Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeTelanganaపల్లె పాశిముఖంతోనే ఉన్నదా.....?

పల్లె పాశిముఖంతోనే ఉన్నదా…..?

* పల్లె పాశిమొఖంతోనే ఉన్నదా?

December 9, 2025

నేటి సత్యం గతానికి నేటికి గ్రామం గతి ఏమైనా మారిందా? మా ఊరి రాజకీయం ఇలా.. మరి మీ ఊరో? తెలంగాణలో ఇప్పుడంతా ఇదే చర్చ. భారత ప్రజాస్వామ్యంలో గ్రామ పంచాయతీలది కీలకపాత్ర. వాటికి నాయకత్వం వహించే సర్పంచ్‌, గ్రామ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపం. మరి ఇలాంటి కీలకమైన పదవిలో ఉండే వారు గెలిచాక చిత్తశుద్ధితో పనిచేస్తున్నారా? ఆలోచించాల్సిన సందర్భమిది. ఎన్నికల సమయంలో మాత్రం ఎన్నో హామీలమీద హామీలు గుప్పిస్తున్నారు. ఈ వాగ్దానాలు కేవలం ఓట్లకోసమేనా, లేక నిజంగా గ్రామ అభివృద్ధికా? అన్నది తరచూ చర్చనీయాంశమే. వారిచ్చే హామీలన్నీ దాదాపుగా గ్రామ మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలే ఎక్కువ. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఈరోజు వరకు అవే హామీలతో నెట్టుకొస్తున్నారు. గ్రామాల మౌలిక అవసరాలు ఇంకా తీరలేదా? కొత్తగా పుట్టుకొస్తున్నాయా? పోటీచేసేవారు చెప్పే మాటలు అన్ని గ్రామాల్లో సగానికి పైగా ఒకే కోవలో ఉండటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మంచినీటి సౌకర్యం, రహదారులు, పారిశుధ్యం, వీధి దీపాలు ఇవి సర్వసాధారణంగా చెప్పేమాటలు. కానీ శాశ్వత అభివృద్ధి జరగడం చాలా అరుదు. నాకు బాగా గుర్తు, మా ఊరిలో ప్రతి బోనాల పండుగకు వీధి లైట్లు మారు స్తారు. మోరీలు (డ్రైయినేజీ) చెప్పంగ చెప్పంగా సర్పంచ్‌ సాబ్‌కి మనసొస్తే శుభ్రం, లేకుంటే జర భద్రమే అన్నట్టుగా ఉంటది. ఐదేండ్లలో ఊరు ఉన్నతి కంటే వ్యక్తిగత అభివృద్ధిలో బ్రహ్మాండమైన పురోగతి కనిపిస్తుంది. నెలకు రూ.6300 జీతం తీసుకునే సర్పంచే వృద్ధి చెందినప్పుడు నెలకు రూ.పది వేలు, పదిహేను వేలు గౌరవ వేతనం పొందే కార్మికులు, ఇతర కూలీల పరిస్థితి ఎందుకని దిన దినానికి దిగజారుతోంది?

యువత పంచాయతీ ఎన్నికల్లో (తాగుడు, తినడం) ఉన్నంత ఆర్భాటం పల్లె ప్రగతిపై ఉందా? ఎన్నికల్లో ఆవేశాలతో రగిలిన యువ రక్తం, అభివృద్ధి కోసం ఐదేండ్ల సమయంలో చుక్క చెమటైనా చిందించిందా? సమస్యలపై స్పందించిందా? అధికారంలో ఉన్నవారితో పోరాడి పరిష్కరించిందా? అప్పుడప్పుడు పేపర్‌లో, టీవీలలో చూస్తూ ఉంటాం ఫలానా గ్రామం సుపరిపాలన సాధించిందని. ఎన్నీ గ్రామాలు, ఎంతమంది సర్పంచులు ఆ విధమైన గ్రామాలతో పోటీ పడి పనిచేస్తున్నారు. గ్రామాల గతిని మార్చే అవకాశం అర చేతిలో ఉన్నా, గల్లీ రాజకీయాలు గతాన్నే కోరుకోవడాని ఏమనాలి, ఎలా చూడాలి? ‘ప్రభుత్వాలు పైసలు పంపలేదు.పనులు జరగలేదు’ ఇదొక్కటే సమాధానం కాదు. అభివృద్ధికి ఏం చేయాలన్నదే ముఖ్యం. తోటి పల్లెలను చూసి స్వంత గ్రామా లు ఎంత మేరకు పోటీపడుతున్నాయి. గ్రామ దేవత గుర్తుచెయ్యాలా గడప గడపకు చందా లేసి గుడి కట్టినవ్‌, మరి బడి సంగతి ఏమిటని? ప్రస్తుతం ‘గ్రామ స్వరాజ్యం గంగలో, పల్లె పాలిటిక్స్‌ నింగిలో’ అన్నట్టుంది.గ్రామాలు ఏకమై గడీల పాలనను బద్దలుగొట్టిన చైతన్యం ఊరు కోసమేది? అది ఉంటే గ్రామం అభివృద్ధి వైపు గంతులేస్తదని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

మరొక ముఖ్యాంశం ఏమిటంటే? నేటికీ కొనసాగుతున్న అస్పృశ్యత, అంటరానితనం వంటి వివక్ష పల్లెలను విడువడం లేదు. పల్లె ఐక్యమత్యానికి అడ్డుగోడలే అంటరానితనం. పల్లె పలకరింపులో మతం లేదు (భారు భారు) అంటూ ఉండే, ‘భారతీయులందరూ నా సోదరులు’ అని చేసిన ప్రతిజ్ఞ పాటించేలా ఉన్న.. మా ఊరికి మతం మహమ్మారి వచ్చి, మొఖాలు చూసుకోకుండా చేస్తుంది.అది ఎవరి పుణ్యమో దేశమంతా ఎరుకే. మనుషుల మధ్య ఘర్షణ పెట్టాక గ్రామ అభివృద్ధి ఎలా సాగుతుంది? హామీలివ్వడం ఎంత సులభమో, వాటిని నెరవేర్చడం అంతేకష్టం. సర్పంచ్‌కు గ్రామ ప్రజల సహకారం, వారి భాగస్వామ్యం ఈ హామీల అమలుపై ఆధారపడి ఉంటుంది. హామీలు కేవలం ఎన్నికల తంతుగా మిగిలిపోకుండా, వాటిని ఆచరణలోకి తీసుకురావడానికి సర్పంచ్‌ నిజాయితీగా కృషి చేయాలి. ఎప్పుడు సాధారణమైన అంశాలే హామీలు కాకుండా పాఠశాల, లైబ్రెరీలాంటి అంశాలపై దృష్టి పెట్టాలి. ప్రజలు కూడా తమ నాయకులను కేవలం హామీల ఆధారంగా కాకుండా కులం, మతం, చూసి ఓటు వేయడం కాదు, వారి గత పనితీరు, చిత్తశుద్ధిని గమనించాలి. గ్రామాభివృద్ధి పట్ల వారికి ఉన్న నిబద్ధతను బట్టి ఎన్నుకోవాలి. అందుకే పల్లె ముఖం కడిగిందా? పాశి మొఖంతోనే ఉన్నదా..? అందరూ జరంతా ఈ బేరీజు వేసుకుని ఓటు వేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments