Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeTelanganaకార్తీక పురాణం..13 వ అధ్యాయం

కార్తీక పురాణం..13 వ అధ్యాయం

నేటి సత్యం నవంబర్ 3

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*కార్తీక పురాణం*

➖➖➖✍️

13 వ అధ్యాయము

కన్యాదాన ఫలం:“`

“ఓ జనక చక్రవర్తీ! కార్తీకమాసములో యింకను విధిగా చేయవలసిన ధర్మములు చాలాయున్నవి. వాటిని వివరించెదను. సావధానుడవై ఆలకింపుము..

కార్తీకమాసములో నదీస్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును.

ఈవిధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినయెడల యెంతటి మహాపాపములు చేసియున్ననూ, యెంతటి దుష్కృత్యములు చేసియున్ననూ, యెంతటి వ్యభిచారం చేసియున్ననూ, అ పాపములన్నియూ పోవును. ఎన్ని నూతులూ, తటాకములూ త్రవ్వించిననూ పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము జేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు.

అంతకన్న ముఖ్యమైనది కన్యాదానము. కార్తీకమాసమందు భక్తిశ్రద్ధలతో కన్యాదానము చేసినయెడల తను తరించుటయేగాక తన పితృదేవతలను కూడ తరింప జేసిన వాడగును. ఇందుల కొక యితిహాసం గలదు. చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుము..

*సువీర చరిత్రము:*“` ద్వాపరయుగములో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన ‘సువీరు’ డను ఒక రాజుండెను. అతనికి రూపవతి యను భార్యకలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడయి, భార్యతో అరణ్యమునకు పారిపోయి ధన హీనుడయి నర్మదా నదీ తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను.

కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాబముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రునివలె దినదినాభివృద్ధి నొందుచు, అతి గారాబముతో పెరుగుచుండెను. ఆమె చూచువారలకు కనులపండువుగా, ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను.

దినములు గడచినకొలదీ, బాలికకు నిండు యౌవన దశ వచ్చెను. ఒకదినము వనప్రస్థుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకా రాజు “ఓ ముని పుత్రా! ప్రస్తుతము నేను కడు బీదస్థితిలో నున్నాను. అష్ట దరిద్రములు అనుభవించు చున్నాను. మా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన యెడల నాకుమారై నిచ్చి పెండ్లి చేతు” నని చెప్పగా తన చేతిలో రాగి పైసా యైననూ లేక పోవుటచే బాలికపై నున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి, కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను.

రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి, తనకుమారైను మునికుమారునికిచ్చి పెండ్లిచేసి నూతన దంపతులిద్దరినీ అత్తవారింటికి పంపెను. అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించు చుండెను.

సువీరుడు ముని కుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్చగా ఖర్చుపెట్టుచూ భార్యతో సుఖంగా వుండెను.

అటుల కొంతకాలము జరిగిన తర్వాత ఆరాజు భార్యామణి మరొక బాలికను కనెను. అ బిడ్డకు కూడా యుక్త వయస్సురాగానే మరల యెవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో యెదురు చూచుచుండెను.

ఒకానొక సాధుపుంగవుడు తపతీనదీ తీరమునుండి నర్మదానదీ తీరమునకు స్నానార్ధమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని “ఓయీ! నీవెవ్వడవు? నీముఖ వర్చస్సుచూడ రాజవంశము నందు జన్మించినవానివలె నున్నావు. నీవీ యరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి?” అని ప్రశ్నించగా, సువీరుడు “మహానుభావా! నేను వంగదేశమునేలు చుండెడి సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువు లాక్రమించుటచే భార్యా సమేతముగా

నీ యడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటె కష్టమేదియునూ లేదు. పుత్ర శోకము కంటె గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్యా వియోగము కంటే గొప్పసంతాపము మరొకటిలేదు. అందుచే రాజ్య భ్రష్ఠుడనయినందున యీ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను.

నాకు యిద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునికిచ్చి, వాని వద్ద కొంతధనము పుచ్చుకొంటిని. దానితోనే యింతవరకు కాలక్షేపము చేయుచున్నాను” అని చెప్పగా, “ఓ రాజా! నీవు యెంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మము లాలోచింపక కన్యనమ్ముకొంటివి. కన్యావిక్రయము మహాపాతకములలో నొకటి, కన్యను విక్రయించినవారు “అసిపత్ర వన” మను నరక మనుభవింతురు. ఆ ద్రవ్యముతో దేవముని, పితృదేవతా ప్రిత్యర్ధము యే వ్రతము చేసినను వారు నశింతురు. అదియునుగాక కన్య విక్రయము చేసిన వారికి పితృ దేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయేగాక అతడు మహానరకమనుభవించును. కన్యావిక్రయము జేసినవారికి యెట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించియే యున్నారు. కావున, రాబోయే కార్తీకమాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తికొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు, ధర్మబుద్ధిగలవానికి కన్యాదానము చేయుము. అటులచేసిన యెడల గంగాస్నానమొనరించిన ఫలము, అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటయేగాక, మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగి పోవును” అని రాజునకు హితోపదేశము చేయగా అందుకా రాజు చిరునవ్వు నవ్వి..

