ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని పునఃపరిశీలించాలి; మాలలకు జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో చర్చించాలి – మాల సంఘాల జేఏసీ డిమాండ్.
నేటి సత్యం హైదరాబాద్ (బషీర్‌బాగ్), ఫిబ్రవరి 21:
ఈరోజు బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో మాల సంఘాల జేఏసీ మరియు మాల స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడమైనది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు తీరు వల్ల మాల సామాజిక వర్గం తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాన డిమాండ్లు మరియు విమర్శలు:
నిరుద్యోగులకు అన్యాయం: గత 10 నెలల్లో వెలువడిన 9 ఉద్యోగ మరియు అడ్మిషన్ నోటిఫికేషన్లలో మాల సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ వర్గీకరణ చట్టం మాలల విద్య, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తోంది.
క్యాబినెట్ సమావేశంలో చర్చించాలి: ఈనెల 23వ తేదీన జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ చట్టంపై ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలి.
అసెంబ్లీలో ప్రశ్నించాలి: రాబోయే బడ్జెట్ సమావేశాల్లో మాలలకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరుతున్నాం.
రిజర్వేషన్ల సవరణ: రోస్టర్ పాయింట్లను పునఃసమీక్షించి, న్యాయంగా రావాల్సిన మరో 2 శాతం రిజర్వేషన్లను మాలలకు కేటాయించి కొత్త సవరణ చట్టాన్ని తీసుకురావాలి.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల సామాజిక వర్గ నాయకులు – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరియు ఇతర మాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తక్షణమే ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం.
“ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే, తెలంగాణలో మాల విద్యార్థులు, నిరుద్యోగులు మరియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. ‘మాలల పంతం – కాంగ్రెస్ అంతం’ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధమవుతాం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తాం.”
ప్రజాస్వామ్యయుతంగా తమ హక్కుల కోసం పోరాడుతున్న మాలల పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాల సామాజిక వర్గానికి న్యాయం చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.