** పురోగమిస్తున్న పేదరికం
నేటి సత్యండి సెంబర్ 12, 2025
ఈ భూగోళంమీద ఉన్న సగం జనాభాకు చెందిన మొత్తం సంపదకు మూడురెట్లు ఒక ఫుట్‌బాల్ స్టేడియంలో పట్టేంతమంది కుబేరుల వద్ద పోగుబడిఉందని ఒక్కమాటలో విషయాన్ని సులువుగా విప్పిచెప్పింది ‘ప్రపంచ ఆర్థిక అసమానతల నివేదిక–2026’. పరిశోధన, అధ్యయనం, విశ్లేషణలతో పాటు, అర్థమయ్యేరీతిలో అసమానతలకు కారణాలను తెలియచెప్పడంలోనూ, పరిష్కారమార్గాలను సూచించడంలోనూ వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్‌కు గుర్తింపు ఉంది. అపరకుబేరులున్న పేదదేశంగా గత నివేదికలో భారతదేశాన్ని అభివర్ణించిన ఈ సంస్థ ఈ సరికొత్త నివేదికలో, నానాటికీ మరింత హెచ్చుతున్న ఆదాయ అసమానతలతో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందనీ, మిలియనీర్లు బిలియనీర్లుగా మారుతూంటే, పేదలు నిరుపేదలుగా తిరోగమిస్తున్నారని హెచ్చరించింది.
దేశంలో పదిశాతం సంపన్నుల దగ్గర 6౫శాతం సంపద ఉంది. ఇందులోనూ ఒకశాతం శ్రీమంతుల ఖజానాలోనే నలభైశాతం సంపద పోగుపడివుంది. జాతీయ ఆదాయంలో ఆ పదిశాతం మంది వాటా దాదాపు 58శాతం, అడుగున ఉన్న యాభైశాతం జనానిదీ పదిహేనుశాతమే. గత నివేదికతో పోల్చితే కుబేరుల వాటా ఒక శాతం పెరిగినట్టు లెక్క. ఈ దేశంలో సామాన్యుల తలసరి ఆదాయం లక్ష రూపాయలలోపు, కుబేరుల తలసరి దాదాపు కోటిన్నర. సర్వసాధారణంగా దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు సామాన్యుడి ఆదాయం పెరుగుతుంది, అంతరాలూ కొంత తగ్గుతాయి.
కానీ, గత పదేళ్ళలో పేద ధనిక తేడా తగ్గకపోగా కాస్తంత పెరిగింది కూడా. ఆదాయ అసమానతల్లో భారత్ అగ్రస్థానంలో ఉండటంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా అసమానతలు పెరగడం మరో అంశం. అట్టడుగున ఉన్న యాభైశాతం మంది మొత్తం సంపదకు మూడురెట్లు కేవలం 0.001శాతం మంది ధనికుల చేతుల్లో ఉంది. అధికారం, ఆస్తి అధికంగా ఉన్నవాళ్ళు జాతీయ ఆదాయంలో అధికవాటాలు కొల్లగొట్టడం తప్ప, పన్నురూపేణా ఖజానాకు సమకూరుస్తున్నది చాలా తక్కువ. ఒక మధ్యతరగతి వృత్తినిపుణుడు వివిధరకాల పన్నులద్వారా అధికమొత్తాలు చెల్లిస్తూంటే, ఒక బిలియనీర్ తనకు అనుకూలంగా రూపొందిన విధానాలతో దాదాపు పన్నుకట్టనవసరం లేని స్థాయిని అనుభవిస్తున్నాడు.
