(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం గన్నేరువరం మే 6
కాసింపేట రైతు వేదికలో ఘనంగా ‘రైతు వారోత్సవాలు’ – నేల ఆరోగ్యంపై శాస్త్రవేత్తల అవగాహన
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మండలంలోని కాసింపేట రైతు వేదికలో బుధవారం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అవగాహన సదస్సు మరియు రైతు వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూరు ఏడీఏ శ్రీధర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా జగిత్యాల పొలాస వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రవి, రామకృష్ణలు మాట్లాడుతూ.. పంట దిగుబడి పెరగాలంటే నేల ఆరోగ్యం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. రైతులు యూరియా, పురుగుమందుల వాడకాన్ని తగ్గించి, జీవన ఎరువుల వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు.బ్యాంకింగ్ సేవలపై అవగాహన:మే 4 నుండి 9 వరకు జరుగుతున్న రైతు వారోత్సవాల్లో భాగంగా ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ఆధ్వర్యంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. కేడీసీసీ బ్యాంకు మేనేజర్ రైతులకు అందుబాటులో ఉన్న రుణ సదుపాయాలు, ఇతర సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ ఆంజనేయులు, డైరెక్టర్లు బద్దం రామ్ రెడ్డి, బోయిని అంజయ్య, పురంశెట్టి బాలయ్య, అల్వాల కోటి పాల్గొన్నారు.అధికారుల సూచనలు:ఏడీఏ శ్రీధర్ మాట్లాడుతూ.. రైతులు పంట మార్పిడి పద్ధతులను పాటించాలని, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని కోరారు. ప్రభుత్వం సూచించిన సన్న రకాలను పండించి ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి మాట్లాడుతూ.. రైతులకు ఏ అవసరం వచ్చినా సలహాలు, సూచనలు అందించడానికి వ్యవసాయ శాఖ సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని తెలిపారు.ఆయిల్ పామ్ సాగుపై గ్రామ సర్పంచ్ కర్నె చంద్రయ్య మాట్లాడుతూ.. రైతులు లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాసింపేట, పారువెల్ల, మైలారం గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.