(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మార్క్సిస్టు తత్వశాస్త్రం: మన కోసమూ మహేష్ కోసమూ
(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విప్లవోద్యమ నాయకుడు, అప్పటి సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ రాష్ట్ర కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు, మహేష్ గా సుప్రసిద్ధుడైన ఎర్రంరెడ్డి సంతోష్ 1997-99 మధ్య చెప్పిన మార్క్సిస్టు తత్వశాస్త్ర పాఠం గతంలో ఇరవై ఏళ్ల కింద పుస్తక రూపంలో వెలువడింది. దాన్ని ఇప్పుడు పునర్ముద్రిస్తూ, ప్రచురణకర్తలు ముద్ర పబ్లికేషన్స్ నన్ను ముందుమాట రాయమన్నారు. ఇది ఆ ముందుమాట.
సంతోష్ కూడా వరంగల్ ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ విద్యార్థే కానీ, నేను అక్కడ డిగ్రీలోకి వచ్చేప్పటికే తన డిగ్రీ అయిపోయి, ఉస్మానియాలో కెమిస్ట్రీ ఎంఎస్సీ లో చేరాడు. నేను ఉస్మానియాకు ఎంఎ కోసం వచ్చేప్పటికి, తను ఎంఎస్సీ అయిపోయి, ఆర్ట్స్ కాలేజీలో ఫిలాసఫీ ఎంఎ లో ఉన్నాడు. తానుండిన ఎ హాస్టల్ కూ, నేనుండిన ఓల్డ్ పి జి హాస్టల్ కూ, మల్లయ్య క్యాంటీన్ కూ మధ్య త్రిభుజంలో పదుల కొద్దీ గంటల సంభాషణల, పనుల, రచనల ఎర్ర నక్షత్రాలెన్నో వెలిగించి నా మీద అపారమైన ప్రభావం వేసినవాడు సంతోష్.
1999 డిసెంబర్ 1న బెంగళూరులో తననూ, నల్లా ఆదిరెడ్డినీ (శ్యామ్), శీలం నరేష్ (మురళి) నూ అరెస్టు చేసి, చంపివేసి, కరీంనగర్ జిల్లా కొయ్యూరు అడవిలో దొంగ ఎదురుకాల్పుల కట్టుకథ అల్లి, ఆ కట్టుకథకు విశ్వసనీయత కల్పించడానికి స్థానిక గర్జనపల్లి పశువుల కాపరి లక్ష్మీరాజంను కూడా చంపేశారు చంద్రబాబు నాయుడు, దొర ల ఆదేశాల మేరకు పోలీసులు. అప్పటికి మూడు నెలల కింద నా ‘అమ్మకానికి ఆంధ్ర ప్రదేశ్’ వెలువడింది. సంతోష్ అది చదివి, సూచనలు కూడా చేశాడు. డిసెంబర్ లో తన హత్య జరిగాక ‘అమ్మకానికి ఆంధ్రప్రదేశ్’ రెండో కూర్పు ప్రచురించి, అది సంతోష్ కు అంకితం చేశాను.
సంతోష్ ను మళ్లీ ఒకసారి తలచుకునే సందర్భం ఈ ముందుమాట.)
ఇప్పటికే తెలుగులో మార్క్సిస్టు తత్వశాస్త్రం మీద మూలరచనలూ అనువాదాలూ కనీసం రెండు డజన్ల పుస్తకాలైనా ఉన్నాయి. మళ్లీ మరొక పుస్తకమా, ఎందుకిది అని ఎవరికైనా అనుమానం రావచ్చు. కాని ఇంగ్లిష్, ఇతర యూరపియన్ భాషల్లో మార్క్సిస్టు తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకునే, విభిన్న కోణాల్లో అర్థం చేయించే, మార్క్సిస్టు తత్వశాస్త్ర దృక్పథానికి ఉండే విశాల వైవిధ్యాన్ని చూపే వందలాది పుస్తకాలతో పోలిస్తే, మన భాషలో ఉండవలసినన్ని పుస్తకాలు లేవనే చెప్పాలి. అందువల్ల మార్క్సిస్టు తత్వశాస్త్రం మీద విభిన్న దృక్కోణాల నుంచి వైవిధ్యభరితమైన పుస్తకాలెన్నో రావలసే ఉంది. ఆ ప్రత్యేక నేపథ్యంలోనే ఈ పుస్తకం వెలువడుతున్నదనుకుంటున్నాను. ఈ పుస్తకం మన కోసమూ చదవాలి, మహేష్ కోసమూ చదవాలి. మార్క్సిస్టు దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికీ, మన జీవితంలో అన్వయించుకోవడానికీ చేసే, చేయవలసిన అనేక ప్రయత్నాలలో ఇటువంటి పుస్తకాన్ని మళ్లీ మళ్లీ చదవాలి. చదివే క్రమంలో ఈ పుస్తకపు అనేక ప్రత్యేకతలు మీరు కూడా గుర్తించగలరు గాని, నాకు తట్టిన ప్రత్యేకతలలో కనీసం మూడు మీ ముందు పెడతాను.
మొట్టమొదట, ఇది ఒక తత్వశాస్త్ర పుస్తకం రాయడం కోసం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకొని పుస్తకంగా రాసినది కాదు, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలకు వాళ్ల నిత్య జీవితాచరణలో అవసరమైన దృక్పథం కలిగించేందుకు పాఠంగా చెప్పినది. విన్నవాళ్లు దాదాపు యథాతథంగా రాసి, ఉపాధ్యాయుడు బూటకపు ఎన్ కౌంటర్ లో అమరుడైన తర్వాత నాలుగు సంవత్సరాలకు, ఎప్పుడో ఇరవై ఏళ్ల కింద మొదటిసారి ప్రచురించినది. మధ్యలో 1997లో జరిగిన పరిణామాల ప్రస్తావన కూడా ఉంది గనుక అంతర్గత ఆధారాల ప్రకారం ఆ పాఠం 1997 తర్వాత జరిగి ఉండాలి. 1999 డిసెంబర్ 2న ఈ ఉపాధ్యాయుడి అరెస్టు, హత్య జరిగాయి గనుక ఈ పాఠం ఆ రెండు సంవత్సరాలలో జరిగి ఉండాలి.
ఇది రాజకీయ కార్యకర్తలైన విద్యార్థులకు చెప్పిన పాఠం గనుక సహజంగానే రాజకీయ రంగపు ఉదాహరణలే ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒక పాఠం గనుక చాలా చోట్ల లిఖిత శైలి కాకుండా మౌఖిక, సంభాషణా శైలి ఉంది. గతంలో తెలుగులో తత్వశాస్త్ర పుస్తకాలు రాసినవారిలో కూడా ఇద్దరు ముగ్గురు తమ ఉపాధ్యాయ, బోధనా అనుభవాల నుంచే రాశారు గాని అవి ప్రధానంగా లిఖిత రచనలే. ఇక్కడ మాత్రం ఈ పుస్తకం పాఠాన్ని యథాతథంగా రాసినది గనుక శైలి చాలా హాయిగా, చదివించేలా, పాఠ్యపుస్తకం అనిపించని పద్ధతిలో, మాట్లాడుతున్నట్టుగా ఉంది. మామూలుగా తెలుగు తత్వశాస్త్ర పుస్తకాలలో కనిపించే గొట్టు మాటల, కష్టమైన అన్వయాల, సంకీర్ణ, సంక్లిష్ట వాక్య నిర్మాణాల భాష కాకుండా అవతలివాళ్లకు అర్థం అవుతున్నదా లేదా ఎప్పటికప్పుడు, ప్రతి వాక్యానికీ ఆగి తరచి చూసుకుంటూ, ఒక విషయాన్ని వేరు వేరు కోణాల నుంచి చెపుతూ, గహనమైన సైద్ధాంతిక అంశాలకు సులభమైన నిత్య జీవిత ఉదాహరణలు ఇస్తూ సాగిన శైలి ఉంది. ఇది ఈ పుస్తకపు ప్రత్యేకతలలో ఒకటి.
రెండోది, ముందు చెప్పిన బోధనా అవసరం వల్ల కొంత, ఉపాధ్యాయుడి వ్యక్తిత్వం, అనుభవ వైశాల్యం వల్ల కొంత ఈ పాఠంలో మరొక విశిష్టత వచ్చి చేరింది. తత్వశాస్త్రాన్ని తెలుగు సమాజ ఆచరణ నుంచి అన్వయించిన, వివరించిన పుస్తకం కావడమే దీని ప్రత్యేకత. సాధారణంగా తెలుగులో తత్వశాస్త్ర పాఠాలూ, రచనలూ కూడా ఇంగ్లిష్ తత్వశాస్త్ర రచనల అనుసరణలుగా, వాటి నుంచి ప్రేరణ పొందినవిగా ఉన్నాయి, ఉంటాయి. అలా ఉండడం సహజమే కూడా. ఆ కారణం వల్లనే ఇంతవరకూ తెలుగు తత్వశాస్త్ర ఉపన్యాసాల్లో, రచనల్లో ఉదాహరణలు ప్రకృతి నుంచీ, లేదా యూరపియన్ సామాజిక అనుభవం నుంచీ, లేదా ఆ తర్వాత చైనీస్ సామాజిక అనుభవం నుంచీ ఉండడం అలవాటుగా మారింది. ఒక క్లిష్టమైన విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఇచ్చే ఉదాహరణ కూడా విద్యార్థులకూ పాఠకులకూ సుదూరమైనదై, అది కూడా క్లిష్టంగా ఉండే పరిస్థితి ఏర్పడింది. నిజానికి తత్వశాస్త్ర అధ్యాపకుల, రచయితల, వివరణకర్తల పని ఆ ఇతర సమాజాల ఉదాహరణలు తొలగించి, ఆ స్థానంలో ఇక్కడి విద్యార్థులకు అర్థమయ్యే ఇక్కడి ఉదాహరణలు, సామాజిక అనుభవాలు పొందుపరచడం.
ఈ పాఠం ఆ కృషిలో నూటికి నూరు పాళ్లు విజయం సాధించిందని చెప్పలేను గాని, తప్పనిసరిగా గణనీయమైన ముందడుగులు వేసింది. ముఖ్యంగా అనేక తాత్విక, సైద్ధాంతిక అవగాహనలను ఇక్కడ మహేష్ పార్టీ చరిత్ర నుంచి, భారత చరిత్ర నుంచి ఉదాహరణల ద్వారా వివరించడానికి ప్రయత్నించాడు. అక్కడ విద్యార్థులందరూ పార్టీ కార్యకర్తలు, పార్టీ చరిత్ర తెలిసినవారు, తెలుసుకుంటున్నవారు గనుక ఆ ఉదాహరణలు వారికి సులభంగా అర్థమై ఉంటాయి, వారు ఆ అవగాహనలను అన్వయించుకోగలిగి ఉంటారు, అంటే ఆ తాత్విక అంశాలను మెరుగ్గా అర్థం చేసుకోగలిగి ఉంటారు. తత్వశాస్త్ర బోధనలో అత్యంత అవసరమైన, కీలకమైన కృషి ఇది.
ఉదాహరణకు ప్రపంచంలో, ప్రకృతిలో ఏ విషయమూ ఒంటరిగా లేదనీ, ఒకటి తక్కిన విషయాలతో సంబంధంలో ఉందనీ, కాబట్టి దేన్నయినా అన్ని విషయాల్లో భాగంగానే అర్థం చేసుకోవాలనీ గతితార్కిక సూత్రం చెపుతూ, పార్టీలో చెడు ధోరణులు పొడసూపిన వ్యక్తిని శిక్షించడంతో సమస్య పరిష్కారం కాదని ఆచరణలో అందరికీ తెలిసిన విషయం ద్వారా వివరించాడు. అలాగే పార్టీలో ఒకప్పుడు ఉండిన సి.ఓ. (సెంట్రల్ ఆర్గనైజర్) పద్ధతి ఉద్యమ విస్తరణకు ఎంత మేలు చేసిందో చెపుతూనే, కాలక్రమేణా ఆ ఒంటరి పని లోనుంచే ఎలా వ్యక్తిగత పని విధానం, పెత్తందారీతనం తలెత్తాయో చెప్పాడు. యాదృచ్చికత అనే తాత్విక అవగాహనను వివరిస్తూ జగిత్యాల రైతాంగ పోరాట క్రమంలో పెల్లుబికిన పోరాట రూపాలలోని యాదృచ్చికతతో సమన్వయం చేశాడు. అక్కడి నుంచి మళ్లీ సైద్ధాంతిక అవగాహన లోకి వెళ్లి “నియమాలన్నీ కూడా యాదృచ్ఛికంగానే మన ముందుకు వస్తాయి. వాటి నుంచి వాటితో సన్నిహిత సంబంధం ఉన్నవాళ్లు … కొన్ని నిర్ణయాలు చేస్తారు. వీటిని రుజువు పరిచే సాధనాలు కొన్నాళ్లకు వస్తాయి” అని ఒక అద్భుతమైన తాత్విక, సైద్ధాంతిక సూత్రాన్ని అలవోకగా నిర్ధారించాడు.
పార్టీ అనుభవంలో సరైన నిర్ణయాలు తీసుకోని సందర్భాలను, ఉదాహరణకు చైనా కమ్యూనిస్టు పార్టీ స్వభావం గురించి అంచనాలో ఆలస్యాన్ని గురించి వివరిస్తూ, ఉత్తర తెలంగాణ నిర్బంధానికీ అంతర్జాతీయ పరిస్థితికీ ముడిపెట్టి సూత్రీకరించడం గురించి వివరిస్తూ అక్కడి నుంచి ఆలోచనా పద్ధతిలో స్వీయాత్మకత పాత్ర అనే లోతైన తాత్విక అంశాన్ని విశ్లేషించాడు. వ్యక్తివాదం గురించి చెపుతూ, బూర్జువా వ్యక్తివాదాన్నీ, ఎన్ టి ఆర్, చంద్రబాబు నాయుడులనూ ప్రస్తావించాడు. సాపేక్షికత ప్రాధాన్యతను వివరించే క్రమంలో, నిశ్చల స్థితి ఉన్న ప్రాంతానికీ, వేగంగా మారుతున్న పరిస్థితి ఉన్న ప్రాంతానికీ వేరు వేరు ఎత్తుగడలు రూపొందించుకోకపోవడం జడాత్మకతకూ పిడివాదానికీ దారి తీస్తుంది అని లోతైన అవగాహన ప్రకటించాడు. జ్ఞాన సిద్ధాంతంలో అనుభూతి జ్ఞానదశ నుంచి తర్కబద్ధ జ్ఞానదశకు చేరుకోవడాన్ని వివరించడానికి ఉత్తర తెలంగాణ విప్లవోద్యమపు చారిత్రక అనుభవం చెప్పాడు. ఇటువంటి ఎన్నో ఉదాహరణలు, ఇదేదో కష్టమైన తత్వశాస్త్ర పాఠం కాదనీ, కళ్లముందర గడిచిన చరిత్ర నుంచి రాబట్టిన తాత్విక నిర్ధారణలనీ చూపుతాయి. అంటే తత్వశాస్త్రం మాయాజాలం కాదనీ, నిత్య జీవితాచరణ నుంచి వడకట్టిన సారమనీ చూపుతాయి.
అట్లాగే వాదన వెనుక వాదన ద్వారా ఒక తార్కిక క్రమంలో అంతిమ నిర్ధారణకు చేరుకునే అద్భుతమైన పద్ధతికి ఉదాహరణగా ‘పదార్థంలో ఐక్యత ఉందని ఎలా చెప్పగలం?’, ‘విశ్లేషణ – సంశ్లేషణ’ అనే భాగాలు చూడండి. ‘పదార్థాన్ని అర్థం చేసుకోవడానికి, పదార్థం లక్షణాన్ని వివరించడానికి సంఖ్య వచ్చింది’ అని గణితశాస్త్రానికీ, భౌతిక శాస్త్రానికీ, తత్వశాస్త్రానికీ మౌలికమైన లోతైన నిర్ధారణను ఎంత సులభంగా చెప్పాడో చూడండి.
ఇరవై ఐదు సంవత్సరాల కిందనే ప్రారంభమై, ప్రశంసనీయ పద్ధతిలో జరిగిన ఈ కృషి మరింత విశాలంగా, మరింత లోతుగా వ్యాపించవలసి ఉంది. బహుశా తదనంతర అధ్యాపకుల్లో ఆ కృషి జరిగిందేమో, వాళ్ల అజ్ఞాత కృషి బైటికి తెలియకుండా ఉందేమో. కాని ఇప్పుడిది సాధారణ పాఠకులకు, తత్వశాస్త్రంలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు అందుతున్నది గనుక, మరింత లోతైన కృషి జరగడానికి అవసరమైన పునాదిని ఏర్పరచడం ఈ పుస్తకపు మరొక ప్రత్యేకత.
