నేటి సత్యం గబ్బిలాలపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం, ముఖ్యమంత్రి ఇంటికి పాదయాత్ర నిర్వహిస్తాం- నారాయణ CPI*
హైదరాబాద్ లోని జవహర్ నగర్, గబ్బిలాల పేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ని ఏర్పాటు చేయాలని CPI జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జవహర్ నగర్ లో ప్రభుత్వ పాఠశాల సాధన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన పబ్లిక్ హియరింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ, విద్యారంగం పట్ల తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని విడనాడాలని హితవు పలికారు. కేరళ వెళ్లి అక్కడి అభివృద్ధి పై విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి, హైదరాబాద్ మహానగరంలో విద్యకు దూరంగా ఉన్న విద్యార్థుల భవిష్యత్తు కోసం మాట్లాడాలని తెలిపారు. బీజేపీ నాయకుల కార్పోరేట్ పాఠశాల ప్రారంభానికి వెళ్ళిన రేవంత్ రెడ్డి, గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల కోసం ఎప్పుడు పునాది వేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. గబ్బిలాల పేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ఏర్పాటు కోసం, ముఖ్యమంత్రి ఇంటికి పాదయాత్ర నిర్వహిస్తామని అన్నారు. అలాగే డంపింగ్ యార్డ్ దుర్వాసనతో ప్రజలు బాధపడుతున్నారని, జవహర్ నగర్ నుండి *డంపింగ్ యార్డ్ ను* తరలించాలని, లేదంటే మనిషికో బుట్ట చెత్తను తీసుకొని, మున్సిపల్ ఆఫీస్ లో వేస్తామని హెచ్చరించారు. *తెలంగాణ విద్యాకమిషన్ సలహాదారులు వెంకట్ రెడ్డి* మాట్లాడుతూ విద్య అందకపోతే, భావిభారతం ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. విద్యా పరిరక్షణ కమిటీ నాయకులు ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ గారు మాట్లాడుతూ లక్ష మందికి పైగా విద్యార్థులు వున్న జవహర్ నగర్ లో కేవలం *2 హైస్కూల్లు* మాత్రమే వుండటం అన్యాయమన్నారు. మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు బాలకార్మికులుగా, మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారన్నారు. ప్రొఫెసర్ సూరెపల్లి సుజాత మాట్లాడుతూ అమ్మాయిలకు విద్య అందుబాటులో లేకపోవడంతో, బాల్య వివాహాల బారిన పడుతున్నారని అన్నారు. కన్నెగంటి రవి మాట్లాడుతూ అభివృద్ధి చెందింది అని చెపుతున్న తెలంగాణలో, పాఠశాల కోసం పోరాటం నిర్వహించాల్సి రావడం సిగ్గు చేటని అన్నారు.ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి ఎస్ బోస్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు దామోదర్ రెడ్డి, శంకర్, నర్సింహులు, ఏ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్, ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు రజనీకాంత్, మాజీ కార్పొరేటర్లు చిత్ర సుబ్రమణ్యం, మేకల లలిత మరియు శాంతి కోటేష్ గౌడ్ పాల్గొన్నారు.