Neti Satyam
Newspaper Banner
Date of Publish : 01 February 2026, 12:22 pm Editor : Admin

సుప్రీం వాక్యాలు రాజ్యాంగ విలువలకు విఘతం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సుప్రీం వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విఘాతం

తక్షణం వెనక్కు తీసుకోవాలి

కార్మిక సంఘాలు ఆర్థికాభివృద్ధికి అడ్డంకి కాదు

హక్కుల రక్షణకు రాజ్యాంగం గుర్తించిన ప్రజాస్వామ్య సంస్థలు

అమర్జిత్ కౌర్

న్యూదిల్లీ:

స్తబ్దతకు పారిశ్రామిక ‘ప్రతిఘటనతో కూడిన ట్రేడ్ యూనియన్ వాదం’ కారణమంటూ సుప్రీంకోర్టు చేసిన విమర్శను అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) తీవ్రంగా ఖండిం చింది. రాజ్యాంగంలో పొందుపర్చిన సోషలిస్ట్ ప్రజాస్వామ్య ఆదర్శాలకు హాని కలిగించే విధంగా ఈ వ్యాఖ్యలున్నాయని… రాజ్యాంగ విలువల్ని దెబ్బతీస్తాయని పేర్కొంది. గౌరవ నీయ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను ఉపసం హరించుకోవాలని డిమాండ్ చేసింది. ఈమేరకు ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పెన్ తోజిలార్గల్ సంఘం, ఇతర కార్మిక సంఘాలు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా గురువారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయామాల్య బాగ్చిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం… పని ప్రతిఘటన సంస్కృతి, జెండా మోసే కార్మిక సంఘాల బలమైన నాయకత్వం దేశవ్యాప్తంగా అనేక పారిశ్రామిక సంస్థల మూసివేతకు దారితీశాయని పేర్కొంది. గృహ కార్మికులకు కనీస వేతనాలు కోరుతూ దాఖలైన పిటిషన్ను స్వీకరించడానికి నిరాకరించడంతో పాటు సుప్రీం కోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్రంగా ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని కౌర్ పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, శ్రమ గౌరవం అనే రాజ్యాంగ ఆదేశానికి విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇటువంటి ప్రకటనలు కార్మికుల పోరాటాలను చట్టవిరుద్ధం చేసే ప్రమాదం ఉందని… కార్మిక హక్కులను పరిరక్షించడంలో కార్మిక సంఘాల ప్రజాస్వామ్య పాత్రను బలహీనపరిచే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ప్రకటనలు కార్మిక హక్కులను నీరుగార్చడడమే గాక సమిష్టి చర్యను అణచివేసే చర్యల్ని సమర్థించటట్లున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. కార్మిక సంఘాలు ఆర్థికాభివృద్ధికి అడ్డంకులు కావని ఆమె స్పష్టం చేశారు. కార్మికుల గౌరవం, జీవనోపాధి, హక్కులను కాపాడటానికి రాజ్యాంగం గుర్తించిన ప్రజాస్వామ్య సంస్థలని గుర్తెరగాలన్నారు. అసోసియేషన్లు, సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు ఆర్టికల్ 19(1) (సి) ప్రకారం ప్రాథమిక హక్కు అని, సామూహిక బేరసారాలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కార్మిక హక్కు అని తెలిపారు. పారిశ్రామిక స్తబ్దతకు కారణంగా ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలను చిత్రీకరించడం అంటే ఆర్థిక వాస్తవాలను తప్పుగా అర్థం చేసుకోవడం, అదుపులేని కార్పొరేట్ కేంద్రీకరణకు దారితీసే కార్పొరేట్ అనుకూల విధానాల విధ్వంసక పరిణామాలను విస్మరించడమేనని కౌర్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి గృహ కార్మికుల కనీస వేతనాలను గుర్తించకపోవడం పట్ల ఏఐటీయూసీ ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. ఈ శ్రామిక వర్గంలో అత్యధికంగా అనధికారికంగా, సామాజికంగా అణగదొక్కబడినవారు, ప్రధానంగా మహిళలు ఉన్నారని… రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16, 21 ల స్ఫూర్తిని సుప్రీంకోర్టు విస్మరించడం, సామాజిక మరియు ఆర్థిక అసమానతలను పరిష్కరించడానికి రాజ్యాంగ మార్గాలను తిరస్కరించడం పట్ల కౌర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గౌరవనీయ సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.