🔥 అఘోరి శపథం 🔥
================
కటిక చీకట్లు కమ్ముకుని.. లోకమంతా భయంతో నిదురిస్తున్న వేళ,
బతికున్న ఏ ప్రాణీ అడుగుపెట్టని వల్లకాడు .. అఘోరి నడిచేటి నేల!
మేనిపై చితి భస్మం.. ఆ మరుభూమి అంతా ఎంతో మౌనం,
దుర్మార్గులు రువ్విన చీకట్ల నుంచే జరుగుతుంది మా జననం!
శవాల మధ్యనుండే సాగుతుంది మా రాత్రి పయనం,
సాక్షాత్తూ మృత్యువు శ్వాసకే ఎదురెళ్లినా.. మా గుండెల్లో పుట్టదు భయం!
సృష్టి గతి తప్పకుండా కాపాడటమే మా విధానం,
భస్మం సాక్షిగా, అగ్ని సాక్షిగా అఘోరి చేసిన ప్రమాణం!
పాపాత్ములు రహస్యాలను పాతరేసే చీకటి గుహలో,
ఒక్క మౌన ముద్రతో వాళ్ళ నీడలనే బంధిస్తాం మా వలలో!
కాలుతున్న కాటి బూడిదలో మా యంత్రాలను గీస్తాము,
నిశ్శబ్దంగా అగోచర మంత్రాలను సర్పాల్లా అక్కడే వదులుతాము!
ఆ పవిత్ర బంధనంలో దోషులు ఖైదీలుగా మిగిలిపోతారు,
తమ పాపాల చీకటి వలయంలో వారే బందీలవుతారు!
మంటల్లో పడ్డ సర్పాల్లా మీ ఆలోచనలు మెలికలు తిరుగుతాయి,
వదిలించుకుందాం అనుకున్న మీ కర్మలే మిమ్మల్ని వెంటాడతాయి!
మీరు దాచిన ప్రతి అబద్ధం, మీరు చేసిన ప్రతి పాపం,
ఎదురీదలేని ప్రళయమై మీపై చూపిస్తుంది తన కోపం!
ఆత్మలు గుసగుసలాడుతూ పిలిచే అగోచర లోకాల్లో,
మా సంచారం.. భ్రమలన్నీ భస్మమైపోయే రుద్రభూముల్లో!
రాత్రి ఎప్పుడైతే తెరుస్తుందో తన ప్రాచీన ద్వారం,
ముందు ధర్మం నడవగా.. వెనుకే సాగును అఘోరి సంచారం!
జ్వలించే అగ్ని సాక్షిగా అఘోరి పూనిన ఈ దీక్ష,
ఎవరూ పలకడానికి సాహసించని ఆ విశ్వ ధర్మానికే మేమే రక్ష!
చీకటి పురుడుపోసుకునే.. పాపులు దాగే చోటు,
వాళ్ల ఆత్మలు వణికేలా వేస్తాం సత్యపు కాటు!
నిశ్శబ్దంగా సంచరిస్తూ, చీకటి మాటున అన్నీ గమనిస్తాం,
ఈ గుడ్డి లోకం చూడనట్లు నటించే నిజాలను బట్టబయలు చేస్తాం!
సమీపించినప్పుడు అంతిమ తీర్పు గడియలు,
అఘోరి ఎదురుపడగానే.. పాపుల గుండెల్లో మొదలవుతాయి భయపు దడలు!
పగలైనా, నిశీధైనా.. ఏదీ మమ్మల్ని ఆపలేదు,
ధర్మం గెలిచి, కార్యం పూర్తయ్యే దాకా.. మాకెలాంటి విశ్రాంతి లేదు!
– దుర్గ