(adsbygoogle = window.adsbygoogle || []).push({});
‘ప్రపంచ కావ్యానికి ప్రతిపదార్థం లెనిన్’
నేటి సత్యం
(ఆకాశమంత విశాలమైన, సముద్రమంత లోతైన ఆ మహా వ్యక్తిత్వం గురించి ఎనిమిది వందల పదాల్లో, వెయ్యి పదాల్లో రాయడం ఎంత సారహీనమైన పని!! కాని శతవర్ధంతి సందర్భంగా ఆ మహా వ్యక్తిత్వం గురించి ఆంధ్ర జ్యోతికి నేను రాసిన వ్యాసం చూడండి.)
*లెనిన్ గా సుప్రసిద్ధుడైన వ్లదీమిర్ ఇల్యీచ్ ఉల్యానొవ్ భౌతికంగా మరణించి ఈ 21కి 102 సంవత్సరాలు నిండుతాయి*. యాబై నాలుగు సంవత్సరాలు నిండకుండానే మరణించినా, అందులో ముప్పై అయిదేళ్లకు మించని ప్రజా జీవితంలో చేసిన పనులు, సాధించిన విజయాలు, ప్రపంచానికి చూపిన ఆదర్శాలు ఆయనకు అనితర సాధ్యమైన మరణానంతర జీవితాన్ని ఇచ్చాయి. ఒక మనిషిని మరొక మనిషీ, ఒక జాతిని మరొక జాతీ పీడించడానికి వీలులేని ఒక సమతా సుందర స్వప్నాన్ని మానవజాతి వందల ఏళ్లుగా, వేల ఏళ్లుగా కంటున్నదేమో గాని, మానవ చరిత్రలో ఆ స్వప్నాన్ని సాకారం చేసిన ఘనత లెనిన్ దే. చుట్టుముట్టిన భయానక అవరోధాల మధ్య, ప్రతీపశక్తుల సవాళ్లను ఎదుర్కొంటూ ఆ స్వప్నం నిలదొక్కుకోవడానికి మార్గం సుగమం చేసిన శక్తీ లెనిన్ దే.
లెనిన్ జీవితమంతా, వ్యక్తిగత స్థాయిలోనూ, నిర్వహించిన ఉద్యమాల స్థాయిలోనూ, మొత్తంగా ఎదుర్కొన్న వ్యవస్థ స్థాయిలోనూ కంటకావృత మార్గంలోనే నడిచింది. కష్టం మీద కష్టం కష్టం తోసుకొచ్చాయి. ఆ కష్టభరిత జీవితంలోనే ఆయన విజయ సాఫల్యం వైపు పురోగమించాడు. ప్రకృతినీ, రాజ్యాన్నీ, లోపలి ప్రత్యర్థులనూ, బైటి ప్రత్యర్థులనూ అధిగమిస్తూ, ఓడిస్తూ, గేలి చేస్తూ విజయం మీద విజయం మీద విజయం సాధించాడు. బహుశా ఆ ఒత్తిడే ఆయన జీవితాన్ని అర్ధాంతరంగా 54 ఏళ్లకే ముగించి ఉంటుంది. కాని ఆ స్వల్ప జీవిత కాలంలోనే ఆయన చేసిన అధ్యయనం, రాసిన రచనలు, ఉపన్యాసంలో, రచనలో ఎదుటివారిని మెప్పించే వాదనా పటిమ, నాయకత్వం వహించిన ఉద్యమాలు, అనుభవించిన నిర్బంధాలూ ప్రవాసాలూ, తప్పించుకున్న హత్యా ప్రయత్నాలూ, స్థాపించిన మొట్టమొదటి కార్మిక కర్షక రాజ్యం, నిర్వహించిన కార్మికవర్గ సోషలిస్టు సమాజ నిర్మాణం, సమయ సందర్భాలకు తగినట్టు వ్యూహాలను మార్చిన చాతుర్యం, తన స్థల కాలాలకు మాత్రమే కాదు, ప్రపంచమంతటికీ, సర్వకాలాలకూ ప్రాసంగికమైన ఆలోచనాచరణలు – లెనిన్ జీవితం ఒక ప్రయోగం. ఒక ఆదర్శం. రష్యన్ సామాజిక చరిత్ర లెనిన్ అనే అసాధారణ వ్యక్తిని తయారు చేస్తే, ఆ వ్యక్తి ప్రపంచ చరిత్రనే మార్చే కొత్త దారి ఏర్పరిచాడు.
‘ప్రపంచమనే పద్మంలో/ పరీమళం లెనిన్/ ప్రపంచమనే కావ్యానికి/ ప్రతి పదార్థం లెనిన్/ బ్రదుకనే చిక్కు సమస్యకు/ పరిష్కారం లెనిన్’ అని శత జయంతి సందర్భంగా శ్రీశ్రీ రాసిన కవితాపాదాలు అక్షర సత్యాలు.
1870 ఏప్రిల్ 22న వోల్గా నదీ తీరంలోని సింబీర్స్క్ నగరంలో ఇల్యా నికొలాయేవిచ్, మరీయా అలెక్సాంద్రోవ్నాల ఆరుగురు సంతానంలో మూడవవాడు వ్లదిమీర్. ప్రగతిశీల భావాలున్న తండ్రి ప్రభుత్వ పాఠశాలల తనిఖీ అధికారిగా పనిచేస్తూ, వ్లదిమీర్ కు పదహారేళ్లు ఉన్నప్పుడు మరణించాడు. తండ్రి మరణం నాటికి సేంట్ పీటర్స్ బర్గ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న ఆరేళ్లు పెద్దదైన అక్క, నాలుగేళ్లు పెద్దవాడైన అన్న మూడో జార్ కు వ్యతిరేకంగా సమీకృతమైన విప్లవ విద్యార్థి బృందంలో చేరారు. ఒక ఏడాది తర్వాత ఆ బృందం జార్ చక్రవర్తిని హత్య చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అన్న అలెక్సాంద్ర్ కు ప్రభుత్వం మరణశిక్ష విధించి ఉరి తీసింది. అక్క అన్నా ను కూడా అరెస్టు చేశారు. దానితో సింబీర్స్క్ లో పరిచయస్తులలో ఒకరిద్దరు మినహా అందరూ వెలివేసినట్టు చూడడంతో ఉండలేని స్థితి వచ్చి కుటుంబం కజాన్ కు మారింది. అప్పుడున్న స్థితిలో వ్లదిమీర్ కు ఎలాగూ సేంట్ పీటర్స్ బర్గ్ విశ్వవిద్యాలయంలో సీటు రాదు గనుక కజాన్ విశ్వవిద్యాలయంలో చేరాడు. కాని అక్కడా విద్యార్థి రాజకీయాలలో పాల్గొంటున్నాడని, విశ్వవిద్యాలయం నుంచి తొలగించి, కొకుష్కినో అనే గ్రామంలో నిరంతర పోలీసు నిఘా కింద ఉండాలని శాసించారు. అలా పదిహేడో ఏట మొదలైన నిర్బంధాలు, నిషేధాలు, ప్రవాసాలు తర్వాత ముప్పై ఏళ్లు సాగుతూనే ఉన్నాయి.
రాజకీయ కారణాల వల్ల సీటు ఇవ్వని విశ్వవిద్యాలయంలోనే ప్రైవేటు విద్యార్థిగా నాలుగు సంవత్సరాల న్యాయశాస్త్ర విద్యను ఏడాదిన్నరలో పూర్తిచేసి న్యాయవాది అయ్యాడు. సమారా నగరంలో న్యాయవాదిగా పని చేస్తూ స్థానిక రైతుల తరఫున, ప్రజల తరఫున వాదించాడు. ఆ సమయంలోనే విపరీతంగా అధ్యయనం సాగిస్తూ మార్క్సిజంలో ప్రవేశించాడు. తన ఆలోచనలను కార్యాచరణగా మార్చడానికి అప్పటి రాజధాని సేంట్ పీటర్స్ బర్గ్ చేరుకుని, కార్మికుల అధ్యయన బృందాలు ప్రారంభించాడు. అప్పుడే రచన కూడా ప్రారంభించాడు. ఇరవై మూడవ ఏట ‘రైతాంగ జీవితంలో కొత్త ఆర్థిక పరిణామాలు’ వంటి వ్యాసాలతో ప్రారంభించిన రచనాకృషి, మరణానికి ముందు యాబై మూడో ఏట తీవ్రమైన అనారోగ్యంలో డిక్టేట్ చేసిన రచనల వరకూ అసంఖ్యాకమైన వ్యాసాలు, పుస్తకాలు, కరపత్రాలు, వాదవివాదాలు, సైద్ధాంతిక రచనలు, ఉపన్యాసాలు, నివేదికలు, ప్రభుత్వ ఆదేశాలుగా విస్తరించింది. ఒక్కొక్కటి దాదాపు 650 పేజీలున్న 54 సంపుటాల (ఇంగ్లిష్ లో 45 సంపుటాలు) రచనలు – అంటే ముప్పై సంవత్సరాల్లో ముప్పై ఆరువేల పేజీలు – రచన చేశాడు.
సేంట్ పీటర్స్ బర్గ్ లో సాగించిన ఆధ్యయన, బోధన, రచన, సమీకరణ రాజకీయ కృషి వల్ల మళ్లీ ఒకసారి ఆయన మీద ప్రభుత్వం విరుచుకుపడింది. అక్కడ అయిదారేళ్ల కృషి కూడా పూర్తి కాకముందే, 1895లో, వందలాది మంది కార్మికులతో పాటు లెనిన్ ను అరెస్టు చేశారు. ఏడాదిన్నర పాటు జైలులో ఉంచి, తర్వాత మూడు సంవత్సరాలు సైబీరీయా ప్రవాసశిక్ష విధించి అక్కడికి పంపారు. ఆ ప్రవాసంలోనూ అధ్యయనం, రచన, రహస్య నిర్మాణం ఆపలేదు. అక్కడే, ‘రష్యాలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి’ వంటి కీలక రచనలు చేశాదూ. అక్కడే ప్రవాసశిక్షకు గురై ఉన్న సహకార్యకర్త నాడెజ్దా కృపస్కయాను పెళ్లి చేసుకున్నాడు. 1900లో అక్కడి నుంచి విడుదలై, ప్రభుత్వ ఆంక్షల మేరకు ప్స్కోవ్ నగరంలో ఉంటూ పార్టీ కోసం ఇస్క్రా (నిప్పురవ్వ) పత్రిక ప్రారంభించాడు. ‘నిప్పురవ్వ దావానలమవుతుంది’ అని అంతకు ముందరి శతాబ్దపు రైతాంగ పోరాట కవి ఒడోయెవ్స్కీ రాసిన మాటే లెనిన్ కు ప్రేరణ, ఆ మాటను ఆయన నిజం చేశాడు కూడా.
అయితే ఇస్క్రా రహస్య పత్రిక. రష్యాలో దాన్ని అచ్చువేసే అవకాశం లేదు. సైబీరియాలో క్షీణించిన తన ఆరోగ్యం మెరుగు పరచుకోవడానికి విదేశాలకు వెళ్లడానికి అనుమతి సంపాదించి జర్మనీలోని లీప్జిగ్ కు చేరి అక్కడ పత్రిక ప్రారంభించాడు. ఆ తర్వాతనే లెనిన్ అనే పేరుతో రాయడం మొదలుపెట్టాడు. ఇస్క్రా నాటి నుంచి వ్పెర్యోడ్, ప్రోలెతారియ్, ప్రావ్దా, ఇజ్వెస్తియా వంటి ఆయన నడిపిన, సహకరించిన, రచనలు ప్రచురించిన రహస్య, బహిరంగ పత్రికలెన్నో ఉన్నాయి.
