చైనా మాంజా విక్రయించినా వినియోగించినా జైలు శిక్ష తప్పనిసరి
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్
నేటి సత్యం డిసెంబర్ 29 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కోమిరే యాకయ్య మహబూబాబాద్ జిల్లా పరిధిలో నిషేధిత చైనా మాంజా విక్రయం, వినియోగం పై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డా. శబరీష్ స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో గాలిపటాల ఎగరవేతకు యువత సిద్ధమవుతున్న తరుణంలో, ప్రమాదకరమైన చైనా మాంజా వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చైనా మాంజా (సింథటిక్ దారం, గాజు పొడి కలిపిన దారం) వినియోగం వల్ల పక్షుల మెడలు, రెక్కలు కోసుకుపోవడం, ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా గాయపడటం, ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని ఎస్పీ తెలిపారు. ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పుగా మారిన ఈ మాంజాను ఎవరైనా విక్రయించినా లేదా వినియోగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చైనా మాంజా విక్రయం లేదా వినియోగంలో పాల్గొన్నవారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని, ఇది చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. నిషేధిత మాంజా నిల్వలు, విక్రయాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రజలు చైనా మాంజాను పూర్తిగా నివారించి, ప్రభుత్వ అనుమతితో ఉన్న కాటన్ దారాలతో మాత్రమే గాలిపటాలు ఎగరవేయాలని సూచించారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తున్నట్లు లేదా వినియోగిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు.