మద్యం మత్తులో యువత చిత్తు
*అమ్మ కన్నీరు..నాన్న నిస్సహాయం
-మద్యం మత్తులో మునిగిన యువత భవిష్యత్తు
*-ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం కన్నా..ఆదాయమే ముఖ్యమా?*
ఒకప్పుడు ఇంటి ముందు నవ్వులు పూయిస్తూ..తల్లిదండ్రుల ఆశల దీపంగా వెలిగిన ఆ చిన్నారులు..పెరిగి పెద్దవారైన తర్వాత చెడు వ్యసనాలకు బానిసలై..మద్యం మత్తులో తమ భవిష్యత్తును తామే నాశనం చేసుకుంటున్నారు. కళాశాలలో పెనవేసుకున్న స్నేహబంధాలతో పాటు పుట్టి పెరిగిన ఊరిలో చిరుప్రాయం నుండే చిగురించిన చెడు స్నేహాలతో సరదాగా మొదలైన మద్యం అలవాటు క్రమంగా బలపడి బానిసత్వంగా మారి బాటిల్ మత్తులో తమ భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. కౌమార దశలో మొదలైన చిన్న చుక్క ఇప్పుడు కుటుంబాన్ని కుదిపేస్తున్న పెద్ద తుఫాన్ గా మారింది. కొడుకు మత్తును విడిచిపెట్టి మారుతాడని గంపేడు ఆశలు పెట్టుకున్న కన్న తల్లులు కన్నీరు మున్నీరవుతున్నారు. చెడు అలవాట్లకు బానిసలైన చెట్టంత ఎదిగిన కొడుకుని దండించలేని కన్నతండ్రులు నిస్సహాయంగా చూస్తూ..ఈ సమాజంలో మౌనంగా మగ్గిపోతున్నారు. కానీ మత్తులో మునిగిన యువతకు ఆ కన్నీళ్లు కనిపించడం లేదు. ఆ కన్నీళ్ల వెనుక దాగి ఉన్న కష్టం విలువ తెలియటం లేదు. మద్యం మత్తులో ప్రతిరోజు ఒక కుటుంబం చిత్తు అవుతూ చితికి పోతుంది. ప్రతిరోజు ఒక భవిష్యత్ మసకబారి చీకటిమయమవుతుంది. ఇది కేవలం ఒక ఇంటి కథ కాదు. సమాజాన్ని మొత్తం కుదిపే నిశ్శబ్ద విపత్తుపై ప్రత్యేక కథనం.
*-మద్యం మత్తులో మునిగిన యువత భవిష్యత్*
పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా యువతలో మద్యం అలవాటు రోజురోజుకీ పెరుగుతోంది. సరదాగా మొదలైన అలవాటు ఇప్పుడు బానిసత్వంగా మారి కుటుంబాలనే కాక సమాజాన్ని కలవరపెడుతోంది. చదువు, ఉద్యోగం, లక్ష్యాలు అన్ని పక్కన పెట్టి మద్యం మత్తులో జీవితాన్ని చిత్తు చేసుకుంటున్న యువత సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. కాలేజీ ప్రాంగాణాల నుంచి బెల్ట్ షాపుల వరకు యువకులు గుంపులుగా కనిపిస్తూ మద్యం సేవించడం సాధారణమైపోయింది. మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు, గొడవలు, కుటుంబ కలహాలు పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతుంటే..ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఆదాయం పేరుతో ఖజానా నింపుకుంటూ..మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నిరుద్యోగం ఒత్తిడి, చెడు స్నేహాలు, సోషల్ మీడియా ప్రభావం వంటి కారణాలు యువతను మద్యం వైపు నెడుతున్నాయి. ఒకసారి అలవాటు పడితే దాని నుంచి బయటపడడం కష్టమవుతుంది. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, నేరాల పెరుగుదల ఇవన్నీ మద్యం మత్తు వల్లే జరుగుతున్న దుష్పరిణామాలని పలువురు ఆరోపిస్తున్నారు. యువతే దేశ భవిష్యత్తు అంటారు. కానీ అదే యువత మద్యం మత్తులో చిత్తు అయితే సమాజం ఎలా ముందుకు సాగుతుంది? మద్యం నియంత్రణపై కఠిన చర్యలు, అవగాహన కార్యక్రమాలు, కుటుంబ స్థాయిలో పర్యవేక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
