Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogమన దేశ ప్రాచిన నాగరికతలలో మనుషులు ప్రకృతితో నే బతికారు

మన దేశ ప్రాచిన నాగరికతలలో మనుషులు ప్రకృతితో నే బతికారు

మనదేశ ప్రాచీన నాగరికతలలో మనుషులు ప్రకృతితోనే బతికారు. అడవులు ఎక్కువ, గ్రామాలు చిన్నవి, జీవితం సూటిగా ఉండేది.

వర్షం పడితే ఆనందం, పడకపోతే ఆకలి. నీరు ఉంటే జీవితం, లేకపోతే వలస.

ఆ రోజుల్లో మనుషులు ప్రకృతిని జయించాలనుకోలేదు. ప్రకృతితో కలిసి బతకడం నేర్చుకున్నారు. అందుకే వారు భూమిని గమనించారు, నీటిని గమనించారు, జంతువులను గమనించారు.

భూమిలో దాగి ఉండే ఒక జీవి వాళ్లకు చాలా కీలకంగా కనిపించింది..అదే పాము.

పాము భూమిలోనే నివసిస్తుంది. పొలాల అంచుల్లో ఉంటుంది. బావులు, చెరువుల దగ్గరే కనిపిస్తుంది.

ఇది యాదృచ్ఛికం కాదు.

ఆ రోజుల్లో పొలాలను నాశనం చేసిన ప్రధాన శత్రువు

ఎలుకలు, మూషికాలు, చిన్న జంతువులు.

వాటివల్ల విత్తనాలు నాశనం, ధాన్యం నష్టం, పంట కోత.

పాము ఎలుకలను తింటుంది. పొలాల్లో ఎలుకల సంఖ్య తగ్గితే పంట నష్టం తగ్గుతుంది.

అంటే పాము నేరుగా మనిషి ఆహార భద్రతకు ఉపయోగపడింది.

ఇది మొదటి మేలు.

రెండో మేలు నీటితో సంబంధం.

పాములు ఎక్కువగా నీటి వనరుల దగ్గరే ఉంటాయి.

పాము కనిపిస్తే అక్కడ నీరు ఉందని అర్థం.

ఎండాకాలంలో ఇది మనుషులకు చాలా కీలక సూచన.

నీరు ఉన్న చోట జీవితం ఉంటుంది. నీరు ఉన్న చోట గ్రామం నిలబడుతుంది.

మూడో మేలు భూమితో సంబంధం.

పాము భూమిలో దాగి ఉంటుంది. భూమిలో గోతులు, రంధ్రాలు చేస్తుంది. దీంతో భూమి గట్టిగా మారకుండా ఉంటుంది. నీరు లోపలికి చేరుతుంది. భూమి సారవంతంగా ఉంటుంది.

అంటే పాము పంటకు, నీటికి, భూమికి మూడు విధాలుగా ఉపయోగపడిన జీవి.

ఇవి భక్తితో కనిపెట్టిన విషయాలు కాదు.

ప్రతిరోజూ చూసి అర్థం చేసుకున్న అనుభవాలు.

అందుకే పాము మనిషికి శత్రువు కాలేదు.

పాము ఒక హెచ్చరిక కూడా.

పామును చంపితే ఎలుకలు పెరుగుతాయి. పంట నాశనం అవుతుంది. నీటి సమతుల్యత దెబ్బతింటుంది.

ఇది తెలిసిన మనుషులు పామును చంపలేదు.

దూరం పెట్టలేదు. దానికి చోటు ఇచ్చారు.

చెరువుల దగ్గర, బావుల దగ్గర, పెద్ద చెట్ల కింద

ఒక రాయి ఉంచారు.

ఆ రాయి మీద సున్నంతో ఒక సాదా పాము గుర్తు వేశారు.

అది దేవాలయం కాదు. విగ్రహం కాదు. ఒక గుర్తు మాత్రమే.

ఆ గుర్తు అర్థం ఇది.

ఇక్కడ పాములు ఉంటాయి. ఇక్కడ నీరు ఉంది. ఇక్కడ జీవితం ఉంది. ఇక్కడ నాశనం చేయకూడదు.

వర్షాలు బాగా పడితే నీరు నిలిచితే పంట పండితే మనుషులు ఆ రాయి దగ్గర ఆగేవారు.

పాలు పోసేవారు. నీళ్లు పోసేవారు. పువ్వులు పెట్టేవారు.

ఇది దేవుడిని కోరడం కాదు. పాము వల్ల జీవితం సాగిందని గుర్తు పెట్టుకోవడం.

భూమి సారవంతంగా ఉంటే పంట పండుతుంది.

పంట పండితే జీవితం సాగుతుంది.

ఈ భావన నుంచే భూమి, వర్షం, సంతానం అన్నీ ఒకటిగా చూశారు.

అందుకే పిల్లలు లేని వారు భూమిని తాకారు.

ఆ రాయిని తాకారు. భూమిలాగే జీవితం కూడా పండాలని కోరుకున్నారు.

ఇది పాము కాటుకు భయపడి చేసిన పని కాదు.

ఇది మూఢనమ్మకం కాదు.

ఇది మనిషి తన జీవనానికి ఉపయోగపడిన జీవిని

గౌరవించిన జ్ఞానం.

కాలం గడిచింది..గ్రామాల చుట్టూ రాజ్యాలు ఏర్పడ్డాయి. వ్యవసాయం పెరిగింది. నగరాలు వచ్చాయి. వ్యాపారం పెరిగింది.

ప్రజల జీవనంలో ఉన్న పాత సంస్కృతులు అలాగే ఉండలేదు. వాటిని కొత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం మొదలైంది.

ఇప్పటివరకు ప్రజల జీవనంలో ఉన్న నాగులు

ఇప్పుడు సాహిత్యంలోకి రావడం మొదలయ్యాయి.

బౌద్ధ ధర్మం పుట్టినప్పుడు అది దేవతల గురించి మాట్లాడలేదు.

ప్రకృతి, బాధ, విముక్తి, కరుణ గురించే మాట్లాడింది.

కానీ బౌద్ధం ప్రజల్లోకి వెళ్లాలంటే ప్రజలకు తెలిసిన భాషలోనే వెళ్లాలి. ప్రజలకు తెలిసిన ప్రతీకలతోనే మాట్లాడాలి.

అప్పటికే ప్రజల జీవనంలో ఉన్న నాగ సంస్కృతి

బౌద్ధ సాహిత్యంలోకి ప్రవేశించింది.

బౌద్ధ గ్రంథాల్లో నాగులు దేవతలుగా కాదు. సృష్టికర్తలుగా కాదు.

వారు నీటి లోకంలో నివసించే జీవులు బుద్ధ ధర్మాన్ని గౌరవించే శక్తులు బుద్ధుడిని రక్షించే ప్రకృతి ప్రతీకలు.

బుద్ధుడు ధ్యానంలో ఉన్నప్పుడు వర్షం పడితే నాగుడు అతన్ని కాపాడతాడు అనే కథ ఇక్కడే వస్తుంది.

ఈ కథ అర్థం స్పష్టమే. ధ్యానం, ప్రకృతి, సమతుల్యత ఒకదానికొకటి శత్రువులు కావు.

ఇది పాత నాగ సంస్కృతిని బౌద్ధ ధర్మంతో కలిపి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పిన విధానం.

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది.

బౌద్ధంలో నాగులు ఎప్పుడూ సర్వశక్తిమంతులుగా మారలేదు. వారు ధర్మానికి లోబడి ఉన్నారు. బుద్ధుడి కంటే ఎత్తులో లేరు.

ఇది సాహిత్య నేపథ్యం.

ఇది ప్రజల విశ్వాసాన్ని ధర్మంలోకి తీసుకువచ్చిన విధానం. ఇది రాజకీయ లేదా మతాధిపత్య ప్రక్రియ కాదు.

తరువాత మరో మార్పు జరిగింది.

బౌద్ధం బలహీనపడిన తరువాత కొత్త మతవ్యవస్థలు బలపడిన తరువాత ప్రజల పాత సంస్కృతులను తమలో కలుపుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

ఇక్కడే నాగులు మరోసారి మారాయి.

ఇప్పుడు నాగులు ప్రకృతి ప్రతీకలుగా కాదు. గ్రామీణ గుర్తులుగా కాదు.

వారు పౌరాణిక కథల్లో పాత్రలయ్యారు. దేవతల సేవకులయ్యారు. కొన్ని చోట్ల దేవతలుగానే మారిపోయారు.

ఈ మార్పుకు పురావస్తు ఆధారాలు లేవు. శిల్పాల ద్వారా జరిగిన అకస్మాత్తు పరిణామం కాదు.

ఇది పూర్తిగా సాహిత్య ప్రక్రియ. పురాణాలు, ఇతిహాసాలు, కథల ద్వారా జరిగిన మార్పు.

గ్రామాల్లో ఉన్న నాగ రాయిని పౌరాణిక కథతో కప్పేశారు. నాగుడిని దేవతకు బంధించారు.

ప్రజల ప్రకృతి జ్ఞానాన్ని భక్తి కథగా మార్చేశారు.

ఇక్కడ చరిత్ర చెప్పేది ఒక్కటే.

నాగులు మొదట ప్రజల జీవన అనుభవం.

తర్వాత బౌద్ధంలో ధర్మానికి లోబడి ఉన్న ప్రకృతి శక్తి.

ఆ తర్వాత పౌరాణిక సాహిత్యంలో దేవతా వ్యవస్థలో భాగం.

ఇది ఒక్క రోజులో జరిగిన మార్పు కాదు.

వందల సంవత్సరాల పాటు జరిగిన సాహిత్య మార్పు.

రాజకీయ, మతపరమైన అవసరాల వల్ల జరిగిన మార్పు.

అందుకే నాగ సంస్కృతి గురించి మాట్లాడేటప్పుడు

ఒక్క మతానికి చెందినదిగా చూడకూడదు.

ఒక్క కథకే పరిమితం చేయకూడదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments