Neti Satyam
Newspaper Banner
Date of Publish : 22 November 2025, 1:32 pm Editor : Admin

సి ఆర్ ఫౌండేషన్ లో చిల్డ్రన్స్ లైబ్రరీ ప్రారంభం!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం కొండాపూర్.
హైదరాబాద్ : ప్రస్తుతం గూగుల్ లేదా ఇంటర్నెట్ ద్వారా ఎంత సమాచారం కావాలంటే అంత పొందగలుగుతున్నప్పటికీ, లైబ్రరీకి వెళ్లి పుస్తకం చదివితేనే మనస్సుకు ఆనందం కలుగుతుందని మనసు ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ మన్నం వెంకట రాయుడు అన్నారు. హైదరాబాద్ కోండాపూర్ లోని చండ్ర రాజేశ్వరరావు (సి ఆర్) ఫౌండేషన్ లో గల నీలం రాజశేఖర్ రెడ్డి రిసెర్చ్ సెంటర్ (ఎన్ ఆర్ ఆర్ ఆర్ సి) లో శనివారం చిల్డ్రన్స్ లైబ్రరీని ముఖ్యఅతిధిగా హాజరైన మన్నం రాయుడు ప్రారంభించారు. ఎన్ ఆర్ ఆర్ ఆర్ సి కన్వీనర్ కె.అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గౌరవ అతిధిగా ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు, సి ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వర రావు, ఎన్ ఆర్ ఆర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ టి.సురేష్ బాబు, సభ్యులు డాక్టర్ బి.వి.విజయలక్షి సి ఆర్ ఫౌండేషన్ కోశాధికారి చెన్న కేశవ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మన్నం రాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం లైబ్రరీలకు అంత ప్రాధాన్యం లేకపోయినా, 50 ఏళ్ల కింద లైబ్రరీలే మనుషుల విశ్రాంతి స్థలం, జ్ఞాన కేంద్రాలుగా ఉండేవన్నారు. ప్రస్తుతం గూగుల్ లేదా ఇతర సెర్చ్ ఇంజిన్ ద్వారా సమాచారాన్ని సులభంగా పొందవచ్చు అన్నారు. నేటి జీవితం 50 సంవత్సరాల కంటే ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. భగత్ సింగ్ లాంటి మహానుభవులే కాకుండా, నేటి తరం వ్యక్తుల నుండి కూడా బాలబాలికలు ప్రేరణ పొందేందుకు ఈ కంప్యూటర్ డిజిటల్ పుస్తకాలు ఇచ్చానని తెలిపారు. ఇప్పటి వరకు తాము దాదాపు మూడు కోట్లపైగా పుస్తకాలను డిజిటలైజెషన్ చేశామని వెల్లడించారు. డాక్టర్ వాసిరెడ్డి రమేశ్ బాబు మాట్లాడుతూ కొత్తగూడెంలో ఒకప్పుడు ఎంతో సంప్రదాయంగా బాలోత్సవం నిర్వహించేవాళ్లమన్నారు. 25 ఏళ్ల కింద ప్రతి టా సుమారు 15 వేల మంది పిల్లలు పాల్గొనే ఈ వేడుకకు ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల నుండి కూడా తెలుగు పిల్లలు వచ్చేవారని గుర్తు చేశారు. 1950, 1960 దశకాలలో గ్రామాల్లో లైబ్రరీలు ప్రజల జ్ఞాన కేంద్రాలుగా ఉండేవన్నారు. పెద్దలు, యువత మాత్రమే కాకుండా మహిళలు కూడా పుస్తకాలు తీసుకుని చదవడంలో చురుకుగా ఉండేవారని తెలిపారు. నేటి కాలంలో లైబ్రరీల సంఖ్య తగ్గిపోయినా, పిల్లల్లో చదువు అలవాటును పెంపొందించడానికి ప్రత్యేక లైబ్రరీ అవసరమని చెప్పారు. చదవడంతో పిల్లల్లో మానసిక ఉల్లాసం వస్తుందన్నారు. జ్ఞానం అంత పుస్తకాల్లోనే ఉంటుందని చెప్పారు. మనిషిగా, మానవునిగా ఎదగాలంటే పుస్తకాలు చదవాలని డాక్టర్ సురేష్ బాబు సూచించారు. ముప్పాళ్ల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ బాలల వికాసానికి లైబ్రరీలు తోడ్పాటును అందిస్తాయన్నారు. ఖగోళం నుంచి భూగోళం వరకు విజ్ఞానం లైబ్రరీలలో ఉంటుందన్నారు. పుస్తక పఠనం తగ్గిపోవడంతో ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు తగ్గిపోయాయని, ప్రేమాభిమానాలు సన్నగిల్లాయన్నారు. పుస్తక పఠనం ద్వారా అంతరించిపోతున్న మానవ విలువలను కాపాడవచ్చు అన్నారు. సిఆర్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. డాక్టర్ బి.వి.విజయలక్ష్మి మాట్లాడుతూ ఎన్ ఆర్ ఆర్ రీసెర్చ్ సెంటర్ ఇప్పటికే లైబ్రరీ భవనం ఏర్పాటు చేశామన్నారు. లైబ్రరీలో వ్యవసాయం, ఆర్థిక, రాజకీయ, వాణిజ్యం తదితర సమాచారం ఉంటుందని తెలిపారు. సురవరం సుధాకర్ రెడ్డి పుస్తకాలు చదవడం ద్వారా అపారమైన విషయ పరిజ్ఞానాన్ని పొందారని గుర్తు చేశారు. పుస్తకాలు చదవడంతో పాటు రాయడం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు ఆమె సూచించారు. డైరి రాయడం కూడా పిల్లలు అలవాటు చేసుకోవాలన్నారు.