సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి రావి నారాయణరెడ్డి స్మారక జాతీయ ఆవార్డు
తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ ప్రకటన
ఈ నెల 2వ తేదీన అవార్డును ప్రదానం చేయనున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
“భారత రాజ్యాంగం- భావప్రకటన స్వేచ్ఛ” అనే అంశంపై స్మారకోపన్యాసం చేయనున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సేనాని, సిపిఐ అగ్రనేత రావి నారాయణరెడ్డి స్మారక జాతీయ ఆవార్డును 2025 సంవత్సరానికి గానూ దేశంలోఅనేక చారిత్రాత్మక తీర్పులను వెల్లువరించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి ప్రదానం చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షులు, మాజీ ఎంఎల్‌ఎ చాడ వెంకట రెడ్డి, ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాప రెడ్డి ప్రకటించారు. అవార్డు ప్రదానోత్సవం ఫిబ్రవరి 2వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని అమరవీరుల స్మారక ట్రస్ట్ కార్యాలయం రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పాల్గొని జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి అవార్డును ప్రదానం చేస్తారని వారు వివరించారు. ఈ సందర్భంగా “భారత రాజ్యాంగం- భావప్రకటన స్వేచ్ఛ” అనే అంశంపై స్మారకోపన్యాసం జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేస్తారని తెలిపారు. సిపిఐ రాష్ట్రకార్యాలయం మఖ్ధూంభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు అవార్డుకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. కందిమళ్ల ప్రతాప రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూమి కోసం భుక్తి కోసమే కాకుండా 200 ఏళ్లకు పైగా సాగిన నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు సాగిన మహోత్తర పోరాటమని తెలిపారు. ఈ పోరాటం ఫలితగానే హైదరాబాద్ సంస్థానం భారత్‌దేశంలో విలీనమైందన్నారు. ఆనాటి పోరాట యోధుల త్యాగాలను భావి తరాలకు అందించడమే లక్ష్యంగా రావి నారాయణరెడ్డి తెలంగాణ అమరవీరుల ట్రస్ట్‌కు అంకురార్పణ చేశారన్నారు. ఆయన మరణం అనంతరం ఆ అశయాలను కొనసాగించడమే లక్ష్యంగా తెలంగాణ అమరవీరుల ట్రస్ట్ ఆధ్వర్యంలో 1999లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులను స్మరించుకుంటూ స్మారకోపన్యాలు నిర్వహించడంతో పాటు రావి నారాయణరెడ్డి పేరుతో జాతీయ ఆవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇందులో భాగంగా 200౦ సంవత్సరం నుంచి దేశంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన పలువురికి అవార్డును ట్రస్ట్ ప్రదానం చేసిందని తెలిపారు. ఆర్ధిక రంగ నిపుణులు బందోపాధ్యాయ, సిహెచ్.హనుమంతరావు, కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి ఇంద్రజిత్ గుప్తా, కేంద్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి చతురానన్ మిశ్రా, సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శులు ఎ.బి.బర్ధన్, సురవరం సుధాకర్‌రెడ్డి, ప్రముఖ దర్శకులు శ్యామ్ బెనగల్ లాంటి ప్రముఖులకు రావి నారాయణరెడ్డి స్మారక జాతీయ అవార్డును ప్రదానం చేశామని చెప్పారు. ఆ తర్వాత జరిగిన తెలంగాణ మలిదశ ఉద్యమం, కరోనా సమయంలో ఈ అవార్డులను ఇవ్వలేకపోయామని, తిరిగి 2026లో ఈ అవార్డును పునరుద్దరించామని చెప్పారు.