“ఓ మునివర్యా! దేహ సుఖము కంటె దాన ధర్మముల వలన వచ్చిన ఫలము యెక్కువా? తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోను సిరి సంపదలతోను సుఖముగా వుండక, చనిపోయిన తర్వాత వచ్చెడి యేదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జార విడువమంటారా? ధనము, బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరుకాని ముక్కు మూసుకొని, నోరు మూసుకొని, బక్కచిక్కి శల్యమైయున్న వారిని లోకము గుర్తిస్తుందా? గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు, కాన, నా రెండవ కుమర్తెను కూడా నేనడిగినంత ధనమెవరిత్తురో వారికే యిచ్చి పెండ్లి చేయుదును కాని, కన్యా దానము మాత్రము చేయను” అని నిక్కచ్చిగా నుడివెను.

ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను.

మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొనిపోయి, యమలోకములో అసిపత్రవన మను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శ్రుతకీర్తి యను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యావిక్రయము వలన ఆ శ్రుతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి.

అంతట శ్రుతకీర్తి “నేనెరిగున్నంతవరకును యితరులకు ఉపకారమును చేసి దానధర్మాదులు, యజ్ఞయాగాదులొనరించి యున్నాను. నాకీ దుర్గతి యేల కలిగె?” నని మనసున అనుకొని నిండుకొలువు దీరియున్న యమధర్మరాజుకడకేగి, నమస్కరించి “ప్రభూ! నీవు సర్వజ్ఞుడవు. ధర్మమూర్తివి. బుద్ధిశాలివి. ప్రాణకోటి నంతను సమంగా జూచుచుందువు. నేనెన్నడూ ఏ పాపమూ చేసి యుండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణమేమి? సెలవిండు” అని ప్రాధేయ పడెను.

అంత యమధర్మరాజు శ్రుతకీర్తిని గాంచి, “శ్రుతకీర్తీ! నీవు న్యాయమూర్తివి. ధర్మజ్ఞుడవు, నీ వెటువంటి దురాచారములూ చేసియుండలేదు. అయిననేమి? నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ట పుత్రికను ధనమునకాశించి అమ్ముకొనెను. కన్య నమ్ముకొనేవారి పూర్వీకులు యిటు మూడు తరాలవారు అటు మూడు తరాల వారున్నూ వా రెంతటి పుణ్యపురుషులైననూ నరక మనుభవించుటయే గాక, నీచ జన్మ లెత్తవలసి యుండును. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదును గాన, నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరియొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా యాశీర్వాదమువలన నీవు మానవ శరీరము దాల్చి, అచటకు పోయి ఆ కన్యను వేదపండితుడును శీలవంతుడునగు ఒక విప్రునకు కార్తీకమాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము.అటుల చేసిన యెడల నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకేగుదురు. కార్తీకమాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను, లేక విధివిధానముగా ఆబోతునకు వివాహ మొనర్చినను కన్యాదానఫలమబ్బును.

కనుక, నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినటుల చేసితివేని ఆ ధర్మకార్యమువలన నీ పితృగణము తరింతురు. పొయి రమ్ము!” అని పలికెను.

శ్రుతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను, కుమార్తెను చూచి సంతోషపడి, ఆమెతో యావత్తు విషయములు వివరించి, కార్తీక మాసమున సువీరుని రెండవ కుమారైను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన యొక బ్రాహ్మణ యువకునికిచ్చి అతివైభవంగా వివాహము చేసెను. అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గ లోకములో నున్న పితృ దేవతలను కలిసికొనెను.

కన్యా దానము వలన మహా పాపములు కూడా నాశన మగును.

వివాహ విషయములో ఎవరికి మాట సహాయము చేసినను, పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్షబూని ఆచరించినవాడు విష్ణుసాన్నిధ్యము పొందును. శక్తి కలిగియుండి ఉదాసీనత చూపు వాడు శాశ్వత నరకమున కేగును.✍️“`

*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ద్ త్రయోదశాధ్యాయము – పదమూడన రోజు పారాయణము సమాప్తము.*

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

🌷🙏🌷“`

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏“`

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

➖▪️➖

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments