(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*సిపిఐ వందేళ్ల ఉత్సవాల ముగింపు సభకు లక్షలాదిగా తరలిరండి విజయవంతం చేయండి కూనంనేని*
నేటి సత్యం హైదరాబాద్ జనవరి 10 భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) వందేళ్ల ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 18న ఖమ్మంలోని ఎస్ ఆర్ బి జి ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్ మధ్యాహ్నాం 3 గంటలకు లక్షలాది మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఎ కూనంనేని సాంబశివ రావు చెప్పారు. ఈ సభకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు వామపక్ష పార్టీల అగ్ర నాయకులు, సుమారు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారని వివరించారు. భారతదేశంలో కమ్యూనిజం ఎక్కడ ఉన్నదనే వారికి ‘సిపిఐ ఖమ్మం బహిరంగ సభ’ ఒక రుజువుగా నిలువనుందన్నారు. సిపిఐ వందేళ్ల ఉత్సవాల నేపథ్యంలో సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి, జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్యపద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నర్సింహ, ఎంఎల్ఏ నెల్లికంటి సత్యంతో కలిసి హైదరాబాద్ జర్నలిస్టులతో శనివారం కూనంనేని సాంబశివరావు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఖమ్మం బహిరంగ సభకు ఎపి, కేరళ, తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరానున్నారని, ప్రజలు స్వచ్ఛందంగా రవాణ సౌకర్యాన్ని కల్పించుకుని వస్తున్నారని ఆయన తెలిపారు. బహిరంగ సభకు ముందు పదివేల మందితో ‘జనసేవాదళ్ కవాతు’ను నిర్వహించనున్నామని, ఆ తర్వాత సభ జరుగుతుందని తెలిపారు. మరుసటి రోజు 19వ తేదీన జాతీయ సదస్సును నిర్వహిస్తామని, అలాగే ఈనెల 19, 20,21న సిపిఐ జాతీయ కార్యదర్శివర్గం, కార్యవర్గ, సమితి సమావేశాలను నిర్వహించనున్నట్టు కూనంనేని వివరించారు.
కమ్యూనిస్టు సిద్ధాంతానికి భిన్నంగా కాకుండా మారుతున్న కొత్త పద్ధతులు, వివిధ దేశాల పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ శ్రీలంక, నేపాల్ ఇలా పలు దేశాలలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చాయని, చిన్నపాటి సమస్యలు వచ్చినా పరిష్కరించుకూంటూ ఐక్యంగా ముందుకు వెళ్తున్నారని ఆయన వివరించారు. భారతదేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పరిస్థితులు, కగార్ ఆపరేషన్, కార్మిక హక్కులను కాలరాస్తూ తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ ఇలాంటి సందర్భంలో కమ్యూనిస్టు పార్టీలన్నీ కలిస్తే బాగుటుందని అందరూ కోరుకుంటున్నారని, కమ్యూనిస్టు పార్టీలలో ఐక్యత రావాలని చాలా మంది చెబుతున్నారని కూనంనేని సాంబశివ రావు తెలిపారు.
ఇప్పటికీ ప్రజలు కమ్యూనిస్టులనే గుర్తు చేసుకుంటారు : పల్లా వెంకట రెడ్డి పల్లా వెంకట రెడ్డి మాట్లాడుతూ సిపిఐ 99వ సంవత్సరం నుంచి వందేళ్లు పూర్తి చేసుకునే ఒక సంవత్సరం వరకు ఏడాది పొడవునా సిపిఐ వందేళ్ల ఉత్సవాలు నిర్వహించుకున్నామని వివరించారు. సమస్యల పరిష్కారాన్ని కోరుకున్నప్పుడు ప్రజలు కమ్యూనిస్టులను గుర్తు చేసుకుంటున్నారని, తాము నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఖమ్మం సభకు ప్రజలు స్వచ్ఛందంగా హాజరుకానున్నారని తెలిపారు.
వందేళ్లలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాం…మౌలిక అంశాలను సాధించాం : డాక్టర్ నారాయణ
డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలు వందేళ్ల కాలంలో ఏం సాధించారని కొందరు హేళన చేస్తున్నారని, వందేళ్ల కాలంలో తాము అధికారంలోకి రాకపోయినప్పటికీ భారతదేశ సమైక్యతకు విఘాతం కలగకుండా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, మౌలిక అంశాలను నిలబెట్టామని స్పష్టం చేశారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో సంపూర్ణ స్వాంత్య్రం ప్రతిపాదన చేసింది భారత కమ్యూనిస్టు పార్టీయే అని, దున్నేవాడికి భూమి, పేదలకు భూమిపై హక్కు, తెలంగాణ సాయుధ పోరాటం ఇలా అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించిందని నారాయణ గుర్తు చేశారు. తమ దేహం ముక్కలైనా దేశాన్ని ముక్కలుగా కానివ్వబోమని నినదించిందే కమ్యూనిస్టు పార్టీ అని చెప్పారు. భవిష్యత్తు ప్రజలదేనని, కమ్యూనిస్టు పార్టీదేనని అన్నారు.