ప్రవాసంలో జర్మనీ, ఇంగ్లండ్, బెల్జియం, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, స్వీడన్, ఫ్రాన్స్ వంటి దేశాలు తిరుగుతూ, రష్యన్ విప్లవానికి మనుషులను కూడగడుతూ, 1903లో బ్రస్సెల్స్ లో పార్టీ రెండో మహా సభ జరిపాడు. మహాసభలు జరుగుతుండగానే రష్యన్ గూఢచారుల కన్నుపడి, హఠాత్తుగా సభలను లండన్ కు మార్చి దిగ్విజయంగా కొనసాగించాడు. ఆ సభలలోనే పార్టీ బోల్షివిక్కులు (అధిక సంఖ్యాకులు), అల్పసంఖ్యాకులు (మెన్షివిక్కులు) అని రెండుగా చీలిపోయింది. రెండు సంవత్సరాల తర్వాత సేంట్ పీటర్స్ బర్గ్ లో రక్తసిక్త ఆదివారం పేరుతో కుఖ్యాతి పొందిన మహా మారణకాండతో రష్యన్ ప్రజానీకంలో, కార్మికవర్గంలో జార్ చక్రవర్తి పాలన పట్ల భ్రమలు తొలగడం, బోల్షివిక్కుల పట్ల ఆదరణ పెరిగాయి.
ఈ మధ్యలో 1905 విప్లవ వైఫల్యం, 1907 స్టోలిపిన్ భయంకర నిర్బంధ కాలం, మొదటి ప్రపంచ యుద్ధం, 1917 ఫిబ్రవరి విప్లవం వంటి అనేక పరిణామాలు సంభవించాయి. 1917 ఫిబ్రవరిలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం మీద తిరుగుబాటుగా ప్రజలు, కార్మికవర్గం ఏ మార్గం చేపట్టవలసి ఉన్నదో ఏప్రిల్ లో లెనిన్ క్రాంతదర్శిగా, ద్రష్టగా అక్టోబర్ విప్లవ సన్నాహాలు చేశాడు. సమయం ఆసన్నమైనప్పుడు తాత్సారానికి తావు లేదని, “మనం ఏ మాత్రం ఆలస్యం చేసినా మన మరణ శాసనంపై మనమే సంతకం చేసుకున్నవారమవుతాం” అన్నాడు. నిజానికి లెనిన్ జీవిత సారాంశమంతా ఇదే. పరిస్థితులకు తలొగ్గడం కాకుండా, ఆ పరిస్థితులను చేతుల్లోకి తీసుకుని, మార్గనిర్దేశనం చేసి, నాయకత్వం వహించడమే.
విప్లవానంతరం ఒక కొత్త రాజ్యం, ప్రపంచంలో మొట్టమొదటి కార్మిక కర్షక రాజ్యం నిర్మాణం ప్రారంభమయింది. నూతన జీవిత విధానం మొదలయింది. అంతకు ముందు ఇరవై సంవత్సరాలు పడిన శ్రమ ఒక ఎత్తు. ఇప్పుడు చేపట్టవలసిన కర్తవ్యాలు మరొక ఎత్తు. కాని ఆ కర్తవ్యాల నిర్వహణ కోసం చరిత్ర లెనిన్ కు ఐదు సంవత్సరాల సమయం మాత్రమే ఇచ్చింది.
