Neti Satyam
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 8:18 am Editor : Admin

యువతరమా మేలుకో..




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

యువత మేలుకో —

మత్తుకు బానిస కావద్దు..మద్యం మత్తులో నీ బతుకును ఆగం చేసుకోవద్దు —

నీ కుటుంబ సుఖశాంతులను దూరం చేసుకోవద్దు

మత్తు కాదు… నీ ఆరోగ్యమే ముఖ్యం.

యోగ–ధ్యానంతో

జీవితాన్ని మెరుగుపరుచుకో.

రోజూ మద్యం సేవించడం వలన శరీర ఆరోగ్యం క్షీణిస్తుంది, కుటుంబాల ఆర్థిక స్థితి చిన్నాభిన్నం అవుతుంది. మద్యం మత్తులో వ్యక్తి రోజువారీ పనులు చేయలేకపోతాడు. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత కారణంగా పగలు–రాత్రి తేడా లేకుండా మద్యం సేవించడం వల్ల పనిదినాలు కోల్పోతున్నారు. దానికి తోడు ప్రభుత్వం కూడా ఎక్కువగా మద్యం షాపులు మరియు ఏర్పాటు చేయడం వలన వేళాపాలా లేకుండా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. పగటి పూటే మద్యం సేవించే వారు పెరిగి పనులు చేయలేకపోతున్నారు. దేశంలో ఉత్పత్తి చేయగలిగే వస్తువులు తగ్గుతున్నాయి. చివరికి దేశ ఆర్థిక పరిస్థితి కూడా దారుణంగా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో యువత ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అభివృద్ధి చెందిన దేశాలు ఒకనాడు మద్యనిషేధాన్ని కఠినంగా అమలు చేసి, ఒక తరాన్ని పూర్తిగా మద్యానికి దూరంగా ఉంచాయి. అందుకే అక్కడ పని సంస్కృతి బలపడింది. అక్కడ ప్రజలు వారంలో కష్టపడి పనిచేసి, వారాంతంలో మాత్రమే మద్యం సేవించే పరిమితి విధానం పాటిస్తారు.

భారత రాజ్యాంగం మద్యం గురించి ఏం చెబుతుంది ?

ఆర్టికల్ 47 ఆదేశిక సూత్రాల ప్రకారం ప్రజల ఆరోగ్యం కోసం మద్యం వినియోగాన్ని తగ్గించే బాధ్యత రాష్ట్రాలదే . అయితే గుజరాత్, బీహార్, మిజోరాం నాగాలాండ్

వంటి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ పూర్తిగా మద్యనిషేధాన్ని అమలు చేసి పొందిన సామాజిక ప్రయోజనాలను ఆదర్శంగా తీసుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. మణిపూర్‌లోని కొన్ని జిల్లాల్లో మద్యంపై పాక్షిక నిషేధం ఉంది.

మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి సంపద వస్తుంది, దానితో రాష్ట్ర అవసరాలు తీరుతాయన్న ఆలోచన సబబు కాదు . మద్యం ద్వారా కొంత ఆదాయం వచ్చినా, ప్రజల ఆరోగ్యం, కుటుంబ శాంతి, పని సామర్థ్యంపై పడే దుష్ప్రభావం ఆ ఆదాయానికి ఎన్నో రెట్లు ఎక్కువ. ప్రజలు ఆరోగ్యంగా లేనప్పుడు, జరుగుతున్న అభివృద్ధి ఎవరి కోసం?

మునుగోడు శాసనసభ్యుడు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గారు తన నియోజకవర్గంలో మద్యం దుకాణాలు మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే, పర్మిట్ దుకాణాలు సాయంత్రం 6 గంటల నుండి మాత్రమే తెరుచుకోవాలి అని నిర్ణయం తీసుకోవడం ప్రజల ఆరోగ్యానికి, గ్రామీణ పనిసంస్కృతికి ఎంతో మేలు చేస్తుంది.

మద్యం అమ్మకాలు నెమ్మదిగా తగ్గుతూ వస్తే యువత మద్యానికి దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మాదకద్రవ్యాలు బారిన పడకుండా ఉంటారు . మన రాష్ట్రంలో కూడా మద్యం అమ్మకాలను దశలవారీగా అమ్మకాలను తగ్గించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.

ఈ చర్యలు గ్రామీణ పనిసంస్కృతిని బలోపేతం చేస్తాయి.

దేశం ,రాష్ట్రం మన ప్రాంత అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం, ఉత్పాదకత కీలకం. మద్యం వినియోగాన్ని తగ్గించడం అనే రాజ్యాంగబద్ధమైన బాధ్యతను ఈ నిర్ణయం నెరవేర్చుతోంది.

ఈ సరైన దిశలో తీసుకున్న చర్యలు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాము.

సర్వేజనా సుఖినోభవంతు ఫౌండేషన్ స్వాములవారి లింగోటము