#CPIMAP ‘ఉపాధి హామీ’ కోసం దేశవ్యాప్త ఉద్యమం
సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు
కొత్తగా తీసుకొచ్చిన జీరాంజీ బిల్లు వల్ల పేదలకు ఎటువంటి ఉపయోగమూ లేదని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ చట్టాన్ని కొనసాగించాలని, దీనికోసం దేశవ్యాప్త ఆందోళన చేపడతామని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో కలిసి ఆయన మాట్లాడారు. గతంలో ఉన్న ఉపాధిహామీ చట్టాన్ని రద్దుచేసి కొత్తగా జీరాంజీ పథకాన్ని తీసుకొచ్చారని, దీనిలో కార్మికులకుగానీ, రాష్ట్రాలకుగానీ ఎటువంటి హక్కులూ లేవని, ఉన్నవి కూడా పాక్షికంగానే ఉన్నాయని తెలిపారు. గతంలో కనీసం 100 రోజులు పని పేరుతో 50 రోజులన్నా కార్మికులకు ఉపాధి లభించేదని, ఇప్పుడు కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఉండేలా చేశారని తెలిపారు. ఉపాధి హామీ పథకం వ్యవసాయ పనులకు ఆటంకమని చెబుతున్నారని, అలాంటిదేమీ లేదని అనేక నివేదికలు, పరిశోధనలు బయటపెట్టాయని తెలిపారు. కూలీరేట్లు పెరిగాయని చెబుతున్నారని, ఆచరణలో కూలీరేట్లు, వేతనాలు తగ్గాయని పేర్కొన్నారు. గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికుల శ్రమను కార్పొరేట్లు దోచుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని విమర్శించారు. పథకంలో నిధులు గతంలో కేంద్రానికి 90 శాతం రాష్ట్రానికి 10 శాతం వాటా ఉండేదని, ప్రస్తుతం 60:40గా మార్చారని తెలిపారు. ఆకలిచావులు, వలసలు నివారించేందుకు ఉపయోగపడిన ఈ చట్టాన్ని రద్దు చేయడం వల్ల మరలా ఆకలిచావులు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పైగా దీనికి నిధుల కేటాయింపు డిమాండును బట్టి కాకుండా రాజకీయ అవసరాలకు తగిన విధంగా కేటాయించేలా నిబంధనలు రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేంద్రం ముందుగానే నిధులు ఇచ్చేదని, ఇప్పుడు పనిచేసిన తరువాత ఇచ్చేలా పథకాన్ని రూపొందించారని తెలిపారు. ఉపాధి కల్పనలో ఆలస్యమయితే గతంలో కేంద్రమే పెనాల్టీ చెల్లించేదని, ఇప్పుడు ఆ బాధ్యతను రాష్ట్రం మీదకు నెట్టేశారని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపి మాట్లాడటం లేదని, ప్రతిపక్షంలో ఉన్న వైసిపి కూడా గట్టిగా ప్రశ్నించడం లేదని అన్నారు. సెలక్టు కమిటీకి పంపించాలని చెప్పి వైసిపి చేతులు ముడుచుకు కూర్చుందన్నారు. రెండు పార్టీలూ మోడీని చూసి భయపడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలు మోడీతో అనుసరిస్తున్న తీరువల్ల రాష్ట్రానికి తీవ్రనష్టం వాటిల్లుతుందని అన్నారు.