(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం మార్చి 30
శ్రీరామనవమికి ఎస్సీలను అవమానపరచడం అనాగరికం.
సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్. మూడు చింతల పల్లి మండలం అత్రాస్ పల్లి గ్రామంలో శ్రీరామనవమి రోజున రామాలయం దగ్గర ఎస్సీ మహిళలు కొబ్బరికాయలు కొడుతుంటే కులం తక్కువ వారని కొబ్బరికాయలు కొట్టొద్దని కొంతమంది మహిళలు కులం పేరుతో దూషించడం మరియు అన్నదానం చేసే సమయంలో ఎస్సీ కులస్తులు తక్కువ స్థాయి వాళ్ళు వడ్డించడమేందని ప్రశ్నించి అవమానపరచడం నాగరిక సమాజంలో అనాగరికమైన సంఘటన అని *సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ మరియు దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కే ఏసురత్నం* గార్లు అన్నారు.
ఈ సంఘటనను తెలుసుకొని నేడు సిపిఐ మరియు దళిత హక్కుల పోరాట సమితి నాయకులు ఆ గ్రామాన్ని సందర్శించి సంఘటన వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడి గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో దేవాలయానికి అన్ని కులాలతో సమానంగా పూజారికి మేము కూడా జీతాలను ఇస్తున్నామని, అన్ని పండుగలు సందర్భంలో జరిగే ఖర్చులను గ్రామంలోని ప్రతి కులం వారు సమానంగా ఖర్చు పెడుతున్నారని అదేవిధంగా తాము చందాలు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. పండుగల సందర్భంగా చందాలను సమానంగా వసూలు చేస్తున్నప్పటికీ కులం తక్కువ అనే వ్యత్యాసం గతం నుంచి జరుగుతూనే ఉన్నదని కొంతమంది మహిళలు రెచ్చగొట్టి మమ్మల్ని అవమాన పరుస్తున్నారని మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని సిపిఐ మరియు దళిత కుల పోరాట సమితి బృందానికి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆరోజు జరిగిన సంఘటన వివరించి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ జరిగిందే తప్ప ఇంకా ఏలాంటి విచారణ జరగలేదని ఇప్పటికైనా విచారణ జరిపి ఆ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది. పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు వెంటనే గ్రామాన్ని సందర్శించి తప్పు చేసిన వారిని శిక్షించి మరోసారి ఇలాంటి సంఘటన జరగకుండా సమావేశాలు నిర్వహించి అందరూ సమానంగా బతికే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒకవేళ స్థానిక అధికారులు స్పందించకపోతే రానున్న రోజుల్లో జిల్లా కలెక్టర్కు ఎస్సీ కమిషన్ వారిని కూడా సంప్రదించి నిందితులపైన కఠిన శిక్షలు పడేలా చేస్తామని అన్నారు.
ఈ సందర్భంగా సిపిఐ మరియు దళిత హక్కుల నాయకులు మాట్లాడుతూ గ్రామస్తులు చేసే న్యాయమైన పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ అంశాన్ని సిపిఐ శాసనసభ్యులు కోణంనేని సాంబశివరావు గారు మరియు శాసనమండలి సభ్యులు సత్యం గారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని స్థానిక నాయకులకు చెప్పడం జరిగింది.
*ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు దోరవి బాబు, సిపిఐ మండల కార్యదర్శి నరేంద్ర ప్రసాద్ రాములు గౌడ్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు నరసింహారెడ్డి, స్థానిక నాయకులు మాజీ ఉపసర్పంచ్ జహంగీర్, గ్యార చంద్రయ్య, రాములు, బాలయ్య లతో పాటు తదితరులు పాల్గొన్నారు.*