*-ప్రభుత్వాలకు ఆదాయమే ముఖ్యమా?*
మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర బడ్జెట్ లో కీలకంగా మారింది. కోట్ల రూపాయల ఆదాయం ఖజానాకు చేరుతుండగా, ఇదే సమయంలో యువత మద్యం మత్తులో బానిసలుగా మారుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. దీంతో ప్రజల్లో ఒక ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. ప్రభుత్వాలకు ప్రజల ఆరోగ్యం కన్నా..ఆదాయమే ముఖ్యమా? ఒకవైపు మద్యం నియంత్రణపై ప్రచారాలు, నినాదాలు..మరోవైపు మద్యం దుకాణాల విస్తరణ ఈ విరుద్ధ పరిస్థితి తల్లిదండ్రుల గుండెల్లో అనుమానాలను పెంచుతోంది.”మా పిల్లలు మద్యం మత్తులో నాశనం చేసుకుంటుంటే..ప్రభుత్వాలు మాత్రం ఆదాయ గణాంకాలు చూపుతున్నాయి” అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వాల వాదన వేరేలా ఉంటుంది. మద్యం పూర్తిగా నిషేధిస్తే అక్రమ రవాణా పెరుగుతుందని, నియంత్రిత విక్రయాల ద్వారా ఆదాయం సంపాదించి సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్నామని చెబుతుంటాయి. కానీ సామాజికవేత్తలు మాత్రం మద్యం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు, కుటుంబ విభేదాలు కలిపి చూస్తే ఆర్థిక లాభం కంటే నష్టం ఎక్కువేనని హెచ్చరిస్తున్నారు. ఆదాయం కోసం సమాజ భవిష్యత్తును ఫణంగా పెట్టాలా? లేక ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తు కాపాడే విధానాలపై దృష్టి పెట్టాలా? ఈ చర్చకు సమాధానం ఇవ్వాల్సింది మాత్రం ప్రభుత్వాలే.
*-దూరం చేయటానికి కఠిన చర్యలు చేపట్టాలి*
ఈ విషయంలో పోలీసులతో పాటు సంబంధిత ఎక్సైజ్ అధికారులు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మద్యం మత్తులో యువత దారి తప్పుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కేవలం ఆదాయం కోణంలో కాకుండా సామాజిక బాధ్యతతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. యువతను మద్యం నుంచి దూరం చేయడానికి కఠిన చర్యలు చేపట్టాలి. పాఠశాలలు, కాలేజీల సమీపంలో మద్యం దుకాణాలపై నిషేధం విధించాలి. అండర్ ఏజ్ కు మద్యం విక్రయించే వైన్ షాప్ నిర్వాహకులకు కఠిన శిక్షలు విధించాలి. రాత్రి వేళల్లో విక్రయాలపై పరిమితి విధించి, గస్తీలు పెంచి రాత్రివేళ అమ్మకాలకు అడ్డుకట్ట వేయాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనదారులపై ఉదాసీనత ప్రదర్శించకుండా ఉక్కు పాదం మోపాలి. స్కూల్లు, కాలేజీల్లో దుష్ప్రభావాలపై ప్రత్యేక సెషన్లుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. సోషల్ మీడియా, టీవీల ద్వారా అవగాహన ప్రచారాలు, మత్తు పదార్థాల వలన కుటుంబాలు పడుతున్న కష్టాలపై డాక్యుమెంటరీలు తీసి యువతను మరింత చైతన్యం చేయాలి.