Neti Satyam
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 7:48 am Editor : Admin

ఇరాన్ లో కలోల పరిస్థితి.. బయటపడి దారి?




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

* ఇరాన్‌లో కల్లోల స్థితి – బైట పడే దారి?

– వ్యాసకర్త : విజయ్ ప్రసాద్‌, ‘లెఫ్ట్‌వర్డ్‌ బుక్స్‌’ సంపాదకులు

నేటి సత్యం  Feb 6,2026 06:04

ఇరాన్‌లో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో హింసాకాండ చోటు చేసుకుంటోంది. ఆందోళనకారులు, పోలీసులు చాలామంది మరణిస్తున్నారు. అవధులు తప్పిన ద్రవ్యోల్బణం ప్రజల ఆగ్రహానికి కారణం అయ్యింది. ముందు పనులను బంద్‌ చేశారు. ఆ తర్వాత ఆందోళనలు పెరిగాయి. మహిళలు, యువత బాగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. అమెరికా ఆంక్షల కారణంగా దీర్ఘకాలం ఆర్థిక దిగ్బంధనం కొనసాగడం, ఇజ్రాయిల్‌, అమెరికా నేరుగా ఇరాన్‌ మీద దాడులకు పూనుకోవడం ఈ పరిస్థితులకు కారణం. కాని ప్రజల ఆగ్రహం అమెరికా మీద కన్నా, ఇజ్రాయిల్‌ మీద కన్నా, తమ స్వంత ప్రభుత్వం మీదనే ఎక్కువగా వ్యక్తం అవుతోంది.

తన గూఢచర్య కార్యకలాపాల ద్వారా ఇరాన్‌ ప్రజల్లోకి చొచ్చుకుపోయి అక్కడ ఇరాన్‌ చక్రవర్తిగా (షా ఆఫ్‌ ఇరాన్‌) రెజా పెహ్లవీ ని నియమించబోతున్నట్టు అక్టోబర్‌ 2025 లోనే ఇజ్రాయిల్‌ పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇక అమెరికా అయితే, ఇరాన్‌ ప్రభుత్వం ఆందోళనకారులను అణచివేయజూస్తే టెహ్రాన్‌ మీద బాంబుల వర్షం కురిపిస్తానంటూ ప్రకటించింది.

ఇరాన్‌ లో చమురు కర్మాగారాల్లో పని చేస్తున్న కార్మికుల సంఘం బుషెహర్‌ గ్యాస్‌ రిఫైనరీ వర్కర్స్‌ యూనియన్‌ కు చెందిన 5000 మంది కాంట్రాక్టు కార్మికులు తమ కుటుంబాలతో సహా టెహ్రాన్‌ లోని జాతీయ పార్లమెంటు వద్దకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమ వేతనాలను పెంచాలని, మెరుగైన సర్వీసు కండిషన్లు కావాలని వారు కోరారు. కాంట్రాక్టు పద్ధతికి స్వస్తి చెప్పాలని వారు కోరారు. అయితే వారి న్యాయబద్ధమైన పోరాటాన్ని ఏకంగా అక్కడి ప్రభుత్వ మార్పిడి కోసం జరిగే పోరాటంగా మార్చివేయడానికి ఇజ్రాయిల్‌, అమెరికా కుట్ర పన్నాయి.

అసలు ఇరాన్‌ లో ఏం జరుగుతున్నదీ అర్థం చేసుకోవాలంటే ముందు ఈ దిగువన పేర్కొన్న ఆరు అంశాలనూ అర్ధం చేసుకోవాలి. వీటికి చాలా చారిత్రిక ప్రాధాన్యత ఉంది.

1979 నుంచీ ఇరాన్‌ అరబ్‌ దేశాలలో, ముస్లిం ప్రపంచంలో రాచరికాల అంతానికి జరిగిన ఉద్యమాలలో ముందుంది. పాలస్తీనా పోరాటానికి అండగా నిలిచింది.

1. నిజానికి ఇరాన్‌ లో విదేశీ జోక్యం కొత్త విషయం ఏమీ కాదు. 1901 నుంచీ ఇరాన్‌ లోని చమురు మీద బ్రిటన్‌ తన పెత్తనాన్ని చెలాయించింది. 1907లో బ్రిటన్‌, రష్యా (జారిస్టు రష్యా) ఇరాన్‌ మీద పెత్తనాన్ని పంచుకున్నాయి. 1921లో ఒక కుట్ర ద్వారా అక్కడ రెజా ఖాన్‌ సింహాసనం ఎక్కాడు. మళ్ళీ అతడికి వ్యతిరేకంగా అతని కుమారుడే 1953లో కుట్రకు పాల్పడ్డాడు.

అతడే మొహమ్మద్‌ రెజా షా పహ్లవి (ఇతడినే షా ఆఫ్‌ ఇరాన్‌ అంటారు.) 1979లో అతడిని అయతుల్లా ఖొమేనీ నాయకత్వంలో ఇస్లామిక్‌ విప్లవం ద్వారా కూలదోశారు. ఇరాన్‌ లో మతాధికారుల పట్టు, వారి ఆధ్వర్యంలో నడిచే రాజకీయ శక్తులు బలంగా ఉండడంతో ఏప్రిల్‌ 1979లో ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌ ఏర్పడింది. డిసెంబర్‌ 1979లో కొత్త రాజ్యాంగం ఉనికిలోకి వచ్చింది. షా కు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో పాల్గొన్న కమ్యూనిస్టులు, అభ్యుదయ వాదులు ఈ కొత్త రాజ్యాంగం వచ్చాక పక్కకు నెట్టివేయబడ్డారు. కొంత అణచివేత కూడా వారి మీద సాగింది. నిజానికి మార్చి 1979లో అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా హిజాబ్‌ కు వ్యతిరేకంగా నిరసనలు పెద్ద ఎత్తున జరిగాయి. ప్రభుత్వం కూడా వారి డిమాండ్లను అంగీకరించవలసి వచ్చింది. అయితే, మళ్ళీ 1983 నుంచీ హిజాబ్‌ పద్ధతిని చట్టబద్ధం చేశారు.

2. ఇరాన్‌ లో షా కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరగడానికి ముందే, పొరుగు ఇస్లామిక్‌ దేశాలలో కొన్ని చోట్ల ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. 1977లో పాకిస్తాన్‌ లో జియా ఉల్‌ హక్‌ సైనిక కుట్ర జరిగింది. ఆగస్టు 1978లో ఆఫ్ఘనిస్తాన్‌ లో సౌర్‌ విప్లవం జరిగింది. అక్టోబర్‌ 1978లో యెమెన్‌ లో యెమెనీ సోషలిస్టు పార్టీ ఏర్పడి పీపుల్స్‌ డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ యెమెన్‌ ను స్థాపించింది. సోవియట్‌ రష్యా కు సన్నిహితం కావడంతో యెమెన్‌ లో చీలిక వచ్చి ఉత్తర, దక్షిణ యెమెన్‌ లుగా 1979 ఫిబ్రవరి-మార్చి లో చీలింది. ఇరాక్‌ లో జులై 1979లో సద్దాం హుస్సేన్‌ అధికారం చేపట్టాడు. ఆసియా నైరుతి ప్రాంతం, మధ్య ఆసియా ప్రాంతంలో రాజకీయ మార్పులు అటు, ఇటు శరవేగంగా జరుగుతూ వచ్చాయి. పాకిస్తాన్‌, ఇరాక్‌ లలో వచ్చిన మార్పులు అమెరికాకు అనుకూలంగా ఉంటే…ఆఫ్ఘనిస్తాన్‌, యెమెన్‌, ఇరాన్‌ లలో వచ్చిన మార్పులు అమెరికా కు ప్రతికూలంగా ఉన్నాయి. అందుచేత అమెరికా ఈ మూడు దేశాలలో ఏర్పడిన ప్రభుత్వాలనూ కూలదోయడానికి కుట్రలకు పూనుకుంది.

3. అమెరికా, దాని గల్ఫ్‌ మిత్రులు ఇరాక్‌ ను ఎగదోసి ఇరాన్‌ పై యుద్ధానికి 1980 సెప్టెంబర్‌లో పురికొల్పాయి. ఆ యుద్ధం 1988 దాకా సాగింది. సోషలిస్టు రిపబ్లిక్‌ గా ఉన్న దక్షిణ యెమెన్‌ మీదకు ఉత్తర యెమెన్‌ ను రెచ్చగొట్టి ఆక్రమించుకోడానికి పురికొల్పాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్‌ లో పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ నేతలను, కార్యకర్తలను అంతం చేయడానికి ముజాహిదీన్‌ లను ప్రోత్సహించి వారికి ఆర్థిక, సాయుధ సంపత్తిని అమెరికా సమకూర్చింది. ఇరాన్‌, దక్షిణ యెమెన్‌ దేశాలు ఈ కుట్రలను తిప్పికొట్టే పనిలో పడి తమ సామాజిక కర్తవ్యాలను నెరవేర్చడంలో బాగా బలహీనపడ్డాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్‌ 18 సంవత్సరాలపాటు డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌గా కొనసాగినప్పటికీ, ఏకంగా 40 సంవత్సరాల పాటు దారుణంగా అంతర్యుద్ధంలో మునిగిపోయింది. దక్షిణ యెమెన్‌ 1990 వరకూ కమ్యూనిస్టుల ప్రభుత్వంగా ఉండగలిగింది. ఇరాక్‌ తో యుద్ధం 1988లో ముగిసిన తర్వాత ఇరాన్‌ తీవ్రమైన ఆంక్షలను తట్టుకుంటూ ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ గా కొనసాగుతోంది.

4. ఇరాన్‌ వరుసగా ఒక దాని వెంట ఒకటిగా సవాళ్ళను ఎదుర్కొంటోంది. అన్నింటికన్నా ప్రధానమైనది అమెరికా నుంచి. ఇరాక్‌ను ఉసిగొల్పి యుద్ధానికి కారణం అవడమే కాకుండా, ఇరాన్‌ లోని మాజీ రాజ వంశస్తులను బలపరుస్తూ మళ్ళీ వారికి అధికారం కట్టబెట్టాలన్న ప్రయత్నాలను అమెరికా బలపరుస్తూ వస్తోంది. ఇజ్రాయిల్‌ ద్వారా ఇరాన్‌ మీద ప్రత్యక్ష దాడులు జరపడం, విద్రోహ చర్యలకు పూనుకోవడం, శాస్త్రవిజ్ఞాన రంగంలో కీలక పాత్రలో ఉన్నవారిని, సైన్యంలో కీలకంగా ఉన్న అధికారులను అంతం చేసే కుట్రలు పన్నడం వంటివి చేసింది. 2020లో జనరల్‌ ఖాసిం సులేమాని, 2024లో సయ్యద్‌ హసన్‌ నస్రల్లాV్ా ఆ విధంగానే హత్య గావించబడ్డారు. ఇరాన్‌ లో స్థావరం ఏర్పరచుకుని పాలస్తీనా కు అండగా ఉన్న హిజ్బుల్లా ను అంతం చేయడం కోసం ఇరాన్‌ భూతలం మీద ఇజ్రాయిల్‌ దాడులు చేసింది. పొరుగునే ఉన్న సిరియాలో ప్రభుత్వాన్ని కూల్చి ఉగ్రవాద సంస్థ అయిన ఆల్‌-ఖైదా మాజీ నాయకుడిని సిరియా అధ్యక్షుడిగా నియమించింది.

షా ను గద్దె దింపిన తర్వాత అతడి కుమారుడు రెజా పహ్లవి యూరప్‌ లో ఆశ్రయం పొందాడు. తర్వాత అమెరికా అండ సంపాదించాడు. షా కు చెందిన గ్రూపు ఇరాన్‌ లో అధికారం ఎలాగైనా తిరిగి సంపాదించాలని ప్రయత్నిస్తూనే వుంది. 2009లో ఇరాన్‌ లో గ్రీన్‌ మూవ్‌మెంట్‌ లో అంతర్భాగమై ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న మహమ్మద్‌ అహ్మది నెజాద్‌ కు వ్యతిరేకంగా పని చేశారు. రెజా పహ్లవి ప్రస్తుతం లాస్‌ ఏంజెల్స్‌లో నివాసం ఉంటున్నాడు.

ఇరాన్‌ ప్రభుత్వం రిపబ్లిక్‌గా కొనసాగుతున్నప్పటికీ, అక్కడి ఆస్తిపర వర్గాలతో కొంతమేరకు రాజీపడి వ్యవహరించింది. 1989లో అయతుల్లా ఖొమేని మరణం తర్వాత ఇరాన్‌ ఐఎంఎఫ్‌ రుణం తీసుకుని వ్యవస్థీకృత సర్దుబాట్లకు పూనుకుంది. 1979 తర్వాత ఇస్లామిక్‌ చట్టాలకు కట్టుబడి సాంఘిక సంక్షేమ విధానాలను అమలు చేయడానికి ప్రయత్నించినప్పటికీ, క్రమంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగం అయింది. దానికి తోడు అమెరికా, యూరప్‌ దేశాలు విధించిన ఆంక్షలు మెజారిటీ ఇరానియన్ల పాలిట పెను శాపాలుగా మారాయి. అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలనుండి పొంచివున్న ప్రమాదం వలన ఇరాన్‌ సైనిక వ్యయాన్ని కూడా చాలా ఎక్కువ స్థాయిలో చేపట్టవలసి వచ్చింది. దాదాపు 25 శాతం జిడిపి మిలిటరీ వ్యయానికే ఖర్చవుతూ వచ్చింది. ఐఎంఎఫ్‌ ఆదేశించిన నయా ఉదారవాద విధానాలు కూడా తోడై ఇరాన్‌ ప్రభుత్వం ప్రజల నుండి పలుమార్లు నిరసనలను ఎదుర్కోవలసి వచ్చింది. 2017-18లో (ద్రవ్యోల్బణానికి, సబ్సిడీ కోతలకు వ్యతిరేకంగా), 2019లో (చమురు ధరల పెంపునకు వ్యతిరేకంగా) 2025లో (బేకరీల యజమానుల నిరసనలు) 2025-26 (మండిపోతున్న ధరలకు, రియాల్‌ పతనానికి వ్యతిరేకంగా) నిరసనలు జరుగుతూ వచ్చాయి.

5. అయితే, ఈ నిరసనలను తమకు అనుకూలంగా, ప్రభుత్వాన్ని కూలదోసే దిశగా మార్చడానికి ఇజ్రాయిల్‌, అమెరికా వాటిలో పెద్ద ఎత్తున కుట్రపూరితంగా జోక్యం చేసుకున్నాయి. రియాల్‌ విలువ డాలర్‌ తో పోల్చితే ఏకంగా 70 శాతానికి పైగా పడిపోయింది. ఆహార వస్తువుల ధరలు 60 శాతం పెరిగిపోయాయి. ప్రజల్లో, వ్యాపార వర్గాల్లో అసంతృప్తి విపరీతంగా పెరిగింది. అది నిరసనలకు, సమ్మెలకు దారి తీసింది. కాని అమెరికా, ఇజ్రాయిల్‌ గూఢచర్య విభాగాలు సిఐఎ, మొస్సాద్‌ ఏజంట్లు ఉద్యమాలలో చొరబడి శాంతియుత నిరసనలను కాస్తా విద్రోహ చర్యలుగా దిగజార్చాయి. పోలీసు, సైనికాధికారుల్లో 100 మందికి పైగా మరణించారు. పౌరులమీద కూడా బాగా దగ్గర నుంచి కాల్పులు జరిగాయి. ఈ అల్లర్లను రెచ్చగొట్టి ఇంటర్నెట్‌ ద్వారా ప్రచారం పెంచి ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు జరిగాయి. కాని ప్రభుత్వం ఆ కుట్రను ప్రస్తుతానికి తిప్పికొట్టగలిగింది. ట్రంప్‌ ముందస్తుగా ప్రకటించినట్టు టెహరాన్‌ మీద బాంబు దాడులు జరపడం లేదని, పౌరుల మరణాలు తగ్గిపోయాయని ప్రకటించి వెనక్కి తగ్గాడు.

6. ఇరాన్‌ లోని ప్రతిపక్షాలు కూడా రోడ్ల మీదకు వచ్చి ఆందోళనల్లో భాగం పంచుకున్నాయి. కాని వాటంతట అవే అధికారాన్ని చేజిక్కించుకోగల శక్తి సామర్ధ్యాలు వాటికి లేవు. జరుగుతున్న ఆందోళనలన్నీ తన పనుపునే జరుగుతున్నట్టు షా కుమారుడు రెజా పహ్లవి ప్రకటించుకుంటున్నాడు. ఇందోళనలు పూర్తిగా చప్పబడిపోకముందే అమెరికా, ఇజ్రాయిల్‌ టెహ్రాన్‌ మీద దాడులకు దిగే అవకాశాలు లేకపోలేదు.

ఇరాన్‌ ప్రజలు తమ దేశం మీద ఎవరు దాడి చేసినా హర్షించే పరిస్థితి లేదు. కాని వారి తక్షణ మనుగడకు సంబంధించిన సమస్యల తీవ్రత వారిని ప్రధానంగా వెన్నాడుతోంది. దాని నుండి ఉపశమనం పొందాలంటే ఇరాన్‌ మీద విధించిన ఆంక్షలను ఉపసంహరించడం వెంటనే జరగాలి. అంటే ఇరానియన్లకు ఉపశమనం కలిగేది అమెరికా చేసే బాంబు దాడుల వలన కాదు. అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేయడం ద్వారా వారికి ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు అదే మూడవ ప్రపంచ దేశ ప్రజలందరూ డిమాండ్‌ చేయాలి.

వ్యాసకర్త : విజయ్ ప్రసాద్‌, ‘లెఫ్ట్‌వర్డ్‌ బుక్స్‌’ సంపాదకులు