Neti Satyam
Newspaper Banner
Date of Publish : 24 January 2026, 1:22 pm Editor : Admin

ఇంటికి క్షేమంగా చేరడమే..మా లక్ష్యం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

స్టార్ట్ ఎర్లీ – గో స్లోలీ – రీచ్ సేఫ్లీ : సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్.,*

– ఇంటికి క్షేమంగా చేరడమే ‘అరైవ్ అలైవ్’ లక్ష్యం*

శేర్లింగంపల్లి 24 జనవరి మానవ ప్రాణం అమూల్యమైనదని, ప్రతీఒక్కరూ తమ ప్రాణాలతో పాటు తమపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వాహనాలు నడపాలని సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్., అన్నారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా బసంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కూకట్ పల్లి రంగధాముని/ ఐడీఎల్ చెరువు వద్ద సైబరాబాద్ సీపీ సిబ్బందితో కలిసి హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులను సీపీ గారు అభినందించారు.

*ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..* “స్టార్ట్ ఎర్లీ – గో స్లోలీ – రీచ్ సేఫ్లీ” అనే నినాదాన్ని అందరూ ఆచరించాలన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని ఈ ప్రమాదాలు తగ్గించడమే “అరైవ్ అలైవ్” కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో.. ఈ తరహా అవగాహన కార్యక్రమాలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రతీఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలన్నారు.

*సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో జనవరి 13 నుంచి 23 వరకూ “అరైవ్ అలైవ్” కార్యక్రమాలు నిర్వహించారు.*

ఈ అవగాహన కార్యక్రమాలను వివిధ విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇతర ప్రాంతాల్లో ప్రజలందరినీ భాగస్వాములుగా చేసుకుంటూ నిర్వహించారు. సాధారణ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కొండపూర్ ఆర్టీఓ ఆఫీసులో నిర్వహించిన “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ డాక్టర్ గజరావు భూపాల్, ఐపీఎస్., మాట్లాడుతూ.. మానవ తప్పిదాల వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వల్ల అనేక కుటుంబాలు నష్టపోతున్నాయన్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం, వేగ పరిమితులు పాటించడం వంటి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు.

బాలానగర్‌లో హెచ్‌ఏఎల్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన “అరైవ్ అలైవ్”లో భాగంగా కూకట్ పల్లి డీసీపీ రితీరాజ్, ఐపీఎస్., మాట్లాడుతూ.. మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్య చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ ఒక్కరూ క్షేమంగా ఇంటికి చేరాలన్నదే” మా లక్ష్యమన్నారు.

మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ముఖ్య ఉద్దేశమన్నారు. ఓవర్ స్పీడింగ్ ప్రమాదకరమన్నారు. 20 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ ఉన్న దగ్గర 40 కిలోమీటర్ల స్పీడ్, 40 ఉన్న చోట 60 కిలోమీటర్ల వేగం, 100 కిలోమీటర్ల స్పీడ్ వెళ్లడం ప్రమాదాలకు కారణమన్నారు.

కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో భాగంగా విలేకరుల సమావేశంలో ట్రాఫిక్ డీసీపీ I రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు మన కోసమే ఉన్నాయని, రోడ్డుపైకి వచ్చాక కుటుంబాన్ని గుర్తు చేసుకుని ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ నెమ్మదిగా వెళ్లాలన్నారు. అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా కాలేజీలు, ఆటో టాక్సీ డ్రైవర్లకు, ప్రజలకు కూడళ్ల వద్ద ట్రాఫిక్ పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.

కూకట్ పల్లి లో ఎన్‌ఎస్‌ఆర్ గార్డెన్స్ లో బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ పెట్టుకోకపోవడం వంటి నిర్లక్ష్యపు చర్యలే ప్రమాదాలకు ప్రధాన కారణాలన్నారు. ప్రజలు ట్రాఫిక్ నిభందానాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.

మాదాపూర్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన అరైవ్ అలైవ్ సమావేశంలో ఏసీపీ శ్రీధర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రఅందరిపై ఉందన్నారు. వాహనదారులు బాధ్యతగా డ్రైవింగ్ చేసినప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందన్నారు.

మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పిల్లలు, యువత మహిళల ద్వారా కుటుంబంలో రోడ్డు భద్రతకు సంబంధించిన నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సూరారంలోని నార్త్ సిటీ పాఠశాలలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసర చన, రోడ్డు భద్రతపై క్విజ్ పోటీలను నిర్వహించారు.

మియాపూర్ లోని విశ్వనాథ్ గార్డెన్ లో మియాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా కూకట్ పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి మాట్లాడుతూ.. కూకట్ పల్లి, మాదాపూర్, దుండిగల్, గండిమైసమ్మ చౌరస్తా, కేపీహెచ్‌బీ కాలనీలలో బ్లాక్ స్పాట్‌లలో క్షేత్రస్థాయి పరిశీలించామన్నారు. కొండాపూర్ మోటార్ వెహికల్ ఇన్‌ స్పెక్టర్ శ్రీను బాబు మాట్లాడుతూ, “పాదచారులు తప్పనిసరిగా జీబ్రా క్రాసింగ్ వద్దనే రోడ్డు దాటాలన్నారు.

కొండాపూర్ ఆర్‌టీఓ ఇన్‌స్పెక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ.. వాహనం ఉపయోగించే ముందు, అన్ని అనుమతులు, అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవడం ముఖ్యమన్నారు. హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అనేవి తప్పనిసరి ప్రాధాన్యత కావాలన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే మోటార్ ట్రాన్స్ పోర్ట్ నియమాలు గురించి అవగాహన కల్పించాలని సూచించారు.

పోలీసు అధికారులు వివిధ కార్యక్రమాలు లో భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.

నేను భారతదేశ పౌరుడిగా, మోటారు వాహనాల చట్టంలో పొందుపరచిన రోడ్డు నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తానని,

‘ఇతరుల శ్రేయస్సును, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని,

రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తానని,

రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్ నియమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించనని,

ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణించేందుకు నా వంతు సహకారం అందిస్తానని

దృఢసంకల్పంతో ప్రమాణం చేస్తున్నాను’. అని ప్రతిజ్ఞ చేయించారు.

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పలు పాఠశాలల్లో క్విజ్, రంగోలి, వ్యాసరచన పోటీల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెల్మెట్లు పంపిణీ, ప్రతిజ్ఞలు, బాధితుల గాథల ద్వారా ప్రజలకు మరింత స్ఫూర్తినిచ్చే వివిధ కార్యక్రమాలు నిర్యాహించారు. ‘అరైవ్ అలైవ్’ – ప్రతీ ప్రయాణం సురక్షితంగా ముగియాలనే సంకల్పంతో సైబరాబాద్ పోలీసులు ప్రజలతో కలిసి రహదారి భద్రతకు నిబద్ధధ తో ముందుకు సాగుతున్నారు. హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ ధరించండి, మద్యం సేవించి డ్రైవ్ చేయవద్దు, మొబైల్ వాడకండి, జీబ్రా క్రాసింగ్‌పై నే రోడ్డు దాటండి – ఇవే క్షేమంగా ఇంటికి చేరే మార్గాలు.

*- సైబరాబాద్ పోలీస్ కమీషనర్ కార్యాలయంచే జారీ చేయడమైనది.*