టాక్స్ జస్టిస్ లేకపోవడమే కాదు, విద్య, ఆరోగ్యం ఇత్యాది రంగాలమీద ప్రభుత్వం పరిమితంగా ఖర్చుచేయాల్సిన దుస్థితి దీనివల్ల ఏర్పడిందని నివేదిక చెబుతోంది. ఇటీవలి జీ20 సదస్సు సందర్భంలో విడుదలైన నివేదిక కూడా 23 ఏళ్ళలో కొత్తగా సృష్టించిన సంపదలో 41శాతం అగ్రగామి ఒకశాతం ప్రపంచ కుబేరుల చేతుల్లోకి పోయి, దిగువున ఉన్న యాభైశాతానికీ ఒకశాతమే దక్కిందని వివరించింది. ఇదేకాలంలో, భారత కుబేరుల్లో పైస్థాయి ఒకశాతం మంది సంపద విలువ ౬2శాతానికి పెరిగితే, చైనాలో ఇది 54శాతంగా ఉంది. అసమానతలు ఇదే వేగంతో హెచ్చితే, ప్రజాస్వామ్యానికి చేటు తప్పదని కూడా ఆ సందర్భంలో హెచ్చరికలు విన్నాం.
మొన్న జూలైలో కాంగ్రెస్ పార్టీ కేంద్రప్రభుత్వం మీద ‘మేథా మోసం’ అంటూ ఒక విమర్శ చేసింది. ఆదాయ సమానత్వంలో అమెరికా, చైనా సహా అన్ని దేశాలను వెనక్కునెట్టేసి భారతదేశం ప్రపంచంలోనే నాలుగోస్థానంలో నిలిచిందని ప్రపంచబ్యాంకు నివేదిక చెబుతున్నట్టుగా, భారత్ ‘గినీ సూచీ’ స్కోరు 25.5ను ఆధారంగా పిఐబి ఒక కథనం అందించింది. 2011–23 మధ్యకాలంలో పదిహేడుకోట్లమంది భారతీయులు కటికదారిద్ర్యం నుంచి బయటపడ్డారనీ, దేశంలో పేదరికం రేటు పదహారునుంచి రెండుకు పడిపోయిందని, జన్‌ధన్ యోజననుంచి, ఆధార్ ఆధారిత ప్రత్యక్ష నగదుబదిలీ సేవలవరకూ, ఆయుష్మాన్ భారత్ నుంచి గరీబ్ కల్యాణ్ అన్నయోజనవరకూ ఎన్నో కార్యక్రమాలు, పథకాలు ఈ దేశంలో దారిద్ర్యాన్ని దునుమాడి, ఆదాయసమానత్వాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషించాయంటూ ఈ కథనం విశ్లేషించింది.
- జాతీయ ప్రాంతీయ మీడియా దీనిని యథాతథంగా ప్రచురించడమే కాదు, దేశ ఆర్థిక ప్రగతి ఫలాలు ప్రజలందరికీ సమానంగా అందుతున్నాయనడానికి ఈ నివేదిక నిదర్శనమంటూ కేంద్రప్రభుత్వ మంత్రిత్వశాఖలు భుజాలు చరుచుకున్నాయి. అయితే, కేంద్రప్రభుత్వం ఈ నివేదికలోని మనదేశ వినియోగాధారిత గినీ సూచీని, ఇతరదేశాల్లోని ఆదాయ సూచీతో తప్పుడు పద్ధతుల్లో సరిపోల్చి ప్రజలను మోసం చేసిందని, ఆదాయ సమానత్వంలో మనది నాలుగు కాదు, 176వ స్థానమని కాంగ్రెస్ అప్పట్లో విమర్శించింది.
ప్రపంచస్థాయి నివేదికలను తప్పుబట్టడం, తిరస్కరించడం, లేదా తమకు అనుకూలంగా తప్పుడు విశ్లేషణలు చేయడం కాక, తగిన విధానాలతో సమస్య ను ఎదుర్కోవడం అవసరం. అతివేగంగా ఎదుగుతూ, అతిపెద్ద ఆర్థికవ్యవస్థగాఉన్న భారతదేశంలో కోట్లాదిమంది కనీస అవసరాలు తీరకపోవడం అన్యాయమే కాదు, గౌరవాన్నీ ఇవ్వదు.