ఆ ఐదు సంవత్సరాలలో లెనిన్ తలపెట్టినవీ, చేసినవీ, చేయించినవీ, విజయం సాధించినవీ చూస్తే అబ్బురపాటు కలుగుతుంది. మొట్టమొదటి రోజునే భూమి శాసనం వెలువడి, భూస్వాముల, చర్చిల, మఠాల, సంపన్నుల భూమినంతా స్వాధీనం చేసుకుని దున్నేవారికి పంచే కార్యక్రమం మొదలయింది. అప్పటికే పాత రష్యన్ రాజ్యం రుద్ధిన యుద్ధం నుంచి బైటపడడం, పాత పాలకుల కుట్రలనూ, వారు ప్రారంభించిన అంతర్యుద్ధాన్నీ ఓడించడం, శాంతి కోరుకుంటున్న సోవియట్ ప్రజల మీదికి దండెత్తిన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా సహా పద్నాలుగు శత్రు దేశాల చక్రబంధాన్ని ఛేదించడం లెనిన్ తక్షణ సవాళ్లు అయ్యాయి. ఆ చక్రబంధాన్ని ఓడించగానే దేశంలో కరువు, టైఫస్, ఫ్లూ వ్యాధులు చెలరేగాయి. ఈ మధ్యలోనే లెనిన్ మీద కనీసం మూడు హత్యా ప్రయత్నాలు జరిగాయి.
ఈ భయంకర అవరోధాల మధ్య కొత్త రాజ్యాన్ని, కొత్త సమాజాన్ని, కొత్త మనిషిని నిర్మించడానికి లెనిన్ యుద్ధ కమ్యూనిజం, నూతన ఆర్థిక విధానాలు, సుబ్బోత్నిక్ స్వచ్ఛంద సేవ వంటి కొత్త కార్యక్రమాలు ప్రతిపాదించాడు. స్త్రీల విముక్తి, చిన్నారి పిల్లల ఆహ్లాదం, విద్య, వైద్యం, ఆరోగ్యం సోవియట్ రాజ్యపు ప్రధాన కర్తవ్యాలుగా ఎంచుకున్నాడు. దేశాన్ని అభివృద్ధి చేయడానికి విద్యుదీకరణ, పారిశ్రామికీకరణ మొట్టమొదటి అవసరాలని ప్రకటించాడు. యువజన సంఘాన్ని సమావేశ పరిచినప్పుడు, యుద్ధరంగానికి వెళ్లమంటాడేమో అనుకుంటే అధ్యయనం ప్రస్తుత కర్తవ్యం అని పిలుపు ఇచ్చాడు. శ్రామికవర్గ అంతర్జాతీయతను పెంపొందించడానికి ప్రపంచ దేశాల శ్రామిక పార్టీల ఐక్యతా కృషి ప్రారంభించాడు. జారిస్టు రష్యాలో మహా రష్యన్ జాత్యహంకారం కింద జాతుల బందిఖానాలో అణగారిపోయిన జాతులకు స్వయంనిర్ణయాధికారం ఇచ్చి, స్వచ్ఛంద ఐక్యతతో జాతుల నందనవనంగా మార్చే కృషి ప్రారంభించాడు.
1923 మార్చిలో లెనిన్ కు మొదటిసారి బ్రెయిన్ స్ట్రోక్ తో పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి ఎనిమిది నెలల పాటు అత్యున్నత స్థాయి చికిత్స, ఆహ్లాదకరమైన వాతావరణం వంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆరోగ్యం కుదుట పడలేదు. 1924 జనవరి 21న ఆ మహత్తర మేధావీ, కార్యకర్తా, నాయకుడూ, నవసమాజ నిర్మాతా అస్తమించాడు.
లెనిన్ మరణించిన వెంటనే రాసిన దీర్ఘ కావ్యంలో కవి వ్లదిమీర్ మయకోవస్కీ అన్నట్టు, ‘లెనిన్ నేడు లేడూ? చూడు, జనంలో ఉన్నాడు’ అని అనుకోకుండా ఈ వంద సంవత్సరాలు గడవలేదు.