Neti Satyam
Newspaper Banner
Date of Publish : 14 December 2025, 2:27 pm Editor : Admin

వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం పై చర్చ జరపాలి!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల

పరిష్కారంపై చర్చలు జరపాలి!

పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా!
నేటి సత్యం చండీఘర్, డిసెంబర్ 14:

వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్లతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా అభిప్రాయ పడ్డారు. వార్తా పత్రికలు, న్యూస్ ఏజెన్సీల ఉద్యోగసంఘాల కాన్ఫెడరేషన్ రెండురోజుల వార్షిక సమావేశాలను చండీఘర్ మున్సిపల్ భవన్ లో ఆదివారం ఆయన ప్రారంభించారు. సమావేశానికి కాన్ఫెడరేషన్ అధ్యక్షుడు రాస్ బిహారీ అధ్యక్షత వహించారు. సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చిన ది ట్రిబ్యూన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రుచిక ఎం ఖన్నా వక్తలను వేదికపైకి ఆహ్వానించారు. ట్రిబ్యూన్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ గుప్తా స్వాగతం పలుకుతూ ప్రస్తుతం జర్నలిస్టులు క్లిష్టమైన పరిస్థితులని ఎదుర్కుంటున్న నేపథ్యంలో కాన్ఫెడరేషన్ వార్షిక సమావేశానికి కీలక ప్రాముఖ్యం ఉందన్నారు. కాన్ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ఎం.ఎస్.యాదవ్ మాట్లాడుతూ లేబర్ కోడ్లు అమలులోకి రావడంతో వర్కింగ్ జర్నలిస్టుల చట్టం రద్దయ్యిందనీ , దాంతో జర్నలిస్టుల వేజ్ బోర్డు ఉనికిలో లేకుండా పోయిందని అన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని పునరుద్ధరించాలని అందుకు గవర్నర్ తమ పలుకుబడిని వినియోగించాలని కోరారు. సమావేశాలను ప్రారంభించిన పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా మాట్లాడుతూ ప్రజాస్వామ్య మనుగడలో మీడియా పాత్ర కీలకమైనదని కటారియా అన్నారు. స్వాతంత్రోద్యమ కాలంలో పత్రికలు కీలక భూమిక పోషించాయని ఆయన ప్రశంసించారు. వ్యవస్థలో లోపాలను ప్రశ్నించేటట్లు పౌరులను జాగృతం చేయాల్సిన బాధ్యత పాత్రికేయులపై ఉందని గవర్నర్ అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం, హక్కుల కోసం పోరాడటంతో పాటు , ప్రజాహితం కోసం కృషి చేయాలని జర్నలిస్టులకు ఆయన సూచించారు. ప్రకృతి విపత్తులు, ఆపరేషన్ సింధూర్ లాంటి సందర్భాల్లో పంజాబ్ ట్రిబ్యూన్ ఎంప్లాయీస్ యూనియన్ చేపట్టిన సహాయ కార్యక్రమాలు శ్లాఘనీయమని గవర్నర్ అన్నారు.
ప్రజాస్వామ్యంలో అన్నివర్గాల సమస్యలను వినాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని గవర్నర్ అన్నారు. వివిధవర్గాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యంలో కీలకభూమిక పోషిస్తున్న మీడియా సిబ్బంది సమస్యలపై కూడా దృష్టి సారించాలని కోరారు. లేబర్ కోడ్ ల అమలుపై కాన్ఫెడరేషన్ నేతలు లేవనెత్తిన సమస్యను ప్రస్తావిస్తూ వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను సంబంధిత బాధ్యుల దృష్టికి తీసుకు వెళ్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. ఈ విషయంలో యూనియన్ల అభిప్రాయాలతో పాటు సంబంధిత అన్నివర్గాల అభిప్రాయాలు వినాలని, అన్ని వర్గాలతో చర్చలు జరపాలని, చర్చలద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం తనకు ఉందని గవర్నర్ గులాబ్ చంద్ కటారియా అన్నారు.
ఐ.జే.యూ. అధ్యక్షుడు కే.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షుడు మాట్లాడుతూ లేబర్ కోడ్లను రూపొందించే క్రమంలో బ్రిటిష్ పాలనా కాలం నాటి చట్టాలను మారిన పరిస్థితులకు అనుగుణంగా మారుస్తున్నామని ప్రభుత్వం చెప్పిందని, అయితే అందులో ఎంతమాత్రమూ వాస్తవం లేదని అన్నారు.
స్వాతంత్ర్యానంతరం మొదటి ప్రెస్ కమిషన్ సిఫార్సు మేరకే వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని మన పార్లమెంటు చేసిందని , ఆ చట్టం ద్వారానే వర్కింగ్ జర్నలిస్ట్ లకు పలు హక్కులు, సదుపాయాలు వచ్చాయని గుర్తు చేశారు. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా పోరాటాన్ని కొనసాగించాలని పిలుపు ఇచ్చారు.
సమావేశంలో ఐజేయు సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ, జాతీయ కార్యదర్శులు డి. సోమసుందర్, వై. నరేందర్ రెడ్డి,
డి.ఎస్.ఆర్. సుభాష్ సహా పదిహేను మంది ప్రతినిధుల బృందం ఐ.జే.యు. నుండి పాల్గొన్నది. కాన్ఫెడరేషన్ లో భాగస్వాములుగా ఉన్న ఎనిమిది జాతీయస్థాయి జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.