(adsbygoogle = window.adsbygoogle || []).push({});
జిఆర్ఎఎంజి బిల్లు వద్దు
ఉపాధి హామీ చట్టమే బెస్ట్!
తోట జీవన్న జిల్లాకార్యదర్శి
సిపిఐ (ఎమ్ ఎల్) రెడ్ స్టార్
డిమాండ్!
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్ఆర్ఇజిఎ) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్) బిల్లు, 2025 (విబి-జిఆర్ఎఎంజి)ను సిపిఐ (ఎమ్ ఎల్) రెడ్ స్టార్ గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జిల్లా కార్యదర్శి తోట జీవన్న ఒక ప్రకటన లో తెలిపారు,
పార్వతీపురం జిల్లా కేంద్రం లో ఉన్న కార్యాలయం లో జరిగిన పత్రికా సమావేశములో మాట్లాడుతూ,
పని చేసే హక్కును కల్పించాలన్న సార్వత్రిక డిమాండ్ ఆధారిత చట్టమైన ఎంఎన్ఆర్ఇజిఎ మౌలిక స్వభావం ఈ ప్రతిపాదిత బిల్లులో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని విమర్శించారు. ఈ బిల్లు, డిమాండ్‌కు తగినట్లుగా నిధులను కేటాయించాల్సిన బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వాన్ని చట్టపరంగా తప్పించేస్తోందని, హామీతో కూడిన ఉపాధిని 100 నుండి 125రోజులకు పెంచుతామన్న ప్రభుత్వ వాదన కేవలం పై మెరుగు చర్య మాత్రమేనని పేర్కొన్నారు. వాస్తవానికి, ఉపాధి కార్డులను హేతుబద్ధీకరిస్తున్నామన్న పేరుతో పెద్ద సంఖ్యలో గ్రామీణ కుటుంబాలను మినహాయించడానికి ఈ బిల్లు ద్వారాలు తెరుస్తోంది. వ్యవసాయ పనులు ఉధృతంగా వున్న సమయంలో 60 రోజుల వరకు ఉపాధిని సస్పెండ్ చేసేందుకు ప్రభుత్వాలను అనుమతిస్తున్న నిబంధన వల్ల అత్యంత అవసరమైన కాలంలో గ్రామీణ కుటుంబాలకు పనులను నిరాకరిస్తూ, వారు భూస్వాములపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తుతుందని అన్నారు.
పని ప్రదేశాల్లో డిజిటల్ హాజరును తప్పనిసరి చేయడం వల్ల పని నష్టం, వారి హక్కులు తిరస్కరించడం వంటి అనేక ఇబ్బందులు కార్మికులకు తలెత్తుతున్నాయి. నిధులను అందచేసే విధానంలో ప్రతిపాదిత మార్పును తీసుకురావడం ప్రధానంగా ఆందోళన కలిగిస్తోంది. వేతనాల చెల్లింపుల విషయంలో ప్రధాన రాష్ట్రాలతో 60:40 నిష్పత్తిలో పంచుకోవాలన్న ఏర్పాటును తీసుకురావడం ద్వారా ఈ బిల్లు కేంద్రం బాధ్యతను తగ్గిస్తోందని అన్నారు. నిరుద్యోగ భృతిని, అలాగే రాష్ట్రాలకు ఆలస్యమైనందుకు నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యతను రాష్ట్రాలకు బదిలీ చేస్తోందని. దీనివల్ల నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి పాత్ర ఇవ్వకపోగా వాటిపై అసాధారణమైన ఆర్థిక భారాన్ని మోపుతోందని అన్నారు.
కేంద్రం రాష్ట్రాల వారీగా వ్యయ పరిమితులను విధిస్తూ ‘ప్రామాణిక కేటాయింపు’ ను ప్రవేశపెట్టడం, అదనపు వ్యయాలను రాష్రాలే భరించాల్సి రావడం వల్ల ఈ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళే అవకాశాలు బాగా కుదించబడతాయని, పైగా కేంద్ర జవాబుదారీతనం కూడా నీరు గారుతుందని అన్నారు.
పైగా ఈ పథకానికి ఎంఎన్ఆర్ఇజిఎగా వున్న పేరును జి ఆర్ఎఎం జి (జి రామ్ జి)గా మార్చాలన్న నీచపు ఆలోచన వెనుక బిజెపి-ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక ధోరణి ప్రతిబింబిస్తోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో విబి-జిఆర్ఎఎంజి బిల్లును తక్షణమే ఉపసంహరించాలని సిపిఐ (ఎమ్ ఎల్) డిమాండ్ చేస్తోంది. దీనికి బదులుగా ఎంజిఎన్ఆర్ఇజిఎను బలోపేతం చేసేందుకు రాజకీయ పార్టీలతో, కార్మిక సంఘాలతో, గ్రామీణ పేదల సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని, సార్వజనీన, హక్కుల ప్రాతిపదిక ఉపాధి హామీగా సమర్ధవంతంగా దీన్ని అమలు చేసేలా చూడాలని (సిపిఐ ఎమ్ ఎల్) రెడ్ స్టార్ కోరుతోందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు గరుగుబిల్లి సూరయ్య, బొత్స మోహన్ రావు, బి. రామ్మూర్తి, మోహన్ రావు, సీతమ్మ, చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు,