(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం నాడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిందెవరు? నేడు అనాలోచితంగా కీర్తించబడుతున్నదెవరు?
భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యాన్ని సాధించింది. అది కోట్లాది మంది స్వాతంత్ర్య సమరయోధులు చేసిన దశాబ్దాల త్యాగపోరాట ఫలితం. ఈ పోరాటానికి నాయకత్వం వహించినవారు జాతిపిత మహాత్మా గాంధీ.
మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి 1924 డిసెంబర్ 25న జన్మించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఆయన వయస్సు 22 సంవత్సరాలు మాత్రమే.
క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం వంటి ఏ ప్రధాన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాల్లోనూ ఆయన పాల్గొన్నట్లు ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు.
అయినా నేడు దేశమంతటా వాజ్ పేయి విగ్రహాల ఏర్పాటు చేయటం, రహదారులు, పలు సంస్థలు, ప్రజా స్థలాలు, పథకాల పేర్లలో మార్పులు చేయడం వంటి చర్యలను మనం చూస్తున్నాం.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నాయకులుగా చలామణి అయిన వారిని స్వాతంత్ర్య సమరయోధులుగా చిత్రీకరించే దుస్థితి దాపురించింది. అంతేకాకుండా మహాత్మా గాంధీ పేరును సంక్షేమ పథకాల నుంచి కుట్రపూరితంగా తొలగించడం; అహింస, లౌకికత్వం, సామాజిక న్యాయం వంటి గాంధీయ విలువలను బలహీనపరుస్తూ, స్వాతంత్ర్య పోరాటానికి దూరంగా ఉన్న, ఆ పోరాటాన్ని వ్యతిరేకించిన శక్తులు నేడు తమకు అనుకూలంగా చరిత్రను వక్రీకరిస్తూ తిరగరాయడం దురదృష్టకరం. ఇది భారతదేశ ప్రతిష్టకు అవమానం.
భారత దేశానికి స్వాతంత్ర్యం ఎవరు దానం చేయలేదు. అనేక ప్రాణత్యాగాలతో సాధించబడింది. ప్రస్తుత రాజకీయ భావజాలాలకు అనుగుణంగా గత చరిత్రను మార్చాలనుకోవటం అవివేకం. మహాత్మ గాంధీని కేవలం విగ్రహాలకు మాత్రమే పరిమితం చేసి, ఆయన ఆలోచనలను ఆచరణలో లేకుండా చూడాలన్నదే నేటి పాలకుల అనాలోచిత విధానంగా గోచరిస్తున్నది. నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి దుర్మార్గపూరిత కుట్ర భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది.
స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించిన గాంధీని పక్కన పెట్టి, స్వాతంత్ర ఉద్యమంలో కనీసం ఎటువంటి పాత్రలేని వారిని కీర్తింప చేసినట్లయితే దేశం తన నైతిక విలువలను, ప్రజాస్వామ్య పునాదులను కోల్పోయి ప్రమాదంలో పడుతుందనేది వాస్తవం.
భారత స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన నిజమైన చరిత్ర పరిరక్షించబడాలని; పాలనలో, విద్యలో, ప్రజా సంక్షేమ పథకాలలో మహాత్మా గాంధీకి సముచిత స్థానం కల్పించాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నది. కేంద్ర పాలకులు తాము అనుసరిస్తున్న అనాలోచిత విధానాలకు ఇకనైనా స్వస్తిపలకాలని సిపిఐ హితవు పలుకుతున్నది