జాతీయ ఓటర్ల దినోత్సవ అవగాహన కార్యక్రమము*
నేటి సత్యం బిహెచ్ఎల్ జనవరి 24
ఈరోజు బి హెచ్ ఈ ఎల్ టౌన్షిప్ లో గల శేరిలింగంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు జాతీయ ఓటర్ల దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కవితగారు అధ్యక్షత వహించారు. అలాగే ముఖ్య అతిథిగా డాక్టర్ పూలపల్లి వెంకటరమణ (విశ్రాంత ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్) విచ్చేసి విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ “భారత ఎన్నికల కమీషను స్వతంత్ర భారత దేశంలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతముగా నిర్వహించేందుకు రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసిన సంస్థ. 1950 జనవరి 25న ఏర్పాటు చేయబడిన ఈ కమీషను సుప్రీంకోర్టు వలెనే రాజ్యాంగం ఏర్పరచిన స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. ఇది ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉండదు. దేశంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్ సభ, రాజ్యసభ, రాష్ట్రాల శాసనసభలు, శాసనమండళ్ళకు జరిగే ఎన్నికలను ఈ కమీషన్ నిర్వహిస్తుంది. వీటి ఎన్నికల నిర్వహణలో పర్యవేక్షణ, మార్గనిర్దేశకత్వం, నియంత్రణ చేయవలసిన బాధ్యతలను రాజ్యాంగం కమీషనుపై ఉంచింది. ఎన్నికల కమీషను అధినేతను ప్రధాన ఎన్నికల కమీషనరు అంటారు. తొలినాళ్ళలో ఒక కమీషనరు ఉండే వారు. 1993 అక్టోబరు 1వ తేదీ నుండి మరొక యిద్దరిని ఎన్నికల కమీషనర్లు నియమించారు. ఈ ముగ్గురు సభ్యులు కమీషను బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రధాన ఎన్నికల కమీషనరును మరియు ఎన్నికల కమీషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. వీరి పదవీకాలం ఆరు సంవత్సరములు లేదా ఆ వ్యక్తికి 65 సంవత్సరముల వయసు వచ్చే వరకు ఏది ముందయితే అది వర్తిస్తుంది. ఈ ముగ్గురు కమీషనర్లతో పాటు ఢిల్లీ లోని కమీషను కార్యాలయంలో కొంతమంది డిప్యూటీ కమీషనర్లు, 300 మంది అధికారులు మరియు యితర సిబ్బంది ఉంటారు. రాష్ట్ర ఎన్నికల కమీషను రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాటు చేయబడినాయి. జాతీయ ఎన్నికల కమీషనుకు ఉన్న అన్ని అధికారాలు రాష్ట్ర ఎన్నికల కమీషనుకు కూడా ఉంటాయి. రాష్ట్రాలలో ప్రధాన ఎన్నికల కమీషనరుచే నియమింపబడే ముఖ్య ఎన్నికల అధికారి మరియు కొందరు సహాయక సిబ్బంది ఉంటారు. ఎన్నికల సమయంలో మాత్రము ఎన్నికల నిర్వహణలో పాల్గొనే 50 లక్షలకు పైచిలుకు సిబ్బంది యావత్తు తాత్కాలికంగా ఎన్నికలు ముగిసే వరకు కమీషను అదుపాజ్ఞలలో పనిచేస్తారు.
రాజ్యాంగ సంస్థ అయిన కమీషను ఎన్నికలకు సంబంధించినంత వరకు సర్వ స్వతంత్ర సంస్థ.
దీని ముఖ్య కార్య కలాపాలు:
1. రాజకీయ పార్టీలకు గుర్తింపును యివ్వడం మరియు రద్దు చేయడం.
2. ఎన్నికల షెడ్యూలు నిర్ణయించడం, ప్రకటించడం మరియు అమలు చేయడం.
3. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయడం, అతిక్రమించిన వారిపై చర్యలు చేపట్టడం.
4. స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతముగా ఎన్నికలను నిర్వహించడం.
5. ఎన్నికల సందర్భంగా వ్యాపారిమితిని ఎన్నికల సంఘం నిర్ణయించి ఎన్నికల అనంతరం ప్రతి అభ్యర్థి ఎన్నికల ద్రోపత్రాన్ని సమర్పించాలి.
ఎన్నికల నిర్వహణను సంస్కరిస్తూ కమీషను కొన్ని చర్యలు చేపట్టింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ప్రవేశ పెట్టడం, ఎన్నికలలో నేరస్తులు పోటీ చేయకుండా నిలువరించడం, ఓటరు గుర్తింపు పత్రాలను ప్రవేశపెట్టడం, ఓటర్ల జాబితాలను ఎలక్ట్రానికీకరణ చేయడం, 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించుట, సాధ్యమైనంత మేర ఎక్కువ శాతం పోలింగ్ జరుగడానికి చర్యలు చేపట్టడం” అని అన్నారు.
“మన దేశంలో ఓటర్ల సంఖ్య మరియు పోలింగు బూతులు సంఖ్య
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఒక మంచి సమాజము ఏర్పడటానికి, అభివృద్ధి జరగడానికి పౌరులందరు కూడా తమ ఓటుహక్కును ఎటువంటి ప్రలోభాలకు, తాయిలాలకు, బెదిరింపులకు లొంగకుండా నీతి, నిజాయితీ, సేవాగుణం, నిబద్ధత కలిగిన మంచి అభ్యర్థులను ఎన్నుకొని ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి ఓటరు మహాశయులందరు ఓటింగులో పాల్గొనాలి” అని తెలిపారు. “పోటీ చేసే అభ్యర్థులందరు ఓటరుకు నచ్చని యెడల ఎలక్షను కమీషను వారు నోటా (NOTA)ను వినియోగించుకోవడం ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేసే సౌకర్యం కలిగించారు. ముఖ్యంగా 18 సంవత్సరములు నిండిన యువత ఫార్మ్ నెంబర్ 6ను నింపి ఓటరుగా నమోదు చేసుకొని ఓటింగ్ లో పాల్గొని మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని సూచించారు.
“ఈ కార్యక్రమం ఈరోజే నిర్వహించడానికి కారణం ఈరోజు ఎన్నికల కమీషను ఆవిర్భావ దినోత్సవము కావడమే” అని అన్నారు. ఈ సందర్భంగా అందరిచేతా ‘ఓటుహక్కును పొందుతామని మరియు నుఓటింగులో పాల్గొని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి అభ్యర్థులను ఎన్నుకుంటామని ” ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అభిజిత్, అధ్యాపకులు డాక్టర్ అనురాధ, ప్రజ్వల, జనార్దన్ మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.