పాగాలంకరణ
లింగోద్భవకాల మహారుద్రాభిషేకం ప్రారంభమైన వెంటనే పాగాలంకరణ ప్రారంభించబడుతుంది. బ్రహ్మోత్సవాలలో జరిగే ఈ పాగాలంకరణకు ఎంతో ప్రత్యేకత ఉంది. మన వివాహాలలో పెండ్లికుమారునికి తలపాగ చుట్టడం ఒక సంప్రదాయం. ఈ ఆచారమే శ్రీశైల ఆలయంలో పాగాలంకరణ పేరతో ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ పాగా స్వామివారి గర్భాలయ విమాన శిఖరం నుండి ముఖమండపంపై ఉండే నందులను అనుసంధానం చేస్తూ అలంకరించబడుతుంది. పాగాలను సమర్పించే భక్తులు నియమంతో భక్తిని మేళవించి సంవత్సరంలో 365 మూరల పొడవుతో ఈ పాగాను నేస్తారు. ఈ పాగాలను అలంకరించే వ్యక్తి దిగంబరుడై పాగాను అలంకరిస్తాడు. దిగంబరుడై పాగాను అలంకరించవలసి ఉన్నందున పాగాలంకరణ సమయంలో ఆలయంలో విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తారు. చిమ్మచీకటిలో పాగాలంకరణ చేయడం ఎంతో నేర్పుతో కూడుకొన్న పని. యథావిధిగా రాత్రి గం.10.00ల నుండి ప్రకాశం జిల్లా, చీరాల మండలం, హస్తినాపుర గ్రామానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు గారి తనయుడు పృథ్వీ సుబ్బారావు స్వయంగా తెచ్చిన పాగాతో పాటు ఇతర భక్తులు సమర్పించిన పాగాలను కూడా స్వామివారికి అలంకరిస్తాడు.