Neti Satyam
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 6:32 pm Editor : Admin

చట్ట ప్రకారం ఎన్నికలు జరగాలి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

చట్టం ప్రకారం ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ బి.శివధర్ రెడ్డి.

హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికలను చట్టం ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ శ్రీ బి.శివధర్ రెడ్డి పోలీస్ అధికారులతో అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల పోలీస్ కమీషనర్లు , జిల్లాల ఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్హెచ్ఓ) లతో మాట్లాడారు.

రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్తగూడెం, కరీంనగర్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నిజామాబాద్, నల్గొండ, రామగుండం కార్పొరేషన్ల పరిధిలోని 414 వార్డులతో పాటు, 116 మున్సిపాలిటీల్లోని 2582 వార్డుల్లో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఈనెల 11వ తేదీన పోలింగ్, 13 తేదీన కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర పోలీస్ శాఖకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని డిజిపి సూచించారు. ఏ రకమైన ఫిర్యాదులు గాని ,అవాంఛనీయ సంఘటనలు గాని జరగకుండా చర్యలు తీసుకోవాలని డిజిపి స్పష్టం చేశారు. నిబంధనల మేరకు కఠినంగా వ్యవహరించాలని డిజిపి పోలీస్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పోలీస్ లీగల్ అడ్వైజర్ శ్రీ రాములు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టాల గురించి సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….చట్టం ప్రకారం ఓటర్లను ప్రభావితం చేయడం, ఒకరికే ఓటు వేయాలని ఒత్తిడి తీసుకురావడం లేదా నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని, బాధితులపై సామాజికంగా లేదా ఆర్థికంగా బహిష్కరణలు విధిస్తే చట్టరీత్యా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేలా మద్యం పంపిణీ చేసినా, ఎక్సైజ్ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా కనీసం ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందనీ ,ఆయుధాల చట్టం ప్రకారం లైసెన్స్‌డ్ ఆయుధాలను కలిగి ఉన్న వారు నిబంధనల మేరకు పోలీస్ స్టేషన్లలో జమ చేయాలని, లేనిపక్షంలో ఒక ఏడాది నుంచి మూడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించాలని నిబంధనలు ఉన్నాయన్నారు.

మరోవైపు ఎన్నికల ప్రచార పర్వంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అనుసరించాల్సిన నిబంధనల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు. బహిరంగ ప్రదేశాల డిస్ఫిగర్మెంట్ చట్టం-1997ను అనుసరించి ఎవరైనా అనుమతి లేకుండా గోడలపై పోస్టర్లు అంటించినా, అశ్లీల ప్రకటనలు ప్రదర్శించినా వాటిని తొలగించడమే కాకుండా సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చని, ధ్వని కాలుష్యాన్ని నియంత్రించేందుకు టౌన్ న్యూసెన్స్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సి ఉందన్నారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు వాడటం చట్టరీత్యా నేరం. ప్రచార వాహనాల విషయంలోనూ మోటార్ వాహనాల చట్టం-1988 కింద అనేక ఆంక్షలు అమల్లో ఉన్నాయనీ, ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే వాహనాలకు రిటర్నింగ్ అధికారి నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని, ఆ అనుమతి పత్రం యొక్క ఒరిజినల్ కాపీని వాహనం ముందు భాగంలో ప్రదర్శించాలన్నారు.

మతపరమైన సంస్థలు, ప్రార్థనా మందిరాలను రాజకీయ ప్రయోజనాల కోసం, పార్టీ ప్రచారాల కోసం వాడుకోవడం మతపరమైన సంస్థల దుర్వినియోగ నిరోధక చట్టం-1988 ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందనీ, ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ కులమతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రవర్తించే వారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు.బహిరంగ సభలు, ఊరేగింపుల నిర్వహణలో జిల్లా పోలీస్ చట్టం ప్రకారం ముందస్తు లైసెన్సులు పొందాలని, పోలీసుల సూచనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజా జీవనానికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.వీటితో పాటు తెలంగాణ మున్సిపాలిటీల చట్టం-2019 ప్రకారం ఎన్నికల విధులకు ఆటంకం కలిగించినా, రిగ్గింగ్ వంటి అక్రమాలకు పాల్పడినా శిక్షార్హులన్నారు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల పోలీస్ కమీషనర్లు, ఎస్పీలు , స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, శాంతి భద్రతల ఎఐజి శ్రీ రమణ కుమార్, తదితరులు వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.