Neti Satyam
Newspaper Banner
Date of Publish : 20 December 2025, 1:40 pm Editor : Admin

ఎరుపు ఎక్కిన. హైదరాబాద్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

“వందేళ్ల సిపిఐ త్యాగాల, విజయాల స్ఫూర్తి సభ”

నేటి సత్యం హైదరాబాద్ డిసెంబర్ 20
మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ, ఆర్థిక, రాజకీయ అరాచకాలకు పాల్పడుతున్న కేంద్రంలోని బిజెపిని గద్దె దించేందుకు వామపక్షాలు, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులన్నీ ఏకమై పోరాటం చేయాలని, అప్పుడే మోది ప్రభుత్వాన్ని గద్దె దించవచ్చని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి అన్నారు. బిజెపి ప్రభుత్వం కొనసాగితే భవిష్యత్తులో కార్మిక, రైతు, యువజన, వ్యతిరేక చర్యలు మరింత ఉధృతమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్య ఉద్యమాలు అవసరమైనప్పటికీ ఎర్ర జెండాలన్నీ ఏకమై ఒకే గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే, ప్రజలు కమ్యూనిస్టులను ఒక ప్రత్యామ్నాయంగా చూస్తారన్నారు. భారత కమ్యూనిస్టు నాయకుల పేర్లను, చరిత్రను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం హైజాక్ చేస్తోందన్నారు. సిపిఐ వందేళ్ల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్, నారాయణగూడలోని మార్వేల్ ఫంక్షన్ సిపిఐ హైదరాబాద్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శనివారం “వందేళ్ల సిపిఐ త్యాగాల, విజయాల స్ఫూర్తి సభ” జరిగింది. అంతకుముందు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సిపిఐ జెండాను పల్లా వెంకట రెడ్డి ఆవిష్కరించి అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పల్లా వెంకట రెడ్డి ప్రసంగిస్తూ భారత స్వాతంత్య్ర, భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం సందర్భంగా జరిగిన పోరాటాల్లో భారత కమ్యూనిస్టు పార్టీకి ఘనణీయమైన చరిత్ర ఉన్నదని, కమ్యూనిస్టు పార్టీ లేకపోతే తమకు ఎదురు ఉండదనే ఉద్దేశంతోనే మోదీ ప్రభుత్వం పోరాట, ఉద్యమ చరిత్రను వక్రీకరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చెందిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ బిజెపి గొప్పగా చెప్పుకుంటుందని, వల్లభాయ్ వల్లనే హైదరాబాద్ విలీనమైందని చరిత్రను వక్రీకరిస్తోందని విమర్శించారు. ఎటువంటి పోరాటంతో వల్లభాయ పటేల్ హైదరాబాద్ విలీనం చేశారని?, నిజాం బేషరతుగా హైదారాబాద్ విలీనం చేయలేదని, ఆయనకు రాజ్ ఇస్తామని కేంద్రం ఒప్పందం చేసుకున్నదని పల్లా వెంకట రెడ్డి వివరించారు. మఖ్ధూం మొహియుద్దీన్, బద్దంఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని, అప్పటికే పది లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టులు ప్రజలకు పంపిణీ చేశారని, దీంతో హైదరాబాద్ కమ్యూనిస్టుల వశమౌతుందనే భయంతోనే హైదరాబాద్ విలీనానికి ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో బిజెపి పాత్రనే లేదని, భారత కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధిస్తే, కమ్యూనిస్టు నాయకులు నాటి కాంగ్రెస్ సంస్థలో (అప్పటికి రాజకీయ పార్టీ కాదు) చేరి ఉద్య మించారని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ సంస్థను రాజకీయ పార్టీగా ఏర్పాటు చేసుకున్నారని వివరించారు. భారత కమ్యూనిస్టు నాయకులు సంపూర్ణ స్వాతంత్య్రం కోసం పిలుపునిచ్చారని, ఆ తర్వాతే కాంగ్రెస్ నాయకులు సంపూర్ణ స్వాతంత్య్రం నినాదాన్ని ఎంచుకున్నారన్నారు. భారతదేశ పోరాట చరిత్రను బిజెపి, కాంగ్రెస్ వక్రీకరిస్తోందని మండిపడ్డారు. భారత స్వాతంత్య్ర పోరాటం నుంచి ఆ తర్వాత ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, విద్య, ఉద్యోగ, ఉపాధి, గృహ సమస్యలపై విరోచిత పోరాటం చేసిందని, ఫలితంగా అనేక చట్టాలను, హక్కులను సాధించిందని, అందుకే కమ్యూనిస్టు పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ వంద సంవత్సరాలుగా ప్రజల పక్షాన నిలబడుతున్నదన్నారు. దామాషా పద్ధతిన ఎన్నికలను నిర్వహించాలని, అలా చేస్తే కమ్యూనిస్టులకు రావాల్సిన ప్రాతినిధ్యం దక్కుతుందన్నారు. కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగా నాటి ప్రధాని జవరహర్ బ్యాంకులను జాతీయకరణ చేశారని, ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశారని, కానీ మోదీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తోందని, కార్పొరేట్ల రుణాలను మాఫీ చేస్తున్న కేంద్రం, వ్యవసాయ కార్మికుల రుణాలను ఎందుకు మాఫీ చేయడం లేదని నిలదీశారు. జనవరి 18వ తేదీన ఖమ్మంలో జరుగబోయే సిపిఐ శతాబ్ధి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

బిజెపి, ఎంఐఎంకు పోరాట చరిత్ర లేదు : ఈ.టి.నర్సింహ
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నర్సింహ మాట్లాడుతూ భారతదేశ, హైదరాబాద్ సంస్థాన చరిత్రలో పేదలు, కార్మికులు, రైతుల తరపున పోరాటం చేసిన చరిత్ర బిజెపి, ఎంఐఎంకు లేదని విమర్శించారు. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరిగిన సాయుధ పోరాట చరిత్రను కూడా బిజెపి వక్రీకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోది అబద్దాలను ప్రచారం చేస్తే, ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఒవైసి దేశం మొత్తం తిరిగి విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో మోదీని 60 లక్షల మంది తిరస్కరించారన్నారు. హైదరాబాద్ కమ్యూనిస్టు పార్టీకి వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు లేకపోయినప్పటికీ పేదలకు భూమి పంపిణీ చేపట్టిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో సిపిఐ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందన్నారు. మతోన్మాద బిజెపి, ఎంఐఎం గుట్టు రట్టయితే ప్రజలే ఆ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం, ప్రజలకు ఉచిత వైద్యం, నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కమ్యూనిస్టు నాయకులు పోరాటం చేశారని ఈ.టి.నర్సింహ తెలిపారు.
సభకు సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్ అధ్యక్షత వహించగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్.బోస్, కార్యవర్గ సభ్యులు ఎస్.చాయాదేవి, ఎ.రవీంద్ర చారి, సిపిఐ సీనియర్ నాయకులు డాక్టర్ బి.వి.విజయలక్ష్మి, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం, శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర కార్యదర్శి పి.ప్రేమ్ పావని, ఎన్ రాష్ట్ర కార్యదర్శి నేదునూరి జ్యోతి, నాయకురాలు ఆరుట్ల సుశీల, సిపిఐ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి ఇ.ఉమామహేశ్, సిపిఐ హైదరాబాద్ సహాయ కార్యదర్శి కమతం యాదగిరి, తెలంగాణ ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహ, ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎం.నరసింహ, జి.చంద్రమోహన్ గౌడ్, ముత్యాల యాదిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు నేర్లకంటి శ్రీకాంత్, సిపిఐ నాయకులు పడాల నళిని తదితరులు పాల్గొన్నారు. కాగా సభ అనంతరం మహిళా నాయకులను పల్లా వెంకట రెడ్డి, ఈ.టి.నర్సింహ తదితరులు సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు.
భారీ ప్రదర్శన
సిపిఐ వందేళ్ల ఉత్సవాల సందర్భంగా హిమాయత్ ఎఐటియుసి రాష్ట్ర కార్యాలయం సత్యనారాయణ రెడ్డి భవన్ నుంచి నారాయణగూడలోని మార్వేల్ ఫంక్షన్ హాల్ వరకు సిపిఐ హైదరాబాద్ కౌన్సిల్ ఆధ్వర్వంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎర్ర దుస్తులను ధరించి, ఎర్ర జెండాలను చేతబూని సిపిఐ శ్రేణులు కదం తొక్కారు. తలపై గొడుకు, కోలాటాలతో చిన్న పిల్లలు చేసిన ప్రదర్శన పలువురిని ఆకట్టుకున్నది.