** ముస్తాబైన తిరుపతి
నేటి సత్యం.Dec 12,2025 2
నేటి నుంచి ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభ
నేడు మహాప్రదర్శన, బహిరంగ సభ
నెల్లూరు నుంచి చేరుకున్న పెంచలయ్య స్మారక జ్యోతి
ప్రజాశక్తి-తిరుపతి బ్యూరో : ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభకు ప్రముఖ యాత్రా స్థలమైన తిరుపతి వేదికైంది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభకు రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి పాఠశాలలు మొదలు యూనివర్సిటీ స్థాయి వరకూ దాదాపు 500 మంది విద్యార్థులు ప్రతినిధులుగా హాజరు కానున్నారు. మహాసభ ప్రారంభ సూచికగా తిరుపతి ఎస్‌వి ఆర్ట్స్ కాలేజీ నుంచి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే మహాప్రదర్శన నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ వరకూ సాగనుంది. దీనిలో రాష్ట్ర నలుమూలల నుంచి ఐదు వేల మందికిపైగా విద్యార్థులు పాల్గననున్నారు. అక్కడ జరగనున్న బహిరంగ సభకు ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్ష, కార్యదర్శులు ఆదర్శ్ ఎం.సాజి, శ్రీజన్ భట్టాచార్య హాజరు కానున్నారు. అనంతరం తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో జరగనున్న ప్రతినిధుల ప్రారంభ సభకు తమిళనాడు హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ కె.చంద్రు, కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్ఎఫ్ఐ అఖిల భారత మాజీ అధ్యక్షులు వై.వెంకటేశ్వరరావు హాజరై ప్రసంగిస్తారు. మహాసభ నేపథ్యంలో తిరుపతి నగరం అంతా ఎస్ఎఫ్ఐ జెండాలతో అలంకరించారు. స్వాగత సుమాంజలి బ్యానర్లు ఏర్పాటు చేశారు. 40 ఏళ్ల తర్వాత తిరుపతిలో నిర్వహిస్తున్న రాష్ట్ర మహాసభలో గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను టిడిపి కూటమి ప్రభుత్వ అమలు చేయకపోవడం, ఒక దఫా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎగొట్టడడం, రూ.6,400 కోట్ల పెండింగ్ బకాయిలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తదితర అంశాలపై చర్చించనున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్నకుమార్ తెలిపారు. నాణ్యమైన, సమానమైన విద్య అందరికీ అందించాలన్న లక్ష్యంతో భవిష్యత్తు పోరాటాల రూపకల్పన చేయనున్నట్లు చెప్పారు. జాతీయ నూతన విద్యా విధానం వల్ల పేద విద్యార్థులకు విద్య అందకుండా పోతోందన్నారు. విద్యార్థుల్లో పెడధోరణులను, డ్రగ్స్‌ను, మద్యాన్ని ప్రభుత్వమే నివారించాలన్నారు. గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడిన నెల్లూరుకు చెందిన పెంచలయ్య స్ఫూర్తితో ‘డ్రగ్స్ అంతం – ఎస్ఎఫ్ఐ పంతం’ అని కీలక పిలుపు ఇవ్వనున్నట్లు తెలిపారు. నెల్లూరు నుంచి బయల్దేరిన పెంచలయ్య స్మారక జ్యోతి గురువారం సాయంత్రం తిరుపతి చేరుకుంది. ఈ ‘జ్యోతి’ని విప్లవ స్ఫూర్తితో ప్రసన్నకుమార్, ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అక్బర్, భగత్ తదితరులు అందుకున్నారు.