ఈ పుస్తకపు మూడో ప్రత్యేకత ఇది మహేష్ ఆలోచన, మాట, రచన కావడం. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్ – లెనినిస్ట్) (పీపుల్స్ వార్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా, మహేష్ గా ప్రఖ్యాతుడైన ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి ఈ తత్వశాస్త్ర పాఠం చెప్పడానికి తన అధ్యయనం ద్వారా, ఆచరణ ద్వారా సంపూర్ణమైన అర్హత సంపాదించినవాడు. రసాయన శాస్త్రంలోనూ, తత్వశాస్త్రంలోనూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువు కేవలం చదువుగా మాత్రమే కాక, ఆ రెండు శాస్త్రాల సారాంశాన్ని గ్రహించడానికి చదివాడు. ఇటు ఒక ఆధునిక విజ్ఞాన శాస్త్ర విశ్లేషణా పద్ధతులను, అటు ఒక ప్రాచీన మానవీయ శాస్త్ర వాదనా, విశ్లేషణా పద్ధతులను ఆకళింపు చేసుకొని, తన ఆలోచనలో, మాటలో వ్యక్తీకరించిన మనిషిగా, సహజంగానే తన ఆచరణలో వాటిని ప్రతిఫలించాడు. అందువల్లనే ఆ రెండు పీజీ కోర్సుల రోజుల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అటు సైన్స్ కాలేజీలో, ఇటు ఆర్ట్స్ కాలేజీలో రాడికల్ విద్యార్థి సంఘ నాయకుడిగా ఎదిగాడు. సంఘ్ పరివార్ భౌతిక, భావజాల దాడులను ఎదుర్కొనే క్రమంలో సమరశీల యోధుడిగా విస్తరించాడు. ఉస్మానియాలో విద్యార్థి జీవితం పూర్తి కాకుండానే నగరంలో విప్లవోద్యమ నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. సంచలనాత్మకమైన ఎన్నో కర్తవ్యాలు నిర్వహించాడు. అలా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, కార్యదర్శివర్గ సభ్యుడిగా, కార్యదర్శిగా మెట్టు మెట్టుగా ఉన్నతమైన బాధ్యతలను చేపడుతూ పోయాడు. ఒకవైపు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్త నిర్మాణ, విస్తరణ కృషి జరుపుతూనే తత్వశాస్త్ర, రాజకీయార్థ శాస్త్ర అధ్యాపకుడిగా కూడా ఎనలేని సేవలు అందించాడు. విద్రోహం వల్ల బెంగళూరులో కేంద్ర కమిటీ సభ్యుడు నల్ల ఆదిరెడ్డి (శ్యామ్), ఉత్తర తెలంగాణ కమిటీ కార్యదర్శి శీలం నరేష్ (మురళి) లతో పాటు పోలీసుల చేత చిక్కి, కరీంనగర్ జిల్లా కొయ్యూరు అడవిలో, స్థానికుడు గర్జనపల్లి పశువుల కాపరి లక్ష్మీరాజం తో కలిపి బూటకపు ఎన్ కౌంటర్ లో హత్య చేయబడ్డాడు.
అంటే ఇక్కడ మీరు చదవబోతున్నది ఏదో సాధారణ తత్వశాస్త్ర పాఠం కాదు, ఉట్టి మేధా కృషి కాదు, ఇది నెత్తుట తడిసిన ఆలోచనాచరణల పాఠం. ఈ పుస్తకంతో పోల్చగలిగినది డేవిడ్ గెస్ట్ రాసిన ‘లెక్చర్స్ ఇన్ మార్క్సిస్ట్ ఫిలాసఫీ’ మాత్రమే. బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త డేవిడ్ గెస్ట్ తన ఇరవై ఏడో ఏట స్పానిష్ అంతర్యుద్ధంలో తుపాకి పట్టి పోరాడుతూ మరణించాడు. ఆయన మార్క్సిస్టు తత్వశాస్త్ర పాఠాలు చెప్పడానికి రాసుకున్న నోట్స్ ఆయన మరణించిన తర్వాత పుస్తక రూపం ధరించి, ఎనిమిది దశాబ్దాలుగా ఎందరో తత్వశాస్త్ర విద్యార్థులకు మార్గదర్శకమయ్యాయి. ఇక్కడ ఇప్పుడు అంతే ప్రభావశీలమైన తత్వశాస్త్ర అధ్యాపకుడు, విప్లవోద్యమంలో తుపాకి చేతబట్టి పోరాడిన, నాయకత్వం వహించిన రసాయన శాస్త్రవేత్త, తత్వ శాస్త్రవేత్త సంతోష్ (మహేష్) చెప్పిన మార్క్సిస్టు తత్వశాస్త్ర పాఠాలు మీరు చదవబోతున్నారు.
ఎన్ వేణుగోపాల్
హైదరాబాద్, జనవరి 20, 2024