మార్క్సిస్టు సిద్ధాంత పితామహుడు కారల్ మార్క్స్ హితుడు, సన్నిహితుడు, భావజాల భాగస్వామి ఫ్రెడరిక్ ఎంగెల్స్ (28-11-1820 ….5 ఆగష్టు 1895)205, జయంతి… విప్లవ జోహార్లు
_ఎంగెల్స్_కృషి_ ఆదర్శప్రాయం…
నేడు ప్రపంచ వ్యాప్తంగా విద్య, వైద్యం, ఆరోగ్యం ప్రభుత్వ రంగంలో ఉండడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో….ప్రభుత్వ రంగంలో లేనిపక్షంలో ప్రజల ప్రాణాలకు ఏర్పడే ముప్పు ఏమిటో…కోవిడ్ మహమ్మారి హెచ్చరిస్తోంది. విద్య, వైద్యం ప్రభుత్వమే నిర్వహించాలని తన 27వ ఏటనే ‘కమ్యూనిజం సూత్రాలు’ రచనలో ఒక అంశంగా ప్రతిపాదించిన ఫ్రెడరిక్ ఏంగెల్స్ 203వ జయంతి సంవత్సరమిది. ఆయన పరిశోధించి రూపొందించిన సిద్ధాంత విషయాలను నేటి తరం యావత్తు తెలుసుకోవాలి.
జర్మనీలో పరిశ్రమలు, పెట్టుబడిదారీ విధానం వేగంగా పెరుగుతున్న 18వ శతాబ్దపు రోజులవి. 1820 నవంబరు 28న బార్మెన్ నగరంలో ఒక బట్టల మిల్లు యజమాని తొలి సంతానంగా ఏంగెల్స్ జన్మించాడు. తన చదువు పూర్తి చేసుకున్న రోజు నుండి మరణించే వరకు కార్మికవర్గం బాధలు పోగొట్టేందుకు, సమాజం ఉన్నతంగా ఉండేందుకు జరగాల్సిన మార్పుల గురించి కృషి చేశాడు. సిద్ధాంతం, ఆచరణ మేళవింపుగా ఏంగెల్స్ జీవితం మనకు కనపడుతుంది. ఏంగెల్స్ 1839-42 మధ్యకాలంలో 50 వ్యాసాలు, రాజకీయ, సాహిత్య విమర్శకుడిగా పత్రికలకు రాశాడు. 1843లో ‘రాజకీయ అర్థశాస్త్ర విమర్శ-ఒక రేఖా చిత్రం’ అనే వ్యాసాన్ని రాశాడు. 1845 లోనే ఏంగెల్స్ ఇంగ్లండు లోని వివిధ నగరాలలోని కార్మికుల పరిస్థితులను, అక్కడి స్థితిగతులను అధ్యయనం చేసి ‘ఇంగ్లండులో కార్మికుల పరిస్థితి’ అనే గ్రంథాన్ని రచించాడు. మార్క్స్, ఏంగెల్స్‌లు ఇద్దరూ కలిపి ‘పవిత్ర కుటుంబం’ అనే గ్రంథాన్ని 1846లో ప్రచురించారు. వ్యక్తి ముందా? సమాజం ముందా? అనే దానికి సమాజమే ముందు అని రుజువులతో సహా వివరించారు. 1847లో కమ్యూనిస్టు లీగ్ తీర్మానం మేరకు మార్క్స్, ఏంగెల్స్‌లు ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ రచన బాధ్యత తీసుకున్నారు. అందుకోసం ఏంగెల్స్ తన అభిప్రాయాలను ‘కమ్యూనిజం సూత్రాలు’ పేరుతో ప్రశ్నలు-సమాధానాల రూపంలో కమ్యూనిస్టు లీగ్‌కు అందించారు. ఆ తర్వాత మార్క్స్‌తో చర్చించిన అనంతరం అందులోని విషయాలను మార్పులు చేర్పులతో ‘కమ్యూనిస్టు ప్రణాళిక’గా తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వందల భాషలలో వేల ముద్రణలతో అత్యంత ప్రభావం చూపిన రచన అది.
ఈతి బాధలు లేని సమాజ అవసరం, అందుకు కార్యకారణాలు వివరించేందుకు ‘జర్మన్ సిద్ధాంత సంపుటి’ గ్రంథాన్ని మార్క్స్‌తో కలసి ఏంగెల్స్ రాశాడు. దీనిలో మానవుడి చైతన్యం- అస్థిత్వంలలో అస్థిత్వం యొక్క ప్రాధాన్యతను వివరించాడు. తత్వశాస్త్రానికి శ్రామిక వర్గానికి అవినాభావ సంబంధంతోనే రెండూ అభివృద్ధి చెందుతాయని నిర్ధారించాడు. హెగెల్ గతితర్కాన్ని బలపరుస్తూనే ఆయన ప్రతిపాదించిన అఖండ భావం పేర భావవాదాన్ని ఖండించిన ఏంగెల్స్ ‘దేవుడు మనిషిని సృష్టించలేదు. మనిషే దేవుడిని సృష్టించాడు’ అని చెప్పి భౌతికవాదాన్ని సమున్నతంగా నిలిపాడు. ఇదే గతి తార్కిక, చారిత్రక భౌతికవాద సూత్రాలు రూపొందించడంలో ముఖ్య ఘట్టం. 1845 నుండి 1870 వరకు యూరప్ అంతటా సాగిన ప్రజా, కార్మిక తిరుగుబాట్లు ప్రపంచానికి ఏంగెల్స్ తన వ్యాసాలు, రచనల ద్వారా తేటతెల్లం చేసాడు. జర్మనీలో 1848-49లలో జర్మనీలో రైతాంగ విప్లవం జరిగింది. 300 సంవత్సరాల క్రితం జర్మనీలో జరిగిన రైతు యుద్ధం పేరుతో విప్లవం జరిగింది. రెండింటికీ పోలికలు, తేడాలు ఉన్నాయి. 1850లో ‘జర్మనీలో రైతాంగ యుద్ధం’ ఏంగెల్స్ రచించాడు. 1857లో పర్షియా-చైనా అన్న వ్యాసంలో విదేశీ దాడికి వ్యతిరేకంగా చైనా ప్రజానీకం ప్రతిఘటన నానాటికి పెరగటాన్ని నొక్కి చెప్పాడు. 1870-71 నాటి ఫ్రాన్సు-రష్యా యుద్ధాన్ని గురించి ధారావాహికంగా అనేక వ్యాసాలు రాసి మంచి జర్నలిస్టుగా ప్రాచుర్యం పొందాడు.
25 సంవత్సరాలు కృషి చేసి కారల్ మార్క్స్ రచించిన ‘పెట్టుబడి’ (దాస్ కేపిటల్) 1867లో విడుదల అయ్యింది. దాని రూపకల్పనలో అనేకసార్లు ఇరువురూ చర్చించి తుదిమెరుగులు దిద్దారు. 1870వ దశాబ్దంలో జర్మనీలో అద్దె ఇళ్ల సమస్య ముందుకు వస్తుంది. దానిపై జరిగిన చర్చలలో ఏంగెల్స్ అనేక వ్యాసాలు రాశాడు. పెట్టుబడిదారీ విధానంలో ఇంటి సమస్య పరిష్కారం కాదని ఏంగెల్స్ వివరించాడు. 1871లో మానవజాతి చరిత్రలో మొదటి కార్మికవర్గ తిరుగుబాటు పారిస్ నగరంలో జరిగింది. కార్మికులు అధికారంలోకి వచ్చారు. దాన్ని 72 రోజులలోనే రాజులు, పెట్టుబడిదారులు కూలగొట్టారు. వేల మంది విప్లవకారులు హత్య చేయబడ్డారు. ‘పారిస్ కమ్యూన్’ వివరాలు, దాని అనుభవాలు, గుణపాఠాలను మార్క్స్, ఏంగెల్స్ కలసి ఒక రచన ద్వారా తెలిపారు. కార్మికవర్గం విప్లవం ద్వారా అధికారంలోకి రావడం మాత్రమే చాలదు. పాత రాజ్యాంగ యంత్రాన్ని సమూలంగా రద్దు చేయాల్సిన అవసరాన్ని సిద్ధాంతీకరించారు. కార్మికవర్గం కర్షకులతో ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని దానిలో వివరించారు. ఈ పుస్తకం ఎంతో ప్రాచుర్యం పొందింది. పెట్టుబడి గ్రంథం మొదటి సంపుటి కంటే ఈ పుస్తకం ద్వారానే వారికి ఎక్కువ ప్రజాదరణ వచ్చింది.
1872లో ‘ప్రకృతి-గతితర్కం’ రచించాడు. అందులో ‘మన మెదడు, రక్తమాంసాలు ప్రకృతిలో భాగమే’ అన్నాడు. ప్రకృతిపై యుద్ధం శత్రువులపై దండయాత్రలా ఉండకూడదని, ప్రకృతి సూత్రాలను తెలుసుకుని వాటిని సరిగ్గా అన్వయించాలని చెప్పాడు. సైన్యోన్మాదం వలన ప్రజల సంక్షేమానికి వెచ్చించవలసిన ఖర్చును దెబ్బతీస్తుందని 1877 లోనే ఏంగెల్స్ అంటాడు. దాంతోపాటు రాబోయే రెండు ప్రపంచ యుద్ధాలకు చెందిన ప్రాతిపదికలను కూడా తన రచనలలో హెచ్చరించాడు. 1878లో ‘యాంటీ డ్యూరింగ్’ పుస్తకాన్ని రచించారు. యుద్ధానికి, సైనిక శాస్త్రానికి సంబంధించిన మార్క్సిస్టు ప్రతిపాదనలను క్రోడీకరించి ఇందులో పొందుపరిచాడు. ప్రకృతి విజ్ఞాన శాస్త్ర అధ్యయన క్రమంలో తను సాధించిన తొలి ఫలితాలను ఏంగెల్స్ వివరించాడు. చారిత్రక ఘటనలలో ఎలా అయితే గతితార్కిక సూత్రాలు కనిపిస్తాయో అలాగే ప్రకృతిలో మార్పులలో కూడా గతితార్కిక నియమాలు ఉంటాయని నిరూపించాడు. 1880లో ‘సోషలిజం ఊహాజనితం-శాస్త్రీయం’ గ్రంథంలో ‘వర్గపోరాటం, విప్లవకర మార్పులు లేకుండా పెట్టుబడిదారీ విధానం రద్దు చేయడం సాధ్యం కాని పని’ అని వక్కాణించాడు.
‘వానరుడు నరుడుగా మారిన క్రమంలో శ్రమ పాత్ర’ ఏంగెల్స్ రాశాడు. మనిషి మెదడు పరిణామ క్రమంలో వేగంగా అభివృద్ధి చెందడానికి శ్రమతోబాటు ఆహారం తయారీలో నిప్పును ఉపయోగించడం ఎలా ఉపయోగపడిందో ఏంగెల్స్ వివరించాడు. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థ మానవుడి నుంచి శ్రమను వేరు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలోనే నిరుద్యోగం పెరుగుతుంది. ఈ క్రమం శాశ్వతం కాదని తిరిగి మానవుడు, శ్రమ విడదీయలేని తీరులో కలిసిపోయి ‘శ్రమైక జీవన సౌందర్య’ వ్యవస్థ ఏర్పడడం తథ్యమని బలమైన విశ్వాసాన్ని ఈ రచన కల్పిస్తుంది. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం, మోర్గాన్ రాసిన పురాతన సమాజం లలో నిర్ధారణలను వినియోగించుకుని ‘కుటుంబం-వ్యక్తిగత ఆస్థి-రాజ్యాంగ యంత్రం’ అనే గ్రంథాన్ని 1884 లో ఏంగెల్స్ రాశాడు. స్త్రీల మీద పురుషాధిపత్యం సమాజంలో ఏవిధంగా ఎలా పాతుకుపోయిందో వివరించారు. నిజమైన ప్రేమతో తప్ప స్త్రీ పురుషులు కలవడానికి ఉన్న ఆర్థిక కారణాలుఎప్పుడు తొలగిపోతాయో… అప్పుడు ఈ సమస్యకు సమాధానం దొరుకుతుందని అందులో ఏంగెల్స్ వివరిస్తాడు. కారల్‌మార్క్స్ మరణానంతరం పెట్టుబడి గ్రంథం 2వ, 3వ భాగాలు మార్క్స్ స్ఫూర్తిని, ఆయన ఆలోచన, ప్రతిపాదనల రూపంగా ఏంగెల్స్ కృషితోనే ప్రచురించబడ్డాయి.
ఇంగ్లండు, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్ మరియు యూరప్ లోని వివిధ దేశాలలో 1844 నుండి1850 వరకూ తిరుగుబాట్లు జరిగాయి. ఏంగెల్స్ ప్రత్యక్షంగా తుపాకి పట్టుకుని కొలోన్‌లో బారికేడ్ల వద్ద పోరాటంలో పాల్గొన్నాడు. ప్రభుత్వాలు పెట్టిన అనేక కేసులు ఎదుర్కొన్నాడు. కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ ఏర్పాటులో కారల్‌మార్క్స్‌తో పాటు చురుకైన పాత్ర పోషించాడు. మార్క్స్ మరణానంతరం వివిధ దేశాలలోని కార్మిక, కమ్యూనిస్టు ఉద్యమ నేతలతో సలహాలు, సంప్రదింపులు జరిపి వారికి అనేక రకాలుగా సహకారం అందించాడు. 1895 ఆగష్టు 5న ఏంగెల్స్ తన 75వ ఏట లండన్‌లో మరణించాడు.
— గుడిపాటి నరసింహారావు
(వ్యాసకర్త సెల్ : 94900 98559 )
పెట్టుబడి దారీ సమాజం లో పెట్టుబడిదారుడు, కార్మికునితో అంగీకారానికి రాలేకపోతే, ఆగి, తన పెట్టుబడి మీద బతకగలడు
కార్మికుడు అలా చేయలేదు. అతనికి బతకడానికి కూలి మాత్రమే ఉంది. కనుక అతను ఎప్పుడు, ఎక్కడ, ఏ షరతులమీద పని సంపాదించుకోగలిగితే అప్పుడు, అక్కడ, ఆ షరతులమీద పనిని తీసుకోవాలి. ప్రారంభంలోనే కార్మికుడు ప్రతికూల పరిస్థితిలో ఉన్నాడు. అతనికి ఆకలి అనే భయంకరమైన అసౌకర్యం ఉంది. యాంత్రిక శక్తినీ, యంత్రాలనూ నూతన వృత్తులకు ప్రయోగించడమూ, అప్పటికే వాటికి గురైన వృత్తులలో యంత్రాల విస్తరణా, మెరుగుదలలూ అంతకంతకూ ఎక్కువ ‘చేతుల’ను నిరుద్యోగులుగా చేస్తూ ఉంటాయి. ఈ తొలగింపబడిన ‘చేతులు’ పెట్టుబడి ఉపయోగార్థం నిజమైన రిజర్వు పారిశ్రామిక సైన్యంగా ఏర్పడతాయి. ఈ రిజర్వు సైన్యంలోని చివరి పురుషునికీ, స్త్రీకి, లేదా బాలబాలికలకూ పని దొరికిందాకా ఈ సైన్యపు పోటీ వేతనాలను తగ్గించి ఉంచుతుంది.
(ఫ్రెడరిక్ ఎంగెల్స్ రాసిన ‘వేతన వ్యవస్థ’ అనే గ్రంథం నుండి ఈ భాగం గ్రహించబడింది)