(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ప్రస్తుతం ప్రపంచంలో భయానక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారతదేశం తటస్థ వైఖరి కాకుండా ఆపరిస్థితులు అదుపు చేసేందుకు జరిగే కృషికి నాయకత్వం వహించాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమీషన్ చైర్మన్ కె. నారాయణ
నేటి సత్యం గుంటూరు మార్చి 3
ప్రధాని మోదీకి సూచించారు. ఇరాన్లో పాలన మార్పు అంటూ చేపట్టిన సైనిక దాడులను, దురాక్రమణను నిలువరించేందుకు తక్షణమే అమెరికా-ఇజ్రాయిల్తో భారత్ సంప్రదింపులు జరపాలన్నారు. దేశ ప్రజలు ఎన్నుకున్న నాయకత్వాన్ని దించాలని చూడటం అత్యంత దుర్మార్గపు చర్య అని, ప్రపంచ ప్రజాస్వామ్యం బలిపశువు అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు మల్లయ్యలింగంభవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం ఇరాన్పై దాడులు సమర్థనీయం కాదన్నారు. కుటుంబాలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడటం శోచనీయమని అన్నారు. ఈ చర్యల కారణంగా కొన్ని దేశాలు ఇరాన్కు మద్దతుగా… మరికొన్ని దేశాలు అమెరికాకు మద్దతుగా చీలి మూడవ ప్రపంచ యుద్ధంగా మారునుందా అనే భయాందోళన నెలకొందని అన్నారు. తక్షణమే మోదీ… ట్రంప్తో మాట్లాడి ఈ చర్యలను నిలుపుదల చేయించాలన్నారు. ఎవరు ఆరంభించారో వారే యుద్ధానికి ముగింపు పలకాలని హితవుపలికారు. లేకుంటే ప్రతీకార దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్-అమెరికా-ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న యుధ్ధ ప్రభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రెటోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని, ఈ ప్రభావం నిత్యావసర సరుకులపై కూడా పడుతుందని నారాయణ చెప్పారు. బ్రిటన్ తో పాటు పలు దేశాలు ఈ దాడులలో పాల్గొనబోమని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అకస్మాత్తుగా జరిగిన పరిణామాలతో లక్షలాది మంది భారత సంతతి గల్ఫ్ దేశాలలో ఇరుక్కుపోయారని, వారిని స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు.
పావర్టీ ఫ్రీ ఇండియాగా ప్రకటించండి:
నక్స్ట్ను అంతమొందించవచ్చు కానీ నక్సలిజానికి అంతం ఉండదని నారాయణ అన్నారు. నక్సలిజానికి ఒక ఫిలాసఫీ ఉందని, దానిని సమాధి చేసిన మరలా విప్లవం మొలుస్తుందని స్పష్టం చేశారు. సమస్య ఉన్నంత కాలం నక్సలిజం ఉంటుందని చెప్పారు. నయా హిట్లర్ అమిత్ షా భారతదేశాన్ని ‘నక్సల్ ఫ్రీ ఇండియా’గా చేస్తామని చెబుతున్నారని, ‘పావర్టీ ఫ్రీ ఇండియా’ చేస్తే నక్సలిజం ఉండదనే విషయాన్ని ఆయన తెలుసుకోవాలని నారాయణ అన్నారు. ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పజెప్పేందుకు ఆపరేషన్ కగర్ చేపట్టారని విమర్శించారు. కేంద్ర పెద్దలు సంబరపడాల్సిన అవసరం లేదని, శ్రీలంక, బంగ్లాదేశలలో ప్రజలే తిరుగుబాటు చేశారని, అలాంటి పరిస్థితి భారతదేశంలో రాకుండా ఉండాలంటే ప్రావర్టీ ఫ్రీ ఇండియా చేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.
ధార్మిక సంస్థల్లో ఆ సంస్కృతి మారాలి:
ధార్మిక సంస్థల్లో కాంట్రాక్టర్లు, కార్పొరేట్లు, అవినీతి రాజకీయ నాయకులను నియమించే సంస్కృతి మారాల్సిన అవసరం ఉందని నారాయణ అన్నారు. వీరిని చైర్మన్లుగా నియమించడం వలన దేవుడి పేరుతో వ్యాపారం చేసే అవకాశాలు ఉంటాయని ఆరోపించారు. వీరు చేసే క్రియలతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పారు.
ఐఏఎస్, ఐపీఎస్ లు లక్ష్మణరేఖ దాటవద్దు:
ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థలు సమాజంలో చాలా గౌరప్రదమైన వ్యవస్థలని, ఈ హోదాల్లో విధులు నిర్వర్తించే అధికారులు చట్టం గీసిన లక్ష్మణరేఖ దాటకుండా నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని నారాయణ కోరారు. కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ల ప్రవర్తన వ్యవస్థలను అవమానపరిచేలా ఉండటం శోచనీయమని అన్నారు. రాజకీయ నాయకులు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటారని, కానీ మీరు సుదీర్ఘకాలం ప్రజా సేవలో ఉంటూ వ్యవస్థలను గాడిన పెట్టే బాధ్యతలను కలిగి ఉంటారని చెప్పారు. ఆ బాధ్యతలను విస్మరిస్తే అభాసుపాలౌతారని అన్నారు. ఇందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ ఘటనను ఉ దహరించారు.
నిద్రావస్థలో వ్యవస్థలు:
కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్లు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఉన్నాయని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాకినాడలో జరిగిన పేలుడు ఘటన, రాజమండ్రిలో చోటుచేసుకున్న పాల కల్తీ వ్యవహారంపై ఆయన ఆగ్రహం గ్రహం వ్యక్తం చేశారు. లేబర్ చట్టాలు ఏమయ్యాయని, అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. నిఘా కొరవడిందని, ఆరోగ్య వ్యవస్థ పడకేసిందన్నారు. ఘటనలు జరిగిన ప్రాంతాలలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పర్యటించి బాధితులను పరామర్శించారని గుర్తుచేశారు. కేవలం ఎక్స్ గ్రేషియా ఇస్తే సరిపోతుందా అంటూ నారాయణ నిలదీశారు. వ్యవస్థలు సరిగా పనిచేసి ఉంటే ఇటువంటి ఘటనలు జరిగి ఉండేవి కాదని అన్నారు.
మధ్యవర్తిత్వంతో అగ్రి బాధితులకు న్యాయం:
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడానికి మధ్యవర్తిత్వం సులువైన మార్గమని సాక్షాత్తు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ దిశగా సత్వరమే చర్యలు చేపట్టాలని నారాయణ డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ సంస్థకు రూ.20 వేల కోట్లు ఆస్తులు ఉన్నాయని, ఆయా ఆస్తులను అటాచ్మెంట్ చేసి రూ.2 వేల కోట్లు కేటాయించి 32 లక్షల కుటుంబాలకు న్యాయం చేయాలని సీపీఐ ఎప్పటినుంచో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ అగ్రిగోల్డ్ బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు సీపీఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు. ఆమరణ దీక్షలకు కూడా వారు సిద్ధమయ్యారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వారికి న్యాయం చేసి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని సూచించారు.