Neti Satyam
Newspaper Banner
Date of Publish : 28 February 2026, 9:58 am Editor : Admin

లబ్ధిదారుల స్వప్నం నెరవేరిన రోజు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

లబ్ధిదారులా స్వప్నం నెలవేరిన రోజు…!

*డబల్ బెడ్ రూమ్ లు లబ్ధిదారులకు అప్పచెప్పిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..*

షాద్ నగర్, నేటిసత్యం, ఫిబ్రవరి, 28 :: రంగారెడ్డి జిల్లా, షాద్నగర్ ఎదురుచూసిన స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది.. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులైన లబ్ధిదారుల చేతికి అందింది..షాద్ నగర్ మున్సిపాలిటీ సమావేశ మందిరంలో శనివారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురైంది. మార్చి మొదటి వారంలో పట్టాలు అందజేస్తామని, లబ్ధిదారులను గృహప్రవేశం చేయిస్తానని ఇటీవలే మీడియా ముందు మాట ఇచ్చిన ఎమ్మెల్యే మార్చి నెల ప్రారంభానికి ఒకరోజు ముందే ఇళ్ల పట్టాలను లాంఛనంగా అందజేశారు. తొలివిడతగా లబ్ధిదారులకు 1,200 ఇళ్లను అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. పట్టణంలోని 28 వార్డుల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేశారు. అన్ని వార్డులలో ఎమ్మెల్యే శంకర్ చేతులమీదుగా కొంతమందికి లాంఛనంగా ఇళ్ల పట్టాలు ఇప్పించారు. మున్సిపాలిటీ చైర్మన్ అగ్గునూరు బస్వం, వైస్ చైర్మన్ అందే మోహన్, ఆర్డీవో సరిత, తహసిల్దార్ నాగయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డిలతో పాటు అన్ని వార్డులకు చెందిన కౌన్సిలర్ల సమక్షంలో ఈ ఇళ్ల పట్టాలను అందించారు. ఇళ్లలో అన్ని సదుపాయాలు కల్పించామని, ఎలాంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారులు గృహప్రవేశం చేయవచ్చని వెల్లడించారు. ఎక్కడ మంజూరైన వెళ్లాలని, ఒకవేళ అర్హులు ఎవరికైనా ఇల్లు రాకపోతే వారికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పెద్ద ఎత్తున లబ్ధిదారులు ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. కౌన్సిలర్లు సర్వర్ పాషా, నడికూడ శ్రావణి, వోగ్గు జయలక్ష్మి, పెంటయ్య, రాజు నాయక్, స్థానిక నాయకులు అగనూరు విశ్వం, చెంది తిరుపతిరెడ్డి, సుజీవన్, దంగు శ్రీనివాస్, అగ్గనూరు నందు, ఇబ్రాహీం, జమాల్పూర్ చందు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

*సదుపాయాల కోసమే జాప్యం..     *ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..*

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయినప్పటికీ అక్కడ పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించే ఉద్దేశంతోనే లబ్ధిదారులకు ఇళ్లను అందించే విషయంలో జాప్యం జరిగిందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అప్పటికప్పుడు ఇల్లు అందజేయకపోవడం, మా ప్రభుత్వ హయాంలో కూడా సదుపాయాలకు నిధులు సేకరించే క్రమంలో జాపకం జరగడం వల్ల ఇళ్ల తలుపులు ఊడిపోయి, కిటికీల అద్దాలు పగిలిపోయి ఇబ్బందులు ఏర్పడ్డాయి అన్నారు. అదేవిధంగా అక్కడ కాలువలు ఏర్పాటు, విద్యుత్ ఏర్పాటు, తాగునీటి సదుపాయం వంటివి కూడా కల్పించవలసిన అవసరం ఏర్పడిందన్నారు. ప్రస్తుతం ఎనిమిది కోట్ల నిధులతో వాటన్నింటిని పూర్తి చేయడం జరిగిందని స్పష్టం చేశారు. కౌన్సిలర్లు పార్టీలకు అతీతంగా దగ్గర ఉండి లబ్ధిదారులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువెళ్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గృహాలు అందించే విషయంలో పారదర్శకంగా ముందుకు వెళ్లామని స్పష్టం చేశారు. ప్రస్తుతం 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇంకా అర్హులకు ఇవ్వాల్సి ఉందని, ఇందిరమ్మ ఇల్లు అందని వారికి అందించే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు..