బలిపీఠంపై కార్మికుల భవితవ్యం
-జి. తిరుపతయ్య
కార్మిక మంత్రిత్వశాఖ ఇకనుండి యాజమాన్యాల మంత్రిత్వశాఖగా మారబోతున్నదా! యాజమాన్యాల రక్త దాహానికి రహదారులను ప్రభుత్వమే సిద్ధం చేస్తున్నదా! మోడీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను చూస్తుంటే అవుననే చెప్పుకోవాల్సి వుంటుంది.
29 కార్మిక చట్టాలను చుట్ట గట్టి, చూరు చేసి, నాలుగు లేబర్ కోడ్లుగా రూపొందించి కార్మికుల నరాలన్నింటినీ ఎలా బిగించాలో పార్లమెంట్ సాక్షిగా సిద్ధం చేశారు. వాటి అమలుకు ఆదేశాలు ఇంకా వెలువడక ముందే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, అనేకానేక కంపెనీలు ఆ నాలుగు లేబర్ కోడ్లలో ఉన్న వాటికన్నా ఎక్కువ నిర్బంధాలతో పని గంటలు పెంచి, రాత్రింబవళ్లు తేడా లేకుండా ఉద్యోగులను రాచి రంపాన పెడుతూ, మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా అన్ని వేళల్లోనూ పని చేయించుకుంటూ ఇష్టానుసారంగా రంపపు కోత సాగుతున్నది.
ఈలోపునే ‘శ్రమశక్తి నీతి 2025’ పేరున కేంద్ర కార్మిక శాఖ కార్మిక చట్టాల స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసి, దానిపై స్పందన తెలియజేయ వలసిందిగా ప్రజలను ప్రభుత్వం కోరుతున్నది. ప్రభుత్వాన్ని అడగవలసిన మొత్తం మొదటి ప్రశ్న-కార్మికులను ప్రభావితం చేసే అంశాలపై ప్రజలు స్పందించగలుగుతారా లేదా కార్మిక సంఘాలు, కార్మికులు స్పందిస్తారా? దీన్నిబట్టి కార్మిక సంఘాల పట్ల, కార్మికుల పట్ల ఈ పెద్దలకు ఎంత నిర్లక్ష్య భావన ఉన్నదో స్పష్టమవుతున్నది. ఈ శ్రమశక్తి నీతి విధానాన్ని రూపొందించడానికి కౌటిల్యుని అర్థశాస్త్రం, మనుస్మృతి, యజ్ఞవల్క్య స్మృతి, నారద స్మృతి, శుక్ర నీతి వంటి వాటిని ప్రాతిపదికగా చేసుకుని రచించామని ప్రకటించారు.
వారెవా! మన సాంప్రదాయాలను, మన నమ్మకాలను ఉటంకిస్తూ మన వేలితో మన కన్నునే నేరుగా పొడుచుకోవడానికి ఎంతటి కుయుక్తులతో సిద్ధమవుతున్నారో చూడండి! ఇలాంటి స్మృతులను ఉటంకించి భవిష్యత్తులో చట్టాలకు బదులు సాంప్రదాయ వాదంలో సమాధానాలు వెతుక్కోమని చెప్పడానికి మార్గం సుగమం చేసుకుంటున్నారన్నమాట! ”వ్యాపారం ద్రోహ చింతనం” (వ్యాపారం చేయడం మోస ప్రవృత్తికి అవకాశం ఇస్తోందని చెప్పిన కౌటిల్యుని మాటలకు ఏ మాత్రం విలువ ఇవ్వరు కానీ, ”లాభార్థి సర్వకార్య సాగుణ నీతి” (లాభాన్ని ఆశించేవాడు చేసే పనిలో అన్ని కార్యాలు సరైనవే) అనే అంశాన్ని మాత్రం యాజమాన్యానికి అనుకూలంగా అన్వయింపజూస్తున్నారు.
ఇంకో రకంగా చెప్పాలంటే భవిష్యత్తులో కార్మిక చట్టాలేవీ న్యాయ సమ్మతమైనవి కాకుండా చేయడానికి ఇవీ నాంది. కోర్టులో కూడా సవాల్ చేయడానికి వీలులేని విధంగా ఈ విధానాలను రూపొందిస్తున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కనీస సభ్యుల సంఖ్యను అమాంతం పెంచివేయడం, నిరసనలు ధర్నాలు నిర్వహించడానికి అనుమతులను తప్పనిసరి చేయడం, సదరు నిరసనలు సమ్మెలు చేయడానికి కంపెనీ లేదా సంస్థ కార్యాలయానికి కనీసం రెండు కిలోమీటర్ల దూరాన్ని పాటించాలని షరతు విధించడం, పని ప్రదేశాలలో ప్రమాదాలు జరిగినప్పుడు పరిహారాన్ని యాజమాన్యాల ఇష్టానుసారానికి వదిలివేయడం, కలిసికట్టుగా తెలిపే నిరసనను నేరపూరితంగా పరిగణించడం వంటివి ప్రతిపాదిత నాలుగు లేబర్ కోడ్లలో పొందుపరిచినప్పుడే కార్మికుల, కార్మిక సంఘాల అస్తిత్వానికి చరమగీతం పాడారు.
ఇప్పుడు కార్మికులు ఇవన్నీ పాటించినప్పటికీ ‘శ్రమశక్తి నీతి’ పేరు మీద యాజమాన్యాలు ఎలాంటి కక్షపూరిత చర్యలకు పాల్పడినా ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోవు. పైగా సూచనప్రాయ సలహా మాత్రమే ఇస్తాయి. పైపెచ్చు ‘కోఆపరేటివ్ ఫెడరలిజం’ అనే పేరును ఉటంకించి కార్మికులు యాజమాన్యాలు కలిసి మాట్లాడుకోవాలి తప్ప, పోరుబాట పట్టరాదన్నారు. ఇంకా చెప్పాలంటే యాజమాన్యాలకు సహకరిస్తూ, కావాల్సిన పరిహారాన్ని అర్థించాలి తప్ప డిమాండ్ చేసి బాధ పెట్టకూడదట. ఇలాంటి వాటిని కార్మిక చట్టాలంటారా? యాజమాన్య చట్టాలంటారా?
కార్మిక చట్టాల అమలుకు బాధ్యత వహించాల్సిన కేంద్రం కేవలం అవి అమలు జరిగేందుకు తోడ్పాటును అందిస్తుందట.
అంటే ఇకనుండి యాజమాన్యాలు కార్మిక చట్టాలను పాటించకపోయినా అమలు చేయకపోయినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన ఉండదు. ఒకవేళ కార్మికులెవరైనా తమ దృష్టికి తీసుకువస్తే ఇరు పక్షాలకు సూచనలు చేస్తుంది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నది. అనేక కంపెనీలు ప్రావిడెంట్ ఫండ్ చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన కేంద్రం కేవలం సూచనప్రాయంగా కూడా మందలించడం లేదు. కార్మికులు, కార్మిక సంఘాలు కోర్టుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా ఫలితాల సున్నా. పి.ఎఫ్ డిపార్ట్మెంట్లు ఏమీ చేయలేని అసహాయతలో ఉన్నాయి. ఇకనుండీ ఇది అధికారికంగా యాజమాన్యాలకు లభించే హక్కుగా మారబోతున్నది.
కాంట్రాక్ట్ ఎంప్లారుమెంట్ కల్పించే కాంట్రాక్టర్, వర్కర్లకు కాంట్రాక్ట్లోని అన్ని సదుపాయాలను కల్పించకపోతే, వర్కర్ల సేవలు పొందే ప్రిన్సిపల్ ఎంప్లాయర్ బాధ్యత వహించాలని కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్స్డ్ ఎంప్లారుమెంట్ చట్టంలో ఉండేది. లేబర్కోడ్ లలో దీన్ని పూర్తిగా తొలగించారు. ఇప్పుడు కాంట్రాక్టర్ బాధ్యత కూడా చట్ట పరిధి నుంచి తొలగిపోతున్నది. వర్కర్లను ఇష్టారీతిన తొలగించడానికి అనేక కారణాలతో పాటు మార్కెట్లో చౌకగా లభించే వర్కర్లు ఉన్నారని చూపించడానికి కూడా వెసులుబాటు కల్పిస్తున్నారు.
గతంలో కంపెనీలలో కార్మికులకు సంబంధిత అంశాలను పరిశీలించడానికి ఇన్స్పెక్టర్ను నియమించేది. ఇప్పుడు దాని పేరు ఫెసిలిటేటర్గా మార్చుకున్నారు. ప్రస్తుతం ఉన్న లేబర్ పాలసీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంట్లో, విధానసభలో చర్చించిన అనంతరం రాజ్యాంగం ద్వారా ఏర్పడినది. స్వాతంత్య్రానికి పూర్వమే అంబేద్కర్ ఆధ్వర్యంలో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ మొదలైంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015 నుండి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సమావేశాలు జరగడం లేదు.
”కార్మిక సంఘాలు, యాజమాన్యాలు, ప్రభుత్వం” కలిసి కార్మిక చట్టాల అమలు, కార్మికుల వెతలు, యాజమాన్య వ్యవస్థ స్థితిగతుల వంటి వాటిపై చర్చించాల్సిన అధికారిక కార్యక్రమం పూర్తిగా విడనాడబడింది. దీన్నిబట్టి కార్మికుల పట్ల కార్మిక సంఘాల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎంతటి నిర్లక్ష్యపూరిత వైఖరి ఉన్నదో స్పష్టమవుతోంది. ఇకనుండి ‘ఫేర్ వేజ్, లివింగ్ వేజ్, మినిమమ్ వేజ్’ అన్న విధానాలు ఉండవు. యాజమాన్యాల దయాదాక్షిణ్యాలపై వేతనాలు ఆధారపడి ఉంటాయి.
పెట్టుబడిదారులు కంపెనీ లాభాల కోసం వర్కర్ల వేతనాలను టార్గెట్ చేసుకోవడం చూస్తున్నాం. అయితే కార్మికోద్యమ చరిత్రలో ఏనాడూ యాజమాన్యాలుగానీ ప్రభుత్వాలుగానీ తమ దయాదాక్షిణ్యాలతో చేయి విదిలించిన సందర్భాలు లేవు. ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, చట్టాలు పోరాడి సాధించుకున్నవే తప్ప బుర్జువా పాలకులు ఇష్టంతో ప్రసాదించినవి కాదు. రాజకీయాలు పూర్తిగా డబ్బు మయమైపోయి, అమాయక ఓటర్లను చిరు కోరికలతో మోసం చేసే ప్రక్రియలో పాలక వర్గాలకు ఆశ్రిత పెట్టుబడిదారులు ఉపయోగపడుతున్నారు కాబట్టే ఇలాంటి దుర్నీతి చట్టాలు ముందుకొస్తున్నాయి. వీటిని ఎదుర్కొనే భాష కేవలం పోరాటం మాత్రమే.