*అశ్వాపురం బూర్గంపహాడ్ ఇంజినీరింగ్ కాలేజీ బస్సు అదుపతప్పి బోల్తాపడిన ఘటన*
*నేటి సత్యం జనవరి 2* బూర్గంపాడు మండల పరిధిలోని కృష్ణసాగర్ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుంచి పాల్వంచ వైపు వెళ్తున్న కేఎల్ఆర్ కేఎల్ఆర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ అటవీ ప్రాంతానికి చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోయిన కారణంగా ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 60 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. విద్యార్థులను చూసి ప్రత్యక్ష సాక్షులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ఆ దారిలో వెళ్తున్న ప్రయాణికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను అత్యవసర వాహనాల్లో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
*తల్లిదండ్రుల ఆవేదన*.. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో ఆసుపత్రికి పరుగులు తీశారు. తమ పిల్లలు క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. విద్యాసంస్థల బస్సులు వరుస ప్రమాదాలకు గురికావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.