంబ బాధ్యతలు ఏవి తీర్చలేని పరిస్థితిలోకి నెట్టబడ్డారు. బకాయిలు విడుదల చేయకపోవడంతో మానసిక ఆందోళనలు తట్టుకోలేక రాష్ట్రంలో కొన్ని మరణాలు కూడా సంభవించాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీ పి. సీతారామ రాజు, మండల పంచాయితి అధికారి, అశ్వరావుపేటలో పదవీ విరమణ పొంది 03-09-2025 మానసిక వేదనతో మరణించడం జరిగింది. అదే విధంగా రాష్ట్ర వ్యాపితంగా చాలా మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వృద్ధాప్యంలో వారికి రావాల్సిన బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు.
కావున పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు వెంటనే విడుదల చేసి ఆదుకోవాల్సిందిగా తమరిని ప్రత్యేకంగా కోరుతున్నాను.