Neti Satyam
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 1:10 pm Editor : Admin

రైతుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*హెచ్ఎండిఏ పరిధిలో రైతుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం*

కోహెడ: 7 జనవరి: నేటి సత్యం ప్రతినిధి యాకన్న:

తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడ గ్రామంలో ప్రస్తుతం ‘కన్జర్వేషన్’ (పరిరక్షణ) జోన్‌లో ఉన్న భూముల వినియోగ స్థితిని వెంటనే మార్చాలని పలువురు భూయజమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ , భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ భూములను మల్టీపర్పస్ యూజ్ జోన్ పరిధిలోకి తీసుకురావాలని అఖిలపక్ష నాయకులు గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.నగరం శరవేగంగా విస్తరిస్తున్నప్పటికీ, మున్సిపాలిటీలోనీ పరిధిలోని పలు ప్రాంతాల్లో వేలాది ఎకరాల భూములు కన్జర్వేషన్ జోన్ కింద ఉండటం వల్ల దశాబ్దాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జోన్ నిబంధనల కారణంగా యజమానులు తమ సొంత స్థలాల్లో కనీస నిర్మాణాలు కూడా చేపట్టలేకపోతున్నారని, దీంతో తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత మాస్టర్ ప్లాన్ ప్రకారం కన్జర్వేషన్ జోన్‌లో ఉన్న భూములలో వ్యవసాయం లేదా పచ్చదనం పెంపు వంటి పరిమిత కార్యకలాపాలకు మాత్రమే అనుమతి ఉంది. అయితే, నగర జనాభా పెరుగుదల, మౌలిక సదుపాయాల అవసరాల దృష్ట్యా ఈ నిబంధనలు సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడ్డారు.

ఈ భూములను వెంటనే మల్టీపర్పస్ జోన్‌గా మార్చడం ద్వారా నివాస గృహాలు, వాణిజ్య సముదాయాలు, ఇతర అవసరమైన నిర్మాణాలకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. ఇది ఆయా ప్రాంతాల అభివృద్ధికి దోహదపడటమే కాకుండా, స్థానికులకు ఆర్థికంగా కూడా ఉపయోగపడుతుందని వారు స్పష్టం చేశారు.ప్రభుత్వం, మున్సిపల్ పరిపాలన,పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కోరారు. మాస్టర్ ప్లాన్‌లో అవసరమైన సవరణలు చేసి, కన్జర్వేషన్ భూములను మల్టీపర్పస్ జోన్‌లోకి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.కోహెడ పరిధిలో ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన రైతులకు తక్షణమే న్యాయబద్ధమైన నష్టపరిహారం చెల్లించాలని, లేనిపక్షంలో ప్రత్యామ్నాయంగా ప్రతి నిర్వాసిత కుటుంబానికి 500 గజాల అభివృద్ధి చేసిన ప్లాట్ (భూమి) కేటాయించాలని బాధిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం కోహెడ పరిసర ప్రాంతాల్లో రైతుల నుండి భారీగా భూసేకరణ జరిపింది. అయితే, తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వానికి అప్పగించి ఏళ్లు గడుస్తున్నా, తమకు ఇప్పటికీ సరైన పరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విలువైన భూములు కోల్పోయి తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.ప్రస్తుతం పెరిగిన భూముల ధరలు, మార్కెట్ విలువను దృష్టిలో ఉంచుకుని, తమకు రావాల్సిన నష్టపరిహారాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే చెల్లించాలి. భూమి కోల్పోయిన ప్రతి రైతుకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో 500 గజాల )నివాస యోగ్యమైన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిించి తమ సమస్యను పరిష్కరించకపోతే, తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని కోహెడ రైతులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో

డాక్టర్ ఎస్ మల్లారెడ్డి,కొత్త రామ్ రెడ్డి,

కళ్లెం బాల్ రెడ్డి ,ఎలిమినేటి నరసింహ రెడ్డి, కొలన్ రవీందర్ రెడ్డి, కందాల బల్దేవ్ రెడ్డి, బిందు రంగారెడ్డి, సురేష్ నందగిరి.

తదితరులు పాల్గొన్నారు